Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:03

[1] అందుచేత, నా ప్రియ సోదరులారా, ప్రభువులో నిలకడగా ఉండండి. నా ప్రియులారా, మిమ్ములను చూడాలని నాకెంతో ఆశ. నా ఆనందం, నా కిరీటం మీరే!

[2] ప్రభువులో ఏక మనసుతో ఉండండి అంటూ నేను యువొదియనూ సుంటుకేనూ బ్రతిమిలాడుతున్నాను.

[3] నా నిజమైన సహకారీ, నీతో కూడా ఒక మాట – ఈ స్త్రీలకు సహాయం చేయమని నిన్ను అడుగుతున్నాను. వారు క్లెమెంతుతో, నా ఇతర జతపనివారితో కూడా నాతో శుభవార్త విషయంలో ప్రయాసపడ్డారు. వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.

[4] ప్రభువులో ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ చెపుతాను, ఆనందిస్తూ ఉండండి.

[5] మనుషులందరికీ మీ సాత్వికం తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు.

[6] ఏ విషయంలోనూ కలత చెందకండి గాని అన్నిట్లో కృతజ్ఞతతో ప్రార్థన, విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియజేయండి.

[7] అప్పుడు బుద్ధి అంతటికీ మించిన దేవుని శాంతి క్రీస్తు యేసుద్వారా మీ హృదయాలకూ మనసులకూ కావలి ఉంటుంది.

[8] చివరగా సోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి మాననీయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి శుద్ధమైనవో, ఏవి అందమైనవో, ఏవి మంచిపేరు గలవో – శ్రేష్ఠమైనవేవైనా, మెప్పుకు తగినవేవైనా ఉంటే – అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.

[9] మీరు నావల్ల నేర్చుకొన్నవి, స్వీకరించినవి, విన్నవి, నాలో చూచినవి ఆచరణలో పెట్టుకోండి. అప్పుడు శాంతి ప్రదాత అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు.

[10] ఇన్ని రోజులైన తరువాత నా గురించి మీ శ్రద్ధ మళ్ళీ వికసించినందుచేత ప్రభువులో చాలా ఆనందించాను. మునుపు కూడా మీకు శ్రద్ధ ఉంది గానీ దానిని చూపడానికి అవకాశం లేకపోయింది.

[11] నాకు ఏదైనా అక్కర ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితులలో ఉన్నా తృప్తితో ఉండడం నేర్చుకొన్నాను.

[12] దీన స్థితిలో ఎలా బ్రతకాలో సంపన్నతలో ఎలా బ్రతకాలో కూడా నాకు అనుభవ పూర్వకంగా తెలుసు. కడుపునిండా తినడం, ఆకలితో ఉండడం, సమృద్ధి కలిగి ఉండడం, లేమిని అనుభవించడం – ఏ పరిస్థితులలో అయినా ఏ సందర్భంలో అయినా ఎలా ఉండాలో నేను నేర్చుకొన్నాను.

[13] నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను.

[14] అయినా నా కష్టాలలో మీరు తోడ్పడడం మంచిదే.

[15] నేను శుభవార్త మొదట ప్రకటించి మాసిదోనియా నుంచి వెళ్ళిన తరువాత, ఇవ్వడంలో పుచ్చుకోవడంలో మీరు తప్ప మరే సంఘంవారు పాలివారు కాలేదని ఫిలిప్పీవాసులైన మీకే తెలుసు.

[16] నేను తెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా మీరు నా అక్కరలకు మాటి మాటికి సహాయం పంపారు.

[17] నాకు ఈవి కావాలని నేనిలా మాట్లాడడం లేదు. మీ లెక్కకు ప్రతిఫలం అధికం కావాలని కోరుతున్నాను.

[18] నాకు అంతా సమృద్ధిగా ఉంది. మీరు పంపినది ఎపఫ్రోదితస్ వల్ల నాకు ముట్టింది గనుక తక్కువేమీ లేకుండా ఉంది. అది చాలా ఇంపైనది, దేవునికి అంగీకారమైన, ఇష్టమైన యజ్ఞం.

[19] నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మీ అక్కరలన్నీ తీరుస్తాడు.

[20] మన తండ్రి అయిన దేవునికి యుగయుగాలకు మహిమ కలుగుతుంది గాక! తథాస్తు!

[21] క్రీస్తు యేసులో ఉన్న ప్రతి పవిత్రునికి అభివందనాలు చెప్పండి. నాతో కూడా ఉన్న సోదరులు మీకు అభివందనాలు చెపుతున్నారు.

[22] పవిత్రులంతా, ముఖ్యంగా చక్రవర్తి ఇంటివారిలో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెపుతున్నారు.

[23] ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుంది గాక! తథాస్తు!

ఫిలిప్పీవారికి లేఖ — Chapters