Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:54

[1] విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.

[2] ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.

[3] ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.

[4] అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.

[5] ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు.

[6] ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి,

[7] త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.

[8] వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా

[9] యేసు వారికి ఎదురు వచ్చి, “మీకు శుభం!” అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాలపై వాలి ఆయనను పూజించారు.

[10] అప్పుడు యేసు, “భయపడకండి. మీరు వెళ్ళి, నా సోదరులను గలిలయకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారితో చెప్పాడు.

[11] వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు.

[12] కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి,

[13] “మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి.

[14] ఇది గవర్నరుకు తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం.” అన్నారు.

[15] సైనికులు ఆ డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది.

[16] పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు.

[17] అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.

[18] అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.

[19] కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ

[20] నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

మత్తయి రాసిన సువార్త — Chapters