[1] దావీదురాజు ముసలివాడయ్యాడు. చాలా పెద్ద వయసు వచ్చింది. వారు అతనికి దుప్పట్లు కప్పినా ఇంకా చలిపెడుతూనే ఉంది.
[2] అందుచేత అతని సేవకులు అతనితో “మా యజమానులూ రాజూ అయిన మీ కోసం పడుచుకన్నెను వెదకడం మంచిది. రాజైన మీ దగ్గరే ఆమె ఉంటూ మిమ్మల్ని ఆదరిస్తుంది. మీ కౌగిట్లో ఆమె పడుకొంటే మా యజమానులైన రాజుకు వేడి కలుగుతుంది” అన్నారు.
[3] వాళ్ళు చక్కని యువతిని వెదకి వెదకి షూనేం గ్రామస్థురాలు అబీషగును చూచి రాజుదగ్గరికి తీసుకువచ్చారు.
[4] ఆ పడుచు చాలా అందకత్తె. ఆమె రాజును ఆదరిస్తూ అతనికి సేవ చేస్తూ ఉంది గాని రాజు ఆమెతో శయనించలేదు.
[5] తరువాత హగ్గీతు కొడుకు అదోనీయా “నేను రాజునవుతాను” అంటూ తనను హెచ్చించుకున్నాడు. రథాలనూ రౌతులనూ తనకు ముందు పరుగెత్తడానికి యాభైమంది మనుషులనూ ఏర్పాటు చేసుకొన్నాడు.
[6] అంతకు ముందు “ఇలా ఎందుకు చేశావు?” అని అతని తండ్రి అతణ్ణి ఎన్నడూ అడ్డగించినవాడు కాడు. అతడు చాలా అందమైన వాడు. అబ్‌షాలోం తరువాత పుట్టినవాడు.
[7] అతడు సెరూయా కొడుకు యోవాబుతో అబ్యాతారుయాజితో సమాలోచన జరిపాడు. వాళ్ళు అతడి పక్షం వహించి సహాయం చేశారు.
[8] కానీ సాదోకుయాజి, యెహోయాదా కొడుకు బెనాయా, నాతానుప్రవక్త, షిమీ, రేయీ, దావీదుకు చెందిన శూరులు అదోనీయాతో ఏకీభవించలేదు.
[9] అదోనీయా గొర్రెలనూ ఎడ్లనూ బాగా బలిసిన దూడలనూ ఏన్‌రోగెల్ దగ్గర ఉన్న జోహెలేతు రాయి దగ్గర బలిగా అర్పించాడు. ఆ సమయంలో అతడు తన తోబుట్టువులైన రాకుమారులందరినీ యూదా వారిలో రాజు పరివారాన్నంతా అక్కడికి పిలిచాడు.
[10] కానీ నాతానుప్రవక్తనూ బెనాయానూ దావీదుకు చెందిన శూరులనూ తన తమ్ముడైన సొలొమోనునూ పిలవలేదు.
[11] అప్పుడు సొలొమోను తల్లి అయిన బత్‌షెబతో నాతాను “హగ్గీతు కొడుకు అదోనీయా రాజయ్యాడని మీరు వినలేదా? మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదు.
[12] ఇప్పుడు మీకో సలహా చెప్పనివ్వండి. మీ ప్రాణాన్ని మీ కొడుకు సొలొమోను ప్రాణాన్ని ఇలా దక్కించుకోవాలి:
[13] మీరు దావీదు రాజు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఈ విధంగా చెప్పండి: ‘నా యజమానీ! రాజా! మీ తరువాత నా కొడుకు సొలొమోను తప్పక సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తాడని మీ దాసురాలైన నాతో శపథం చేశారు గదా! మరి, అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’
[14] మీరు రాజుతో అలా చెపుతుండగానే నేను మీ వెనుకే లోపలికి వచ్చి మీ మాటలు బలపరుస్తాను.”
[15] అందుచేత బత్‌షెబ లోపలి గదిలోకి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు చాలా ముసలివాడు. అతనికి షూనేం గ్రామస్థురాలు అబీషగు పరిచర్య చేస్తూ ఉంది.
[16] బత్‌షెబ రాజు ఎదుట సాగిలపడింది. రాజు “నీకేం కావాలి?” అని అడిగాడు.
[17] ఆమె అతనితో ఇలా అంది: “నా యజమానీ! మీ తరువాత నా కొడుకు సొలొమోను తప్పక మీ సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తాడని మీ దేవుడైన యెహోవా పేర మీ దాసురాలైన నాతో శపథం చేశారు.
[18] మరి వినండి. నా యజమానులైన రాజా, మీకు తెలియకుండానే అదోనీయా రాజయ్యాడు.
[19] అతడు చాలా ఎడ్లనూ బలిసిన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ అబ్యాతారు యాజినీ సేనాధిపతి అయిన యోవాబునూ పిలిచాడు. మీ దాసుడైన సొలొమోనును మాత్రం పిలవలేదు.
