Skip to content
Opens in a new window
Listen to this chapter • 13:31

[1] రెండు రోజుల తరువాత పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ రాబోతూ ఉన్నాయి. అప్పుడు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా కపటంతో పట్టుకొని చంపాలా అని చూస్తూ ఉన్నారు.

[2] అయితే “ప్రజలలో అల్లరి జరగవచ్చు, గనక పండుగలో పట్టుకోవద్దు” అని వారు చెప్పుకొన్నారు.

[3] ఆయన బేతనీలో కుష్ఠురోగి సీమోను ఇంట్లో భోజన పంక్తిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమెదగ్గర చలవరాతి బుడ్డిలో చాలా విలువైన అచ్చ జటామాంసి అత్తరు ఉంది. ఆమె ఆ బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసింది.

[4] అయితే అక్కడున్న కొందరికి చిరాకు కలిగింది. “ఈ అత్తరు నష్టం చేయడం ఎందుకు?

[5] ఒకవేళ ఈ అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాలకంటే ఎక్కువగా వచ్చేవి. ఆ డబ్బు బీదలకిచ్చి ఉండవచ్చు గదా!” అని చెప్పుకొని ఆ స్త్రీని కసురుకొన్నారు.

[6] అయితే యేసు “ఈమె జోలికి వెళ్ళకండి! ఈమెను ఎందుకు తొందర చేస్తున్నారు? ఈమె నాపట్ల మంచి పని చేసింది.

[7] మీదగ్గర బీదలు ఎప్పుడూ ఉంటారు. మీకెప్పుడైనా ఇష్టం వస్తే వారికి మంచి చేయగలరు. నేనైతే మీదగ్గర ఎల్లప్పుడూ ఉండను.

[8] ఈమె చేయగలిగినది చేసింది. భూస్థాపనకోసం నా శరీరాన్ని ముందుగానే వచ్చి అభిషేకించింది.

[9] మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, సర్వలోకంలో ఈ శుభవార్త ప్రకటన జరిగే స్థలాలన్నిటిలో, ఈమె చేసినదాని గురించి చెప్పడం జరుగుతుంది. అది ఆమె విషయం జ్ఞాపకార్థంగా ఉంటుంది” అన్నాడు.

[10] పన్నెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆయనను వారికి పట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాన యాజుల దగ్గరికి వెళ్ళిపోయాడు.

[11] అది విని వారు సంతోషించారు. అతడికి కొంత డబ్బిస్తామని కూడా మాట ఇచ్చారు. ఇక అతడు యేసును పట్టి ఇవ్వడానికి అనువైన సమయంకోసం చూస్తూ ఉన్నాడు.

[12] పొంగని రొట్టెల పండుగ మొదటి రోజున, పస్కా గొర్రెపిల్లను వధించే ఆ రోజున, యేసు శిష్యులు ఆయనను ఇలా అడిగారు: “నీవు పస్కాను తినడానికి మేము ఏ స్థలానికి వెళ్ళి సిద్ధం చేయాలని ఉన్నావు?”

[13] ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ “నగరంలోకి వెళ్ళండి. అక్కడ మీకెదురుగా ఒకతను నీళ్ళకుండ మోసుకువస్తూ ఉంటాడు. అతని వెంట వెళ్ళండి.

[14] అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే మీరు ఆ ఇంటి యజమానిని చూచి ఇలా చెప్పండి: ‘నేను నా శిష్యులతో కూడా పస్కాను తినడానికి అతిథి శాల ఎక్కడని గురువు అంటున్నాడు’.

[15] అతడు పెద్ద మేడ గది మీకు చూపుతాడు. దానిలో సామాను అమర్చిపెట్టి సిద్ధంగా ఉంటుంది. అక్కడే మనకు ఏర్పాట్లు చేయండి.”

[16] అలాగే శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళి తమతో ఆయన చెప్పినట్టే చూశారు, పస్కాను సిద్ధం చేశారు.

[17] సాయంకాలం అయినప్పుడు ఆయన తన పన్నెండు మందితో పాటు అక్కడికి వచ్చాడు.

[18] వారు కూర్చుని భోజనం చేస్తూ ఉంటే యేసు వారితో “మీతో ఖచ్చితంగా అంటున్నాను, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టి ఇస్తాడు” అన్నాడు.

[19] వారికి దుఃఖం కలిగింది. “నేను కాదు గదా!” అని వారు ఒకడి తరువాత ఒకడు అన్నారు. మరొకడు “నేను కాదు గదా!” అన్నాడు.

[20] ఆయన వారితో “అతడు ఈ పన్నెండుమందిలో ఒకడు, నాతోకూడా పాత్రలో చేయి ముంచేవాడే!

[21] ఎందుకంటే, మానవ పుత్రుణ్ణి గురించి వ్రాసి ఉన్న ప్రకారమే ఆయన చనిపోతాడు గాని అయ్యో, ఎవడైతే మానవపుత్రుణ్ణి శత్రువులకు పట్టి ఇస్తాడో ఆ మనిషికి శిక్ష తప్పదు! ఆ మనిషి పుట్టి ఉండకపోతే అతనికి బాగుండేది” అని చెప్పాడు.

