[1] అబ్రాహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసు క్రీస్తు వంశావళి.
[2] అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.
[3] యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.
[4] ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను.
[5] శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి.
[6] యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను.
[7] సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా.
[8] ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా.
[9] ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా.
[10] హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
[11] యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.
[12] బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
[13] జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు.
[14] అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు.
[15] ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు.
[16] యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరు గల యేసు పుట్టాడు.
[17] ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు.
[18] యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.
[19] ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.
[20] అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది.
[21] ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.
[22] “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.
[24] యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు.
[25] అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.