[20] నా యజమానులైన రాజా! మీ తరువాత ఎవరు సింహాసనం ఎక్కుతారో అని ఇస్రాయేల్ వారంతా మీ మాటకోసం ఎదురు చూస్తున్నారు.
[21] నా యజమానులైన రాజా, మీరేమీ చెప్పకపోతే మీరు కన్ను మూసి మీ పూర్వీకుల దగ్గరికి చేరిన తరువాత వారు నన్నూ నా కొడుకు సొలొమోన్నూ అపరాధులుగా ఎంచుతారు.”
[22] ఆమె రాజుతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే నాతానుప్రవక్త లోపలికి వచ్చాడు.
[23] “ఇడుగో! నాతానుప్రవక్త వచ్చాడ”ని రాజుకు తెలియజేశారు. అతడు రాజు ఎదుటికి వచ్చి రాజుకు సాష్టాంగపడ్డాడు.
[24] అప్పుడు నాతాను ఇలా అన్నాడు: “నా యజమానీ, రాజా, మీ తరువాత అదోనీయా మీ సింహాసనం ఎక్కి పరిపాలిస్తాడని మీరు చెప్పారా?
[25] ఇవ్వేళే అతడు వెళ్ళి చాలా ఎడ్లనూ బలిసిన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించాడు. రాకుమారులందరినీ సేనాధిపతులనూ అబ్యాతారుయాజినీ పిలిచాడు. ఇప్పుడే వారు అతడి సముఖంలో అన్నపానాలు చేస్తూ ‘అదోనీయరాజు చిరకాలం జీవించాలి’ అంటున్నారు.
[26] కానీ మీ దాసుడైన నన్నూ సాదోకుయాజినీ యెహోయాదా కొడుకు బెనాయానూ మీ దాసుడైన సొలొమోన్నూ అతడు పిలవలేదు.
[27] ఒకవేళ ఈ సంగతి నా యజమానులూ రాజులూ అయిన మీ ఆజ్ఞమేరకే జరుగుతూ ఉంటే, మీ తరువాత ఎవరు సింహాసనం ఎక్కుతారో ఆ సంగతి మీ దాసులతో చెప్పలేదన్నమాటే.”
[28] అందుకు దావీదురాజు “బత్‌షెబను తిరిగి నా దగ్గరికి రమ్మను” అన్నాడు. బత్‌షెబ లోపలికి తిరిగి వచ్చి రాజు ముందర నిలబడింది.
[29] అప్పుడు రాజు శపథం చేస్తూ ఇలా అన్నాడు: “అన్ని ఆపదలనుంచి నన్ను రక్షించిన యెహోవా జీవంమీద ఆనబెట్టి చెపుతున్నాను –
[30] నా తరువాత నీ కొడుకు సొలొమోను తప్పక నా స్థానంలో సింహాసనమెక్కి పరిపాలన చేస్తాడని ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా పేర శపథం చేశాను. ఈ వేళే అలా జరిగించి తీరుతాను.”
[31] బత్‌షెబ రాజు ముందర సాష్టాంగపడి “నా యజమానులైన దావీదురాజు సదా జీవిస్తాడు గాక” అంది.
[32] దావీదురాజు “సాదోకుయాజినీ నాతానుప్రవక్తనూ యెహోయాదా కొడుకు బెనాయానూ నా దగ్గరికి రమ్మను” అన్నాడు. వారు రాజు సమక్షంలోకి వచ్చాక
[33] రాజు వారితో ఇలా అన్నాడు: “మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకొని నా కొడుకు సొలొమోనును నా సొంత కంచరగాడిదపై ఎక్కించి గీహోన్ ఊటదగ్గరికి తీసుకుపోండి.
[34] అక్కడ సాదోకుయాజి, నాతానుప్రవక్త ఇస్రాయేల్‌ప్రజల పై రాజుగా అతణ్ణి అభిషేకించాలి. పొట్టేలుకొమ్ము బూర ఊదుతూ ‘సొలొమోను రాజు చిరకాలం జీవించాలి’ అని చాటించండి.
[35] అతడు తిరిగి వచ్చినప్పుడు మీరు అతని వెంట రావాలి. అతడు వచ్చి నా సింహాసనం మీద కూర్చోవాలి. నేనతణ్ణి ఇస్రాయేల్, యూదా ప్రజలపై రాజుగా నియమించాను. అతడు నా స్థానంలో పరిపాలన చేస్తాడు.”
[36] యెహోయాదా కొడుకు బెనాయా రాజుకు జవాబిస్తూ “తథాస్తు! నా యజమానులైన రాజుయొక్క దేవుడు యెహోవా ఆ మాట స్థిరపరుస్తాడు గాక!
