Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:40

[1] ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.

[2] ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను.

[3] ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి,

[4] కనానీయుడు సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

[5] యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు.

[6] ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి.

[7] వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి.

[8] రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.

[9] బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.

[11] మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి.

[12] ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి.

[13] ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.

[14] ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ, విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి.

[15] తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

[16] “తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.

[17] మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.

[18] వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.

[19] వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు.

[20] మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు.

[21] సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు.

[22] నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.

[23] వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

[24] గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు.

[25] శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా!

[26] కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు.

[27] మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి.

[28] “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి.

[29] రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు.

[30] మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు.

[31] కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు.

[32] మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను.

[33] ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.

[34] “నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు.

[35] అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను.

[36] ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.

[37] నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.

[38] తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు.

[39] తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.

[40] మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు.

[41] ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు.

[42] శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”

మత్తయి రాసిన సువార్త — Chapters