Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:42

[1] ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని,

[2] “ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని తన సేవకులతో చెప్పాడు.

[3] అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు

[4] హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు.

[5] హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు.

[6] హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.

[7] కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.

[8] తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.

[9] ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు.

[10] భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.

[11] వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.

[12] యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు.

[13] యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు.

[14] యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.

[15] సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు.

[16] యేసు వారితో, “వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అన్నాడు.

[17] వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు.

[18] అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.

[19] ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.

[20] వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి.

[21] స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.

[22] యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.

[23] ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.

[24] అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది.

[25] రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.

[26] ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.

[27] వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు.

[28] పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు.

[29] యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని

[30] గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.

[31] వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.

[32] యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది.

[33] అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు.

[34] వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు.

[35] అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.

[36] “వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.

మత్తయి రాసిన సువార్త — Chapters