[37] నా యజమానులైన రాజుకు యెహోవా తోడుగా ఉన్నట్టే సొలొమోనుకు కూడా ఉంటాడు గాక! నా యజమానులైన దావీదురాజు పరిపాలనకంటే సొలొమోను పరిపాలన గొప్ప చేస్తాడు గాక!” అన్నాడు.
[38] అప్పుడు సాదోకుయాజి, నాతానుప్రవక్త, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతివారు, పెలేతివారు వెళ్ళి సొలొమోనును దావీదురాజు కంచరగాడిదపై ఎక్కించి గీహోన్ ఊటదగ్గరికి తీసుకుపోయారు.
[39] సాదోకుయాజి దేవుని గుడారంలో నుంచి నూనె ఉన్న కొమ్ము తీసుకొని సొలొమోనును అభిషేకించాడు. వారు పొట్టేలుకొమ్ము ఊదుతూ ఉంటే జనమంతా “సొలొమోనురాజు చిరకాలం జీవించాలి” అని కేకలు పెట్టారు.
[40] ప్రజలంతా సొలొమోనును అనుసరిస్తూ వచ్చారు. వారు పిల్లనగ్రోవులు ఊదుతూ ఆనందభరితులై సంబరపడుతూ ఉన్నారు. వారు చేసే ధ్వనికి నేల కంపించింది.
[41] అదోనీయా, అతనితో ఉన్న అతిథులందరూ తినడం ముగించబోతూవుంటే ఆ శబ్దం వారికి వినిపించింది. పొట్టేలుకొమ్ము ధ్వని విని యోవాబు “నగరం సందడిగా ఉండడం దేనికి?” అన్నాడు.
[42] అతడు అలా మాట్లాడుతుండగానే అబ్యాతారుయాజి కొడుకు యోనాతాను అక్కడికి చేరాడు. అదోనీయా అతడితో “లోపలికి రా. నువ్వు వీరుడివి. శుభవార్త తెస్తున్నావు” అన్నాడు.
[43] యోనాతాను అదోనీయాకు ఇలా జవాబిచ్చాడు: “కానీ మన యజమానులైన దావీదురాజు సొలొమోన్ను రాజుగా చేశాడు.
[44] రాజు సాదోకుయాజినీ నాతానుప్రవక్తనూ యెహోయాదా కొడుకు బెనాయానూ కెరేతివారినీ పెలేతివారినీ అతడితోపాటు పంపించాడు. వారతణ్ణి రాజు కంచరగాడిదపై ఎక్కించి వెళ్ళారు.
[45] సాదోకుయాజి, నాతాను ప్రవక్త అతణ్ణి గీహోను దగ్గర రాజుగా అభిషేకించారు. అక్కడనుంచి వారు సంబరపడుతూ వచ్చారు. అందుకే నగరం సందడిగా ఉంది. మీకు వినిపించిన ధ్వని అదే.
[46] అంతే గాక, సొలొమోను రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు.
[47] పైగా రాజు పరివారం మన యజమానులైన దావీదురాజును దీవించడానికి వచ్చారు, ‘మీ పేరుకంటే సొలొమోను పేరు ఎక్కువ ఘనమైనదిగా, మీ పరిపాలనకంటే ఆయన పరిపాలనను గొప్పదిగా దేవుడు చేస్తాడు గాక!’ అన్నారు. రాజు పడక మీదే దేవుణ్ణి ఆరాధించాడు.
[48] రాజు ఇలా చెప్పాడు కూడా: ‘ఈ వేళ ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా నా సింహాసనం ఎక్కడానికి ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను చూడగలిగాను. యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక!’”
[49] అప్పుడు అదోనీయా పిలిచినవాళ్ళంతా హడలిపోయి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
[50] అదోనీయా కూడా సొలొమోనుకు భయపడి లేచి వెళ్ళి బలిపీఠం మీద ఉన్న కొమ్ములను పట్టుకొన్నాడు.
[51] సొలొమోనుతో “అదోనీయా సొలొమోనురాజుకు భయపడి, బలిపీఠం మీద ఉన్న కొమ్ములను పట్టుకొని సొలొమోనురాజు తన దాసుడైన తన్ను ఖడ్గంతో చంపడని తనకు శపథం చేయాలంటున్నాడు” అని ఎవరో చెప్పారు.
[52] అందుకు సొలొమోను “అతడు నిజాయితీపరుడుగా ఉంటే అతడి తలవెంట్రుక ఒక్కటి కూడా నేలమీదికి రాలదు. కానీ అతడిలో దుర్మార్గం కనిపిస్తే చస్తాడు” అన్నాడు.
[53] సొలొమోనురాజు మనుషులను బలిపీఠం దగ్గరికి పంపాడు. వారతణ్ణి అక్కడనుంచి తీసుకువచ్చినప్పుడు అతడు సొలొమోనురాజు ముందర సాష్టాంగపడ్డాడు. సొలొమోను అతడితో “నీవు ఇంటికి వెళ్ళు” అన్నాడు.