[1] కొన్ని రోజులయిన తరువాత ఆయన కపెర్‌నహూంకు తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చి నప్పుడు
[2] తక్షణమే చాలామంది అక్కడ గుమికూడారు. వారికి ఇంట్లో చేరడానికి తలుపుదగ్గర కూడా స్థలం లేకపోయింది. ఆయన వారికి దేవుని వాక్కు ప్రకటించాడు.
[3] అప్పుడు ఒక పక్షవాత రోగిని నలుగురు మనుషులు ఆయన ఉన్న ఇంటికి మోసుకువచ్చారు.
[4] జన సమూహం ఒత్తిడిని బట్టి యేసుదగ్గరకు అతణ్ణి తీసుకురాలేక, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు ఊడదీసి సందు చేసి దాని గుండా పక్షవాత రోగి పడుకొని ఉన్న పరుపును దింపారు.
[5] యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
[6] ధర్మశాస్త్ర పండితులు కొందరు అక్కడ కూర్చుని ఉన్నారు. వారి హృదయాలలో ఇలా ఆలోచించుకొన్నారు:
[7] “ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడేమిటి! దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు తప్ప పాపాలు క్షమించగలవారెవరు?”
[8] వారు లోలోపల అలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వెంటనే వారితో అన్నాడు, “మీ హృదయాలలో ఈ విషయాలు ఆలోచించడం ఎందుకు?
[9] ఏది సులభం? పక్షవాత రోగితో ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు’ అనడమా?
[10] అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి.” అలా చెప్పి ఆయన పక్షవాత రోగితో
[11] “నీతో నేనంటున్నాను, లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళు.”
[12] అతడు వెంటనే లేచి పరుపెత్తుకొని వారందరి సమక్షంలో బయటికి నడుస్తూ వెళ్ళాడు. గనుక వారంతా విస్మయం చెంది, “మనం ఇలాంటిదేదీ ఎన్నడూ చూడలేదు” అంటూ దేవుణ్ణి స్తుతించారు.
[13] ఆయన సరస్సు ఒడ్డుకు తిరిగి వెళ్ళాడు. జనమంతా ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారికి ఉపదేశించాడు.
[14] ఆయన ముందుకు నడిచి వెళ్తూ ఉంటే సుంకం వసూలు చేసే స్థానంలో అల్ఫయి కొడుకు లేవీ కూర్చుని ఉండడం చూశాడు. అతడితో “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.
[15] ఆ తరువాత యేసు అతడి ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు సుంకంవారూ పాపులూ అనేకులు ఆయనతోను ఆయన శిష్యులతోను కూర్చున్నారు. అలాంటివారు చాలా మంది ఆయన వెంట వెళ్ళేవారు.
[16] ఆయన పాపులతో, సుంకంవారితో కలిసి భోజనం చేయడం ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు చూచినప్పుడు ఆయన శిష్యులతో వారు అన్నారు “ఇతడు సుంకంవారితో, పాపులతో కలిసి భోజన పానాలు చేస్తున్నాడేమిటి?”
[17] అది విని యేసు వారితో అన్నాడు “జబ్బు చేసినవారికే వైద్యుడు అవసరం గానీ బాగున్న వారికి కాదు. నేను పాపులనే పశ్చాత్తాపపడాలని పిలవడానికి వచ్చాను గానీ న్యాయవంతులను కాదు.”
[18] యోహాను శిష్యులూ పరిసయ్యులూ ఉపవాసం ఉన్నప్పుడు వారు వచ్చి “యోహాను శిష్యులూ పరిసయ్యుల శిష్యులూ ఉపవాసముంటారు గదా. మరి, మీ శిష్యులు ఉపవాసముండరేమిటి?” అని ఆయనను అడిగారు.
[19] యేసు వారికిలా జవాబిచ్చాడు: “పెళ్ళి కుమారుడు తమతో ఉన్నప్పుడు ఆయన ఇంటివారు ఉపవాసం ఉండగలరా? పెళ్ళి కుమారుడు తమతో ఉన్నంత కాలం వారు ఉపవాసముండలేరు.
[20] అయితే పెళ్ళికుమారుణ్ణి వారి దగ్గరనుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసముంటారు.
[21] పాత వస్త్రానికి క్రొత్త బట్ట ఎవరూ మాసిక వేయరు. వేస్తే ఆ క్రొత్త మాసిక పాత వస్త్రంనుంచి చించుకొంటుంది. చినుగు పెద్దదవుతుంది.
[22] ఎవరూ కూడా క్రొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోయరు. పోస్తే, క్రొత్త రసంవల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులూ పాడవుతుంది. క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలో పోయాలి.”
[23] విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో పడి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు వెళ్తూ కంకులు తెంపుకోసాగారు.
[24] అప్పుడు పరిసయ్యులు ఆయనతో “చూడు, విశ్రాంతి దినాన చేయకూడని పని వారు చేస్తున్నారేమిటి?” అన్నారు.
[25] ఆయన వారితో అన్నాడు “దావీదు, అతనితో ఉన్నవారు అక్కరలో ఉండి ఆకలిగొన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరెన్నడూ చదవలేదా?
[26] అబ్యాతార్ ప్రముఖ యాజిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించాడు, సన్నిధి రొట్టెలు తిన్నాడు, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు. ఆ రొట్టెలు యాజులు తప్ప మరెవ్వరూ తినకూడదు.”
[27] అప్పుడాయన వారితో “విశ్రాంతి దినం మనుషుల కోసమే గానీ మనుషులు విశ్రాంతిదినం కోసం చేయబడలేదు.
[28] అందుచేత మానవ పుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!” అన్నాడు.