[22] వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని దీవించిన తరువాత దానిని విరిచి వారికిచ్చి “దీనిని తీసుకొని తినండి. ఇది నా శరీరం” అన్నాడు.

[23] అప్పుడాయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించిన తరువాత వారికిచ్చాడు. పాత్రలోది వారందరూ త్రాగారు.

[24] వారితో ఆయన “ఇది నా రక్తం. అనేకులకోసం చిందే క్రొత్త ఒడంబడిక రక్తం.

[25] మీతో ఖచ్చితంగా అంటున్నాను, దేవుని రాజ్యంలో ద్రాక్షరసం మళ్ళీ త్రాగే రోజువరకు ఇక దానిని త్రాగను” అన్నాడు.

[26] వారు కీర్తన పాడిన తరువాత ఆలీవ్ కొండకు వెళ్ళారు.

[27] అప్పుడు యేసు వారితో అన్నాడు, “ఈ రాత్రి నా కారణంగా మీరందరూ తొట్రుపడుతారు. ఎందుకంటే ఇలా వ్రాసివుంది: కాపరిని కొడతాను. గొర్రెలు చెదరిపోతాయి.

[28] అయినా నేను సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలలీకి వెళ్ళిపోతాను.”

[29] అయితే పేతురు ఆయనతో “అందరూ తొట్రుపడినా నేను తొట్రుపడను” అన్నాడు.

[30] అప్పుడు యేసు “నీతో ఖచ్చితంగా అంటున్నాను, ఈ రోజునే, కోడి రెండు సార్లు కూసేముందు ఈ రాత్రే నన్నెరగనని మూడు సార్లు అంటావు” అని అతనితో అన్నాడు.

[31] “నేను నీతో చావ వలసివచ్చినా నిన్ను ఎరగననను” అని అతడు మరీ గట్టిగా చెప్పాడు. వారంతా అలాగే అన్నారు.

[32] వారు గెత్‌సేమనే అనే స్థలానికి చేరారు. అప్పుడు ఆయన తన శిష్యులతో “నేను ప్రార్థన చేస్తాను. ఈలోగా మీరిక్కడ కూర్చుని ఉండండి” అన్నాడు.

[33] అప్పుడాయన పేతురునూ యాకోబునూ యోహానునూ తీసుకువెళ్ళి విస్మయం, కలత అనుభవించసాగాడు.

[34] అప్పుడు వారితో “నాకు ప్రాణం పోయేటంతగా దుఃఖం ముంచుకు వస్తూ ఉంది. మీరిక్కడ ఆగి మెళకువగా ఉండండి” అన్నాడు.

[35] ఆయన ఇంకా కొద్ది దూరం వెళ్ళి నేలమీద సాగిలపడి సాధ్యమైతే ఆ ఘడియ తననుంచి తప్పిపోవాలని ప్రార్థన చేశాడు.

[36] “తండ్రీ! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నానుంచి తొలగించు. అయినా నేను ఇష్టపడేది కాదు, నీవు ఇష్టపడేదే జరగనియ్యి” అన్నాడు.

[37] ఆయన వచ్చి వారు నిద్రపోతూ ఉండడం చూచి పేతురుతో “సీమోనూ, నిద్రపోతున్నావా? ఒక్క గంటసేపు కూడా మెళకువగా ఉండలేకపోయావా?

[38] మీరు విషమ పరీక్షలో పడకుండా మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం దుర్బలం” అన్నాడు.

[39] ఆయన మళ్ళీ వెళ్ళి మునుపు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు.

[40] తిరిగి వచ్చి వారు మళ్ళీ నిద్రపోతూ ఉండడం చూశాడు. ఎందుకంటే, వారి కండ్లు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకేమి జవాబివ్వాలో వారికి తోచలేదు.

[41] మూడో సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు: “మీరింకా నిద్రపోతూ విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇక చాలు! ఆ ఘడియ వచ్చింది. ఇదిగో వినండి, మానవపుత్రుణ్ణి పాపుల చేతులకు పట్టి ఇవ్వడం జరుగుతున్నది.

[42] లెండి, వెళ్దాం! ఇడుగో, నన్ను పట్టి ఇచ్చేవాడు దగ్గరలో ఉన్నాడు.”

[43] వెంటనే, ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుమందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజుల, ధర్మశాస్త్ర పండితుల, పెద్దల దగ్గరనుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితోకూడా ఉంది. వారికి కత్తులూ కటార్లూ ఉన్నాయి.

[44] ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు చెపుతూ “నేనెవరిని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రంగా తీసుకువెళ్ళండి” అన్నాడు.

[45] అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరకు వచ్చి “బోధకా! బోధకా!” అంటూ ఆయనను ముద్దు పెట్టుకొన్నాడు.

[46] వారు ఆయనపైబడి చేతులతో పట్టుకొన్నారు.

[47] అయితే ప్రక్కగా నిలుచున్నవారిలో ఒకడు తన ఖడ్గం దూసి ప్రముఖ యాజి దాసుణ్ణి కొట్టి అతడి చెవి నరికివేశాడు.

