[1] అందుచేత క్రీస్తులో ప్రోత్సాహమేమైనా, ప్రేమ ఓదార్పు ఏమైనా, దేవుని ఆత్మతో సహవాసమేమైనా, వాత్సల్యం, కనికరం ఏమైనా ఉంటే,
[2] నా ఆనందాన్ని పూర్తి చేయండి. ఎలాగంటే, మనసులో, ప్రేమలో, హృదయ భావంలో, ఉద్దేశంలో సమైక్యత కలిగి ఉండండి.
[3] కక్షచేత గానీ వట్టి డంబంచేత గానీ ఏమీ చేయకండి. దానికి బదులు, మీలో ప్రతి ఒక్కరూ తనకంటే ఇతరులు ఎక్కువవారని వినయంతో ఎంచండి.
[4] మీలో ప్రతి ఒక్కరూ సొంత విషయాలు చూచుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల విషయాలు కూడా చూడండి.
[5] క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనసు మీరూ కలిగి ఉండండి:
[6] ఆయన దేవుని స్వరూపి అయి ఉండి కూడా దేవునితో సమానతను పట్టుకోవలసిన విషయం అనుకోలేదు.
[7] గానీ ఆయన తనను ఏమీ లేనివాడిలాగా చేసుకొని సేవకుని స్వరూపం ధరించి మనుషుల పోలికలో జన్మించాడు.
[8] మనిషి రూపంతో కనిపించినప్పుడు తనను తాను తగ్గించుకొని మరణం పొందడానికి – సిలువ మరణం పొందడానికి కూడా – విధేయుడయ్యాడు.
[9] ఈ కారణంచేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. అన్ని పేరుల కంటే పై పేరు ఆయనకు ఇచ్చాడు.
[10] దీనికి ఫలితంగా యేసు పేరు విని పరలోకంలో గానీ, భూమిమీద గానీ, భూమి క్రింద గానీ ఉన్న ప్రతి మోకాలూ వంగుతుంది,
[11] తండ్రి అయిన దేవుని మహిమకోసం ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొంటుంది.
[12] అందుచేత, నా ప్రియ సోదరులారా, మీరు ఎప్పుడూ విధేయులై ఉన్నట్టే, నేనక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నా హాజరులేని ఈ సమయంలో మరీ ఎక్కువగా భయంతో, వణకుతో మీ సొంత విముక్తి సఫలత కోసం శ్రమిస్తూ ఉండండి.
[13] ఎందుకంటే దేవుడు తానే తనకిష్టమైన ఉద్దేశం ప్రకారం సంకల్పించడానికీ చేయడానికీ మీలో పని చేస్తూ ఉన్నాడు.
[14] మీరు కుటిలమైన వక్రతరం వారిమధ్య నిర్దోషులు, నిష్కపటులు, నిందారహితులైన దేవుని కుమారులుగా ఉండేలా మీరు చేసేదంతా సణుగులూ వివాదాలు లేకుండా చేయండి.
[15] వారి మధ్య జీవ వాక్కు గట్టిగా చేతపట్టుకొని ఈ లోకంలో జ్యోతులలాగా ప్రకాశిస్తూ ఉన్నారు.
[16] అలాంటప్పుడు నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ, నిష్‌ఫలంగా ప్రయాస పడలేదనీ క్రీస్తు రోజున ఆనందించగలుగుతాను.
[17] మీ విశ్వాస యజ్ఞం మీద, సేవ మీద నేను పానార్పణంగా పోయబడుతూ ఉన్నా సంతోషంగా ఉండి మీ అందరితో ఆనందిస్తున్నాను.
[18] ఆ కారణంచేతే మీరు కూడా సంతోషంగా ఉండి నాతో ఆనందించండి.
[19] మీ సంగతులు తెలుసుకోవడం వల్ల నాకు ఉత్సాహం కలగాలని ఉంది గనుక త్వరలో తిమోతిని మీ దగ్గరకు పంపాలని ప్రభువైన యేసులో ఆశిస్తూ ఉన్నాను.
[20] అతనిలాగా మీ గురించి వాస్తవమైన శ్రద్ధ వహించేవారు మరెవరూ నా దగ్గర లేరు.
[21] అందరూ ఎవరి విషయాలు వారు చూచుకొంటున్నారు గాని, క్రీస్తు యేసు విషయాలు చూడడం లేదు.
[22] తిమోతి యోగ్యత రుజువైందనీ తండ్రితో కొడుకులాగా అతడు శుభవార్త ప్రచారంలో నాతో సేవ చేశాడనీ మీకు తెలుసు.
[23] అందుచేత నాకు సంభవించబోయేదేమిటో తెలిసిన వెంటనే అతణ్ణి పంపాలని నా ఆశ.
[24] నేను కూడా త్వరలో వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.
[25] మీరు పంపినవాడు, నా సోదరుడూ జతపనివాడూ, సాటి యోధుడూ, నాకు సేవ చేసినవాడూ అయిన ఎపఫ్రోదితస్‌ను తిరిగి మీ దగ్గరకు పంపడం అవసరమను కొన్నాను.
[26] ఎందుకంటే మిమ్ములనందరినీ చూడడానికి అతనికి చాలా ఆశ ఉంది. తనకు జబ్బు చేసిన సంగతి మీరు విన్నందుచేత అతడు చాలా విచారపడ్డాడు.
[27] అతడు జబ్బుతో చావు బ్రతుకులలో ఉన్నాడు, నిజమే గాని, దేవుడు అతని మీద జాలి చూపాడు. అతని మీద మాత్రమే కాక, నాకు దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నామీద కూడా జాలి చూపాడు.
[28] గనుక మీరతణ్ణి మళ్ళీ చూచి సంతోషించేలా తద్వారా నా దుఃఖం తగ్గేలా అతణ్ణి ఆతురతతో పంపాను.
[29] క్రీస్తు సేవకోసం అతడు చనిపోయే స్థితికి వచ్చాడు. మీరు నాకు ఏ సేవ చేయలేకపోయారో ఆ సేవ చేయడానికి తన ప్రాణాన్ని అపాయంలో పెట్టాడు.
[30] కాబట్టి పూర్ణానందంతో ప్రభువులో అతణ్ణి స్వీకరించండి. అలాంటివారిని గౌరవంతో చూడండి.