Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:04

[1] వారు జెరుసలం దరిదాపులకు వచ్చి ఆలీవ్‌ కొండమీద ఉన్న బేత్‌ఫగే, బేతనీ చేరుకొన్నారు. అప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ ఆయన వారితో ఇలా అన్నాడు:

[2] “మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిదపిల్ల ఒకటి మీకు కనబడుతుంది. ఇదివరకు దానిమీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకురండి.

[3] ‘మీరెందుకిలా చేస్తున్నారు?’ అని ఎవరైనా మీతో అంటే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దానిని ఇక్కడికి పంపిస్తాడు.”

[4] వారు వెళ్ళి వీధిలో ఒక గుమ్మం దగ్గర కట్టి ఉన్న ఆ గాడిద పిల్లను చూశారు, దానిని విప్పారు.

[5] అక్కడ నిలుచున్న కొందరు వారితో “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అన్నారు.

[6] యేసు చెప్పమన్నట్టే శిష్యులు వారితో చెప్పినప్పుడు వారు వారిని వెళ్ళనిచ్చారు.

[7] వారు గాడిద పిల్లను యేసు దగ్గరికి తోలుకువచ్చి దానిమీద తమ పైబట్టలు వేశారు. ఆయన దానిమీద కూర్చున్నాడు.

[8] అనేకులు తమ పైబట్టలు దారిన పరిచారు. మరి కొందరు చెట్ల కొమ్మలను నరికివేసి దారిన పరిచారు.

[9] ముందు నడుస్తూ ఉన్నవారూ వెనుక వస్తూ ఉన్నవారూ కేకలు వేస్తూ “జయం! ‘ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి!’

[10] ప్రభువు పేరట వచ్చే మన పూర్వీకుడైన దావీదు రాజ్యం ధన్యం! పరమ స్థలాల్లో జయం!” అన్నారు.

[11] యేసు జెరుసలంలో, దేవాలయంలో ప్రవేశించాడు, చుట్టూరా అన్నిటినీ చూశాడు. అప్పటికే సాయంకాలం అయిపోయినందుచేత ఆయన తన పన్నెండు మందితో బేతనీకు వెళ్ళాడు.

[12] మరుసటి రోజున బేతనీనుంచి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది.

[13] కొంత దూరంలో ఆకులున్న అంజూర చెట్టు ఒకటి ఆయనకు కనిపించింది. దానికేమైనా పండ్లు ఉంటాయేమో అని ఆయన దానివైపు వెళ్ళాడు గాని దానిదగ్గరకు వచ్చి చూస్తే ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. అది అంజూర పండ్ల కాలం కాదు.

[14] ఆయన దానితో “ఇకనుంచి తినడానికి పండ్లు నీమీద ఎవరికీ ఎన్నడూ దొరకకపోతాయి గాక!” అన్నాడు. అది ఆయన శిష్యులు విన్నారు.

[15] వారు జెరుసలం వచ్చినప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో అమ్మేవారినీ కొనేవారినీ వెళ్ళగొట్టసాగాడు. డబ్బు మారకం వ్యాపారుల బల్లలనూ గువ్వల వర్తకుల పీటలనూ పడద్రోశాడు.

[16] దేవాలయంలో గుండా ఎవరినీ సామానేమీ మోసుకు వెళ్ళనివ్వలేదు.

[17] ఆయన వారికి ఉపదేశిస్తూ “నా ఆలయం జనాలన్నిటికీ ప్రార్థన ఆలయం అంటారని రాసి ఉంది గదా. మీరైతే దానిని దోపిడీదొంగల గుహగా చేశారు” అన్నాడు.

[18] అది విని ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయనను ఎలా రూపుమాపాలా అని చూశారు. ఆయనంటే వారికి భయం. ఎందుకంటే, జన సమూహమంతా ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడేవారు.

[19] సాయంకాలం అయినప్పుడు ఆయన నగరంనుంచి వెళ్ళాడు.

[20] ప్రొద్దున వారు దారిన వస్తూ ఉంటే ఆ అంజూర చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం చూశారు.

[21] పేతురు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనతో “గురువర్యా, ఇదిగో, నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు.

[22] అందుకు యేసు వారితో ఇలా అన్నాడు: “దేవునిమీద నమ్మకం ఉంచండి.

[23] మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఎవరైనా సరే ఈ పర్వతంతో ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే తాను చెప్పినదేదైనా అతనికి జరిగి తీరుతుంది.

[24] అందుచేత మీతో అంటున్నాను, మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి దొరుకుతాయని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి.

[25] అయితే మీరు నిలిచి ప్రార్థన చేసేటప్పుడెల్లా, పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించేలా మీకు ఎవరితోనైనా వ్యతిరేకమైన దేదైనా ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి.

[26] మీరు క్షమించకపోతే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించడు.”

[27] వారు మళ్ళీ జెరుసలం చేరారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉంటే ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ ఆయన దగ్గరికి వచ్చి,

[28] ఆయనతో “నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ క్రియలు చేయడానికి ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అన్నారు.

[29] యేసు జవాబిస్తూ వారితో అన్నాడు “నేనూ మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. దీనికి జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెపుతాను.

[30] యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి ఎక్కడనుంచి? పరలోకం నుంచా? మనుషుల నుంచా? నాకు జవాబివ్వండి!”

[31] వారు చర్చలో పడి ఇలా చెప్పుకొన్నారు: “ఒకవేళ అది పరలోకంనుంచి అని మనం చెపితే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతణ్ణి నమ్మలేదు?’ అంటాడు గదా!

[32] ‘మనుషుల నుంచి’ అందామా–.” అయితే వారికి జనమంటే భయం. ఎందుకంటే యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ ఎంచేవారు.

[33] కనుక వారు యేసుకు “మాకు తెలియదు” అని జవాబిచ్చారు. వారికి జవాబిస్తూ యేసు “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.

మార్కు శుభవార్త — Chapters