[1] ఇంతలో వేలకొలది జనులు పోగయి ఒకరినొకరు త్రొక్కుకొంటూ ఉన్నారు. ఆయన మొదట తన శిష్యులతో ఇలా మాట్లాడసాగాడు: “పరిసయ్యుల కపటం అనే పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్త!
[2] కప్పిపెట్టినది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచినది ఏదీ తెలుసుకోకుండా ఉండదు తప్పక తెలిసిపోతుంది.
[3] చీకట్లో మీరు చెప్పినది ప్రతిది వెలుగులో వినబడుతుంది. లోపలి గదులలో చెవులలో మీరు చెప్పుకొన్నది ఇంటి కప్పుల మీద నుంచి ప్రకటించబడుతుంది.
[4] “నా స్నేహితులారా, మీతో నేను చెప్పేదేమంటే శరీరాన్ని చంపేవారికి భయపడకండి. ఆ తరువాత వారు చేయగలిగేది ఏమీ లేదు.
[5] మీరెవరికి భయపడాలో మీకు చెపుతాను – ఆయన చంపిన తరువాత నరకంలో పడవేయడానికి అధికారం గల వ్యక్తికే. ఆయనకే భయపడండి అని మీతో అంటున్నాను.”
[6] “అయిదు పిచ్చుకలు రెండు చిన్న నాణాలకు అమ్ముడు పోతాయి గదా. అయినా వాటిలో ఒక పిచ్చుక కూడా దేవుని సన్నిధిలో మరవబడదు.
[7] మీ తలవెండ్రుకలెన్నో లెక్క ఉంది. అందుచేత మీరేమీ భయపడకండి. అనేక పిచ్చుకలకంటే మీ విలువ ఎక్కువ.
[8] “ఇంకొకటి మీతో నేనంటున్నాను, నన్ను ఎరుగుదుమని మనుషుల ఎదుట ఎవరైనా ఒప్పుకొంటే అతణ్ణి మానవ పుత్రుడు దేవదూతల ఎదుట ఎరుగుదునని ఒప్పుకొంటాడు.
[9] కానీ మనుషుల ఎదుట నన్ను ఎరగననే వాణ్ణి దేవదూతల ఎదుట నేనూ ఎరగనంటాను.
[10] మానవ పుత్రునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట చెప్పితే దానిగురించి అతనికి క్షమాపణ ఉంటుంది. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసే వానికి క్షమాపణ ఉండదు.”
[11] “మనుషులు మిమ్ములను సమాజ కేంద్రాలకూ పరిపాలకుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ విచారణకోసం తీసుకు వెళ్ళేటప్పుడు మీరేమి చెప్పాలో ఏమి జవాబివ్వాలో అని బెంబేలుపడకండి.
[12] ఎందుకంటే మీరేమి చెప్పాలో ఆ ఘడియలోనే పవిత్రాత్మ మీకు నేర్పుతాడు.”
[13] గుంపులో ఎవరో ఒకడు ఆయనతో “ఉపదేశకా! వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నా భాగం పంచిపెట్టమని మా తోబుట్టువుకు చెప్పండి” అన్నాడు.
[14] అందుకాయన అతనితో “అయ్యా, మీమీద నన్నెవరు తీర్పరిగా లేదా మధ్యవర్తిగా నియమించారు?” అన్నాడు.
[15] ఆయన వారితో “అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి! ఒకరి జీవితానికి మూలాధారం తన అధిక సంపద కాదు” అన్నాడు.
[16] అప్పుడాయన వారికొక ఉదాహరణ చెప్పాడు: “ఆస్తిపరుడొకడి భూమి బాగా పండింది,
[17] గనుక అతడిలా లోలోపల ఆలోచన చేశాడు: ‘నా పంట నిలవ చేయడానికి స్థలం లేదు. ఏం చెయ్యను?
[18] ఇలా చేస్తాను – నా గిడ్డంగులు పడగొట్టి వీటికంటే పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యం, నా సరుకులు అన్నీ నిలవ చేస్తాను.
[19] అప్పుడు నా ప్రాణంతో నేనంటాను, ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు మంచి వస్తువులు కూడబెట్టబడ్డాయి. సుఖంగా ఉండు. తిను, తాగు, సంబరపడు!’ అని.