[48] యేసు వారితో ఇలా అన్నాడు: “నేను దోపిడీ దొంగనయినట్టు మీరు కత్తులూ కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి?

[49] ప్రతి రోజూ నేను దేవాలయంలో ఉపదేశిస్తూ మీ దగ్గరే ఉండేవాణ్ణి గదా. అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. కానీ లేఖనాలు నెరవేరాలి.”

[50] అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచి పారిపోయారు.

[51] నారబట్ట మాత్రమే తన నగ్న శరీరంమీద వేసుకొన్న ఒక యువకుడు యేసు వెంట వచ్చాడు. యువకులు అతణ్ణి పట్టుకొన్నారు.

[52] కానీ అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి వారిదగ్గరనుంచి దిసమొలతో పారిపోయాడు.

[53] వారు యేసును ప్రముఖ యాజి దగ్గరకు తీసుకువెళ్ళారు. అతడి దగ్గర ప్రధాన యాజులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ అందరూ సమకూడి ఉన్నారు.

[54] పేతురు యేసును ఎడం ఎడంగా అనుసరిస్తూ ప్రముఖ యాజి ఇంటి ముంగిటిలోకి వచ్చాడు. భటులతో కూర్చుని మంట దగ్గర చలి కాచుకొంటూ ఉన్నాడు.

[55] ప్రధాన యాజులూ యూద సమాలోచన సభ అంతా యేసుకు మరణశిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యంకోసం చూస్తూ ఉన్నారు గాని అది దొరకలేదు.

[56] అనేకులు ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు గాని వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొందిక లేకుండా ఉన్నాయి.

[57] అప్పుడు కొందరు నిలబడి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెపుతూ

[58] “ఇతడు ‘చేతులతో చేసిన ఈ దేవాలయాన్ని నేను నాశనం చేసి మూడు రోజులలో చేతులతో కాకుండా మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం విన్నాం” అన్నారు.

[59] గానీ ఇందులో కూడా వారి సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొందిక లేకుండా ఉన్నాయి.

[60] అప్పుడు ప్రముఖయాజి వారిమధ్య లేచి నిలబడి “నీవు జవాబేమీ చెప్పవా? ఈ మనుషులు నీకు వ్యతిరేకంగా చెపుతున్న సాక్ష్యమేమిటి?” అని యేసును అడిగాడు.

[61] ఆయన ఊరుకొన్నాడు. జవాబేమీ చెప్పలేదు. మళ్ళీ ప్రముఖ యాజి ఆయనను ప్రశ్నించాడు, “నీవు దివ్యుడైన దేవుని కుమారుడివా? అభిషిక్తుడివా?”

[62] అప్పుడు యేసు “నేనే ఆయనను. మానవపుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపున కూర్చుని ఉండడమూ ఆకాశ మేఘాలతో రావడమూ మీరు చూస్తారు.”

[63] ప్రముఖ యాజి తన బట్టలు చింపుకొని “మనకిక సాక్షులతో ఏం పని?

[64] ఈ దేవదూషణ మీరు విన్నారు గదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన చావుకు తగినవాడని వారంతా తీర్పు చెప్పారు.

[65] అప్పుడు కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన కండ్లు కప్పి ఆయనను గుద్దసాగారు. “ప్రవక్తగా పలుకు!” అని ఆయనతో చెప్పారు. భటులు కూడా ఆయనను చేతులతో కొట్టారు.

[66] ఈలోగా పేతురు క్రింద, ముంగిటిలో ఉన్నాడు. అప్పుడు ప్రముఖయాజి పనిపిల్లలలో ఒకతె వచ్చింది.

[67] పేతురు చలి కాచుకొంటూ ఉండడం ఆమెకు కనబడితే అతణ్ణి చూస్తూ ఆమె “నీవు కూడా నజరేతువాడైన యేసుతో ఉన్నావు కదూ!” అంది.

[68] అతడు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నువ్వు చెప్పేదేమిటో అర్థం కావడం లేదు!” అన్నాడు. అప్పుడతడు నడవలోకి వెళ్ళాడు. అప్పుడు కోడి కూసింది.

[69] ఆ పిల్ల అతణ్ణి మళ్ళీ చూచి ప్రక్కన నిలుచున్నవారితో “ఇతడు వాళ్ళలో ఒకడు” అంది.

[70] అతడు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి ప్రక్కన నిలుచున్నవారు మళ్ళీ పేతురుతో “నిజమే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే! నువ్వు గలలీవాడివే గదా! నీ మాట తీరు అది వెల్లడి చేస్తుంది” అన్నారు.

[71] అయితే అతడు ఒట్లూ శాపనార్థాలూ పెట్టుకొంటూ “మీరు చెప్పే ఆ మనిషిని నేనెరగను” అన్నాడు.

[72] అప్పుడు కోడి రెండో సారి కూసింది. “కోడి రెండు సార్లు కూసేముందే నన్నెరుగనని మూడు సార్లు అంటావు” అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు, దాన్ని గురించి తలపోస్తూ ఏడ్చాడు.

మార్కు శుభవార్త — Chapters