Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:47

[1] ఆ రోజుల్లో ఒక దినం ఆయన దేవాలయంలో ప్రజలకు ఉపదేశిస్తూ శుభవార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఎదురు పడి,

[2] “నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ అధికారం నీకిచ్చినవాడెవడు? మాతో చెప్పు” అని ఆయననడిగారు.

[3] ఆయన “నేనూ మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను.

[4] యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి పరలోకం నుంచా? మనుషుల నుంచా? నాతో చెప్పండి!” అని వారికి జవాబిచ్చాడు.

[5] వారు చర్చలో పడి ఇలా చెప్పుకొన్నారు: “ఒకవేళ, పరలోకం నుంచి అని మనం చెపితే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతణ్ణి నమ్మలేదు?’ అంటాడు గదా!

[6] అది మనుషుల నుంచి అని చెపితే జనమంతా మనమీద రాళ్ళు విసిరి వేస్తారు. యోహాను ఒక ప్రవక్త అని వారు స్థిరంగా నమ్ముతున్నారు గదా.”

[7] కనుక, అది ఎక్కడనుంచో తమకు తెలియదని వారు జవాబిచ్చారు.

[8] వారితో యేసు “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.

[9] అప్పుడాయన ప్రజలకు ఈ ఉదాహరణ చెప్పసాగాడు: “ఒక మనిషి ద్రాక్షతోట నాటి దానిని రైతులకు కౌలుకిచ్చి దూర దేశంలో చాలా కాలం అక్కడికి ప్రయాణమై పోయాడు.

[10] కోత కాలం వచ్చినప్పుడు వారు ఆ ద్రాక్ష పంటలో కొంత తనకివ్వాలని ఆ రైతుల దగ్గరకు ఒక దాసుణ్ణి పంపాడు. కానీ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేశారు.

[11] మరోసారి అతడు మరో దాసుణ్ణి పంపాడు. అతణ్ణి కూడా వారు కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేశారు.

[12] మూడో సారి అతడు దాసుణ్ణి పంపాడు. వారతణ్ణి గాయపరచి బయటికి త్రోసివేశారు.

[13] “అప్పుడు ద్రాక్షతోట సొంతదారుడు ‘నేనేం చెయ్యను? నా ప్రియ కుమారుణ్ణి పంపుతాను. బహుశా వారాయనను చూస్తే గౌరవిస్తారు’ అన్నాడు.

[14] కానీ అతణ్ణి చూచి రైతులు ‘వారసుడు ఇతడే! వారసత్వం మనది అయ్యేలా అతణ్ణి చంపుదాం రండి’ అని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకొన్నారు.

[15] అప్పుడు వారతణ్ణి ద్రాక్షతోట వెలుపలికి గెంటివేసి చంపారు. “అందుచేత ద్రాక్షతోట యజమాని వారినేమి చేస్తాడు?

[16] అతడు వచ్చి ఆ రైతులను ధ్వంసం చేసి ద్రాక్షతోటను వేరేవారి చేతికిస్తాడు.” అది విని వారు “అలా ఎన్నడూ కాకూడదు!” అన్నారు.

[17] ఆయన వారివైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు: “అలాగైతే రాసి ఉన్న ఈ విషయానికి అర్థం ఏమిటి – ‘కట్టేవారు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’?

[18] ఈ రాయిమీద పడే వారెవరైనా ముక్కలు చెక్కలు అవుతారు. ఇది ఎవరిమీద పడుతుందో ఆ వ్యక్తిని చూర్ణం చేస్తుంది.”

[19] ఆయన తమకు వ్యతిరేకంగా ఆ ఉదాహరణ చెప్పాడని గ్రహించి ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ఆ సమయంలోనే ఆయనను పట్టుకోవాలని చూశారు గాని ప్రజలకు భయపడ్డారు.

[20] కనుక వారు ఆయనను బాగా చూస్తూ ఉన్నారు, న్యాయవంతులుగా నటించిన గూఢచారులను ఆయన దగ్గరకు పంపారు. ఆయన మాటలను పట్టి ఆయనను రోమన్‌ అధిపతి అధికారానికీ ప్రభావానికీ అప్పగించాలని వారి ఉద్దేశం.

[21] వారాయనను ఇలా అడిగారు: “ఉపదేశకా! మీరు చెప్పేదీ ఉపదేశించేదీ సరిగానే ఉందనీ ఎవరి పక్షమూ వహించకుండా దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టే ఉపదేశిస్తారనీ మాకు తెలుసు.