[20] అయితే అతనితో దేవుడు అన్నాడు ‘తెలివి తక్కువవాడా! ఈ రాత్రే నీ ప్రాణం అడగడం జరుగుతుంది. నీవు సిద్ధం చేసుకొన్నవి అప్పుడు ఎవరివవుతాయి?’
[21] దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తనకోసమే సొమ్ము కూడబెట్టే వ్యక్తి అలాంటివాడే.”
[22] ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏం తింటాం?’ అంటూ మీ బ్రతుకును గురించి బెంగపెట్టుకోకండి. ‘మాకు బట్టలు ఎట్లా?’ అనుకొంటూ శరీరాన్ని గురించి బెంగపెట్టుకోకండి.
[23] తిండికంటే జీవితం ప్రధానం. బట్టలకంటే శరీరం ముఖ్యం.
[24] కాకులను చూడండి. అవి నాటవు, కోత కోయవు. వాటికి గిడ్డంగులూ కొట్లూ లేవు. అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో విలువైనవారు గదా!
[25] చింతపడడం వల్ల మీలో ఎవరు తన ఎత్తును మూరెడు పొడిగించుకోగలరు?
[26] అన్నిటిలో చిన్న విషయాలే మీరు చేయలేకపోతే తక్కిన విషయాలను గురించి మీకు వ్యాకులత ఎందుకు?
[27] “పూలమొక్కలు ఎలా పెరుగుతున్నాయో చూడండి. అవి శ్రమపడవు, బట్టలు నేయవు. అయినా, తన వైభవమంతటితో సహా సొలొమోను తొడుగుకొన్న వస్త్రాలు ఈ పూలలో ఒక్కదానికున్నంత అందం గలవి కావని మీతో చెపుతున్నాను.
[28] అల్ప విశ్వాసం గలవారులారా, ఈవేళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే పొలంగడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే, మరీ నిశ్చయంగా మీకు వస్త్రాలిస్తాడు గదా.
[29] అన్నపానాలెట్లా అంటూ వాటికోసం దేవులాడకండి, వ్యాకులత చెందకండి.
[30] లోకజనాలు వీటికోసం దేవులాడుతారు. ఇవి మీకు అవసరమని మీ పరమ తండ్రికి తెలుసు.
[31] దేవుని రాజ్యాన్ని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు చేకూరుతాయి.
[32] “చిన్న మందా, భయంతో ఉండకు, తన రాజ్యాన్ని మీకు ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం.
[33] మీకున్నదాన్ని అమ్మి దానధర్మాలు చేయండి. పరలోకంలో మీకు పాతగిలిపోని డబ్బు సంచులు తయారు చేసుకోండి. అయిపోకుండా ఉండే సొమ్ము సమకూర్చుకోండి. అక్కడ దొంగ ఎవడూ దగ్గరకు రాడు, చిమ్మటలు కొట్టవు.
[34] మీ సొమ్ము ఎక్కడుంటుందో అక్కడే మీ హృదయమూ ఉంటుంది.
[35] “మీ నడుము కట్టండి. మీ దీపాలు వెలుగుతూ ఉండేలా చూచుకోండి.
[36] పెండ్లి నుంచి తిరిగి వచ్చే తమ యజమాని కోసం ఎదురుచూస్తున్న మనుషులలాగా మీరు ఉండండి. ఆయన వచ్చి తలుపు తట్టగానే వారు ఆయనకు తలుపు తీస్తారు.
[37] యజమాని వచ్చి చూచినప్పుడు ఆ విధంగా ఎదురు చూస్తున్న దాసులు ధన్యులు. మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఆయన నడుము బిగించి వారిని భోజనానికి కూచోబెట్టి తానే వచ్చి వారికి వడ్డిస్తాడు.
[38] యజమాని రెండో జామున వచ్చినా, మూడో జామున వచ్చినా ఏ దాసులైతే మెళకువగా ఉండడం ఆయన చూస్తాడో ఆ దాసులు ధన్యులు.
[39] ఇది తెలుసుకోండి – దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి ముందు తెలిసి ఉంటే అతడు మెళకువగా ఉంటాడు, తన ఇంటికి కన్నం వేయనియ్యడు.
[40] మీరు అనుకోని గడియలో మానవ పుత్రుడు వస్తాడు, గనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి.”
