Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:32

[1] కొలస్సయిలో నివాసముంటూ, క్రీస్తులో పవిత్రులై నమ్మకమైన సోదరులకు

[2] దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు రాయబారి పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక.

[3] క్రీస్తు యేసుమీది మీ నమ్మకం గురించీ పవిత్రులందరిపట్ల మీ ప్రేమ గురించీ మేము విన్నాం.

[4] అప్పటినుంచి, పరలోకంలో మీ కోసం ఉంచబడ్డ ఆశాభావాన్ని బట్టి, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెపుతూ, మీ కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం.

[5] శుభవార్త అనే సత్య వాక్కు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఆశాభావం గురించి మీరు విన్నారు.

[6] ఈ శుభవార్త లోకం అంతటా వ్యాపిస్తూ, ఫలిస్తూ ఉంది. మీరు దానిని విని దేవుని కృపను నిజంగా గ్రహించిన నాటినుంచీ అది మీమధ్య కూడా అలాగే ఫలిస్తూ ఉంది.

[7] మీరు మా ప్రియమైన సాటి దాసుడు ఎపఫ్రా వల్ల శుభవార్త నేర్చుకొన్నారు.

[8] అతడు మీ విషయంలో క్రీస్తుకు నమ్మకమైన సేవకుడు. దేవుని ఆత్మలోని మీ ప్రేమభావాన్ని అతడు మాకు తెలియజేశాడు కూడా.

[9] ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటినుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం, తెలివి కలిగి ఆయన సంకల్పం పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుతూ ఉన్నాం.

[10] దీనిద్వారా మీరు ప్రభువుకు తగిన విధంగా నడుచుకొంటూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, అంతకంతకూ దేవుణ్ణి తెలుసుకొంటూ అన్ని విషయాలలో ప్రభువుకు ఆనందం కలిగించాలని ప్రార్థిస్తున్నాం.

[11] మీకు ఆనందంతో కూడిన సంపూర్ణమైన సహనం, ఓర్పు కలిగేలా మీరు ఆయన దివ్య బలప్రభావాల ప్రకారం సంపూర్ణంగా బలపడి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెపుతూ ఉండాలని మా ప్రార్థన.

[12] వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వంలో పాలిభాగస్థులు కావడానికి ఆయన మనలను తగినవారుగా చేశాడు.

[13] ఆయన మనలను చీకటి పరిపాలన నుంచి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తెచ్చాడు.

[14] కుమారునిలో ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, అంటే, పాపక్షమాపణ ఉంది.

[15] ఆయన కనిపించని దేవుని ప్రత్యక్ష స్వరూపం, సర్వసృష్టికి ప్రముఖుడు.

[16] ఎందుకంటే ఆయనవల్ల సృష్టిలో అన్నీ ఉనికిలోకి వచ్చాయి. ఆకాశాలలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, కనబడేవి, కనబడనివి, సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా – సమస్తాన్నీ ఆయనద్వారా, ఆయనకోసం సృజించడం జరిగింది.

[17] ఆయనే అన్నిటికీ పూర్వమున్నవాడు, ఆయనలోనే అన్నీ ఒక దానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి.

[18] అంతేకాదు శరీరానికి, అంటే, తన సంఘానికి ఆయనే శిరస్సు. ఆయనే ప్రతిదానిలోనూ ఆధిక్యత కలిగి ఉండాలని ఆయనే ఆది, చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచేవారందరిలోనూ ప్రముఖుడు.

[19] ఎందుకంటే, సంపూర్ణత అంతా ఆయనలో ఉండాలని తండ్రి అయిన దేవుని ఇష్టం.

[20] క్రీస్తు సిలువమీద చిందిన రక్తంద్వారా సంధి చేసి అన్నిటినీ తనతో సఖ్యపరచుకోవాలని కూడా తండ్రి ఇష్టం. “అన్నీ” అంటే, భూమిమీద ఉండేవీ, పరలోకంలో ఉండేవీ.

[21] గతంలో మీరు దేవుని విషయంలో పరాయివారు. మీ చెడు పనుల కారణంగా ఆయన పట్ల విరోధ భావం గలవారు.

[22] ఇప్పుడైతే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం ద్వారా ఆయన మిమ్ములను తనతో సఖ్యపరచుకొన్నాడు. ఆయన దృష్టిలో మిమ్ములను తనముందు పవిత్రంగా, నిర్దోషంగా, అనింద్యంగా నిలబెట్టుకోవాలని ఇందులో ఆయన ఉద్దేశం.

[23] మీరు సుస్థిరంగా, దృఢంగా ఉంటూ, మీరు విన్న శుభవార్త ఇచ్చే ఆశాభావం నుంచి తొలగిపోకుండా విశ్వాసంతో సాగిపోతూ ఉంటే ఆయన అలా చేస్తాడు. ఈ శుభవార్త ప్రకటన ఆకాశంక్రింద ఉన్న సర్వ సృష్టిలో జరిగింది. దీనికి నేను – పౌలును – సేవకుణ్ణయ్యాను.

[24] ఇప్పుడు మీకోసమైన నా బాధలలో ఆనందిస్తూ ఉన్నాను. తన శరీరం, అంటే సంఘం కోసం క్రీస్తు కష్టాలలో తక్కువ పడినదానిని నా శరీరంలో పూర్తి చేస్తూ ఉన్నాను.

[25] మీ కోసం దేవుని వాక్కు, అంటే రహస్య సత్యం పూర్తిగా ప్రకటించడానికి దేవుడు నాకు అప్పగించిన నిర్వహణ ప్రకారం నేను ఈ సంఘానికి సేవకుణ్ణయ్యాను.

[26] ఈ రహస్య సత్యం గత యుగాలపాటు, తరాలపాటు మరుగైనది గాని ఇప్పుడు ఆయన పవిత్రులకు వెల్లడి అయింది.

[27] యూదులు కాని ఇతర జనాల మధ్య ఉన్న ఈ రహస్య సత్యం దివ్య ఐశ్వర్యం తన పవిత్రులకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రహస్య సత్యం మీలో ఉన్న క్రీస్తు. ఆయనే మహిమను గురించిన ఆశాభావం.

[28] మేమాయనను ప్రకటిస్తూ, సర్వ జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరికీ ఉపదేశిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరినీ క్రీస్తు యేసులో పరిపూర్ణులుగా దేవుని ముందు నిలబెట్టాలని మా ఉద్దేశం.

[29] ఇందుకే నేను పాటుపడుతూ ఉన్నాను, నాలో బలంగా పని చేస్తున్న ఆయన కట్టుదిట్టమైన క్రియాశీలత ప్రకారం నేను పోరాడుతూ ఉన్నాను.

కొలస్సయివారికి లేఖ — Chapters