[22] సీజర్‌కు మనం సుంకం చెల్లించడం న్యాయమా? కాదా?”

[23] ఆయన వారి కపటాన్ని పసికట్టి “నన్నెందుకు శోధిస్తున్నారు?

[24] దేనారం నాకు చూపెట్టండి. దీనిమీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారితో అన్నాడు. వారు “సీజర్‌వి” అని జవాబిచ్చారు.

[25] ఆయన వారితో “కాబట్టి సీజర్‌వి సీజర్‌కూ దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.

[26] ప్రజల సముఖంలో ఆయన మాటలలో వారు తప్పుపట్టలేక ఆయన చెప్పిన జవాబుకు అధికంగా ఆశ్చర్యపడి ఊరుకొన్నారు.

[27] అప్పుడు సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరకు వచ్చారు. (వీరు చనిపోయినవారు సజీవంగా లేవరని చెప్పేవారు.)

[28] వారాయనను ఇలా ప్రశ్నించారు: “ఉపదేశకా, మోషే మనకోసం రాసినది ఇది – భార్య బతికి ఉన్నప్పుడు ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసుకొని అతడికి సంతతిని కలిగించాలి.

[29] ఏడుగురు అన్నదమ్ములుండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా చనిపోయాడు.

[30] అలాగే రెండోవాడు ఆమెను భార్యగా స్వీకరించి సంతానం లేకుండా చనిపోయాడు,

[31] తరువాత మూడోవాడు ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అలాగే ఆ ఏడుగురూ చేసుకొన్నారు, సంతానం లేకుండా చనిపోయారు.

[32] చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.

[33] అందుచేత, చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు ఆమె వారిలో ఎవరి భార్య అవుతుంది? ఆమె ఆ ఏడుగురికీ భార్యగా ఉంది గదా?”

[34] యేసు వారికి జవాబిస్తూ అన్నాడు “ఇహలోకం మనుషులు పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ ఉన్నారు.

[35] కాని వచ్చే యుగానికీ చనిపోయినవారిలో పునర్జీవితానికీ తగినవారి లెక్కలో చేరినవారు పెండ్లి చేసుకోరు, పెండ్లి కియ్యరు.

[36] వారు చనిపోయి బ్రతికినవారు, దేవుని కుమారులు. వారు దేవదూతలలాగా ఉండి అప్పటినుంచి ఎన్నడూ చనిపోలేరు.

[37] “చనిపోయినవారు సజీవంగా లేస్తారని మోషే కూడా పొదను గురించిన భాగంలో సూచించాడు. ఎలాగంటే, అతడు ప్రభువును ‘అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు’ అని పిలిచాడు.

[38] ఆయన చనిపోయినవారి దేవుడు కాడు, జీవిస్తూ ఉన్నవారి దేవుడు. ఆయన దృష్టిలో అందరూ సజీవులు.”

[39] ధర్మశాస్త్ర పండితులు కొందరు జవాబిస్తూ “ఉపదేశకా, బాగా చెప్పావు” అన్నారు.

[40] అప్పటినుంచి వారు ఆయనను మరే ప్రశ్నా అడగడానికి తెగించలేదు.

[41] అప్పుడాయన వారితో ఇలా అన్నాడు: “అభిషిక్తుడు దావీదు కుమారుడు అని వారెలా అనగలరు?

[42] ఆ దావీదే కీర్తనల గ్రంథంలో అన్నదేమంటే, ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు –

[43] నేను నీ శత్రువులను నీ పాదాల క్రింద ఉంచేవరకు నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.

[44] దావీదు ఆయనను ‘ప్రభువు’ అంటున్నాడు. అలాగైతే ఆయన అతనికెలా కుమారుడవుతాడు?”

[45] ఆ జనులంతా వింటూ ఉండగానే ఆయన తన శిష్యులతో అన్నాడు

[46] “ధర్మశాస్త్ర పండితుల విషయం జాగ్రత్త! పొడుగాటి అంగీలు తొడుక్కొని తిరగడం వారికిష్టం. సంత వీధులలో వందనాలు అందుకోవడం, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలు, విందులలో ముఖ్య స్థలాలు వారికి ప్రీతి.

[47] విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగివేసేవారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేసేవారు కూడా వీరే. వారికి మరీ కఠినమైన శిక్ష కలుగుతుంది.”

లూకా శుభవార్త — Chapters