[41] అప్పుడు పేతురు “ప్రభూ, నీవు ఈ ఉదాహరణ చెప్పినది మాకేనా, అందరికోసమా?” అని అడిగాడు.
[42] ప్రభువు అన్నాడు: “యజమాని తన దాసులకు సరైన వేళకు ఆహారం పెట్టడానికి వారిమీద నియమించిన జ్ఞానం గల నమ్మకమైన నిర్వాహకుడు ఎవడు?
[43] అతని యజమాని వచ్చి చూచినప్పుడు ఆ పని చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు.
[44] మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, యజమాని అతణ్ణి తనకు ఉన్నదంతటి మీదా నియమిస్తాడు.
[45] కానీ ఒకవేళ ఆ దాసుడు తన హృదయంలో ‘నా యజమాని ఇప్పుడే రాడు లే” అనుకొని దాస దాసీ జనాన్ని కొట్టడం, తిని త్రాగి మత్తిల్లడం ఆరంభిస్తే
[46] ఆ దాసుడు ఎదురు చూడని రోజున, ఎరగని గడియలో అతని యజమాని వస్తాడు, అతణ్ణి రెండు ముక్కలుగా కోసి నమ్మకం లేనివారితోపాటు అతనికి వంతు నియమిస్తాడు.
[47] “తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధపడకుండా ఆయన ఇష్టప్రకారం జరిగించకుండా ఉండే దాసుడు అనేక దెబ్బలకు గురి అవుతాడు.
[48] కానీ తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన దాసుడు కొద్ది దెబ్బలకే గురి అవుతాడు. ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో ఆ వ్యక్తిదగ్గర ఎక్కువగా కోరడం, ఎవరికైతే ఎక్కువగా అప్పగించబడుతుందో ఆ వ్యక్తి దగ్గర ఎక్కువగా అడగడం జరుగుతుంది”.
[49] “భూమిమీద మంట వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రవులుకొని ఉండాలని ఎంతగానో కోరుతున్నాను.
[50] నేను పొందవలసిన బాప్తిసం ఉంది. అది నెరవేరేవరకూ నేనెంతో ఒత్తిడి అనుభవిస్తున్నాను.
[51] భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చానని అనుకొంటున్నారా? శాంతి కాదు. దానికి బదులుగా చీలిక కలిగించడానికి వచ్చానని మీతో చెపుతున్నాను.
[52] ఇప్పటి నుంచి ఒకే ఇంట్లో అయిదుగురు ఉంటే, విభేదం కలిగి ముగ్గురు ఇద్దరికి ప్రతికూలంగా, ఇద్దరు ముగ్గురికి ప్రతికూలంగా ఉంటారు.
[53] తండ్రి కొడుకుకు ప్రతికూలంగా, కొడుకు తండ్రికి ప్రతికూలంగా, తల్లి కూతురుకు ప్రతికూలంగా, కూతురు తల్లికి ప్రతికూలంగా, అత్త కోడలికి ప్రతికూలంగా, కోడలు అత్తకు ప్రతికూలంగా విభేదం కలిగి ఉంటారు.
[54] ఆయన జన సమూహాలతో ఇలా అన్నాడు: “పడమట నుంచి మబ్బు పైకి రావడం చూచినప్పుడెల్లా ‘వాన వస్తూ ఉంది’ అని వెంటనే మీరు చెప్పుకొంటారు. అలాగే జరుగుతుంది కూడా.
[55] దక్షిణం గాలి వీస్తూ ఉండడం మీరు చూస్తే ‘వడగాడ్పు రాబోతుంది’ అంటారు. అలా జరుగుతుంది కూడా.
[56] కపట భక్తులారా! భూమ్యాకాశాల ఉపస్థితిని చూచి గ్రహించగలరు గాని ఈ కాలాన్ని గ్రహించలేక పోతున్నారేమిటి?
[57] “ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు నిర్ణయించుకోరు?
[58] నీవు నీ ప్రత్యర్థితో పాటు అధికారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటే దారిలోనే అతనితో సఖ్యపడే ప్రయత్నం చెయ్యి. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతి దగ్గరకు లాక్కుపోతాడు. న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. భటుడేమో నిన్ను ఖైదులో తోస్తాడు.
[59] మీతో నేను చెపుతున్నాను, చివరి పైసాతో కూడా చెల్లించేంతవరకూ నీవు దానిలోనుంచి బయటికి రావు.”