Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:48

[1] దేవుని కుమారుడైన యేసు క్రీస్తు శుభవార్తఆరంభం.

[2] ప్రవక్తల రచనల్లో ఇలా ఉంది: ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ఎదుట నీ దారి సిద్ధం చేస్తాడు.

[3] “ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది: ప్రభువుకోసం దారి సిద్ధం చేయండి! ఆయనకోసం త్రోవలు తిన్ననివి చేయండి!”

[4] బాప్తిసమిచ్చే యోహాను అరణ్యంలో కనిపించి పాపక్షమాపణ గురించిన పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసం ప్రకటిస్తూ ఉన్నాడు.

[5] యూదయ ప్రదేశంవారూ జెరుసలం నగరవాసులూ అందరూ అతని దగ్గరకు వెళ్ళారు, తమ పాపాలను ఒప్పుకొంటూ అతనిచేత యొర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు.

[6] యోహాను ఒంటె రోమాల బట్టలు తొడుక్కొని నడుముకు తోలు దట్టీ కట్టుకొనేవాడు, మిడతలు, అడవి తేనె తినేవాడు.

[7] అతడు ప్రకటిస్తూ “నాకంటే బలప్రభావాలు ఉన్నవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను.

[8] నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చాను. కానీ ఆయన దేవుని పవిత్రాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.

[9] ఆ రోజులలో యేసు గలలీలోని నజరేతు నుంచి వచ్చి యోహానుచేత యొర్దానులో బాప్తిసం పొందాడు.

[10] నీళ్ళ నుంచి ఆయన రాగానే ఆకాశం చీలిపోవడం, దేవుని ఆత్మ పావురంలాగా తన మీదికి దిగిరావడం చూశాడు.

[11] అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”

[12] వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్యంలోకి త్రోసుకువెళ్ళాడు.

[13] యేసు అరణ్యంలో నలభై రోజులు సైతానుచేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. అడవి మృగాల మధ్య ఉన్నాడు. దేవదూతలు ఆయనకు సేవ చేశారు.

[14] యోహాను ఖైదుపాలయిన తరువాత యేసు గలలీకి వచ్చి దేవుని రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఇలా అన్నాడు:

[15] “కాలం పూర్తి అయింది. దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నది. పశ్చాత్తాపపడి శుభవార్త నమ్మండి.”

[16] ఆయన గలలీ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు సీమోను, అతడి తోబుట్టువు అంద్రెయ సరస్సులో వల వేయడం చూశాడు. వారు చేపలు పట్టేవారు.

[17] వారితో యేసు అన్నాడు “నా వెంట రండి! మనుషులను పట్టే జాలరులుగా మిమ్ములను చేస్తాను.”

[18] వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను అనుసరించారు.

[19] ఆయన ఇంకా కొద్ది దూరం వెళ్ళి జెబెదయి కొడుకు యాకోబునూ అతడి తోబుట్టువు యోహానునూ చూశాడు. వారు ఒక పడవలో ఉండి వలలు సిద్ధం చేసుకొంటూ ఉన్నారు.

[20] వెంటనే ఆయన వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని కూలివారితోపాటు పడవలోనే విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.

[21] వారు కపెర్‌నహూం వెళ్ళారు. వెంటనే, విశ్రాంతి దినాన, ఆయన యూద సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఉపదేశించాడు.

[22] అక్కడివారు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్ర పండితులలాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన ఉపదేశించాడు.

[23] అప్పుడు వారి సమాజ కేంద్రంలో మలిన పిశాచం పట్టినవాడొకడు ఉన్నాడు.

[24] అతడు “నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!” అంటూ బిగ్గరగా అరిచాడు.

[25] యేసు ఆ పిశాచాన్ని మందలిస్తూ “ఊరుకో. అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు.

[26] ఆ మలిన పిశాచం అతణ్ణి గిజగిజలాడించి పెడ బొబ్బ పెట్టి అతనిలోనుంచి బయటికి వచ్చింది.

[27] అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఏమిటిది! ఈ కొత్త ఉపదేశం ఏమిటి? ఆయన మలిన పిశాచాలకు సహా అధికారంతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో ఆయనకు లోబడుతున్నాయి!” అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొంటూ చెప్పుకొన్నారు.

[28] త్వరలోనే ఆయనను గురించి కబుర్లు గలలీ ప్రాంతం చుట్టుప్రక్కలా అంతటా వ్యాపించాయి.

[29] సమాజ కేంద్రంనుంచి బయటికి వచ్చిన వెంటనే వారు సీమోను అంద్రెయల ఇంటికి వెళ్ళారు. వారితోపాటు యాకోబు, యోహాను వచ్చారు.

[30] సీమోను అత్త జ్వరంతో పడి ఉంది. వెంటనే ఆమెను గురించి వారాయనతో చెప్పారు.

[31] ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని ఆమెను లేవనెత్తగానే జ్వరం పోయింది. ఆమె వారికి పరిచర్య చేయసాగింది.

[32] సాయంకాల సమయాన ప్రొద్దు క్రుంకిన తరువాత ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టినవారందరినీ ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.

[33] పట్టణమంతా ఆ తలుపు దగ్గర గుమికూడారు.

[34] ఆయా జబ్బులతో ఉన్నవారిని అనేకులను ఆయన బాగు చేశాడు, అనేక దయ్యాలను బయటికి వెళ్ళగొట్టాడు. తాను ఎవరో దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.

[35] వేకువ జామున, పగలుకు చాలా సేపటికి ముందు, ఆయన లేచి నిర్జన స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు.

[36] సీమోను, అతనితో ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్ళారు.

[37] ఆయన కనబడ్డప్పుడు “అందరూ నీకోసం వెదకుతున్నారు” అని ఆయనతో అన్నారు.

[38] వారితో ఆయన “దగ్గరగా ఉన్న గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను వచ్చినది ఇందుకు” అన్నాడు.

[39] ఆయన గలలీలో నలుదిక్కులకూ పర్యటిస్తూ యూదుల సమాజ కేంద్రాలలో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్ళగొట్టివేస్తూ ఉన్నాడు.

[40] కుష్ఠురోగి ఒకడు ఆయనదగ్గరకు వచ్చి ఆయనముందు మోకరిల్లి “మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు” అంటూ బ్రతిమిలాడాడు.

[41] యేసుకు జాలి వేసింది. చేయి చాచి అతణ్ణి తాకి అతడితో “నాకిష్టమే. శుద్ధంగా ఉండు!” అన్నాడు.

[42] ఆయన మాట్లాడిన వెంటనే అతడి కుష్ఠు పోయింది, అతడు శుద్ధమయ్యాడు.

[43] అతణ్ణి వెంటనే పంపివేస్తూ ఆయన ఇలా గట్టిగా హెచ్చరిస్తూ అతడితో అన్నాడు, “చూడు, ఈ విషయం ఎవరితో ఏమీ చెప్పకు!

[44] అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా నీ శుద్ధికోసం మోషే ధర్మశాస్త్రంలో విధించినవాటిని అర్పించు.”

[45] కానీ అతడు వెళ్ళి ఈ సంగతి అధికంగా చాటిస్తూ విస్తరింపజేయసాగాడు. అందుచేత యేసు ఏ పట్టణంలోకీ బహిరంగంగా వెళ్ళలేక నిర్జన ప్రదేశాలలో ఉండిపోవలసి వచ్చింది. అయినా నలుదిక్కుల నుంచీ జనులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు.

మార్కు శుభవార్త — Chapters