[1] మహా ఘనులైన తియొఫిలస్! మా మధ్య నెరవేరిన సంగతులు మొదటి నుంచి కళ్ళారా చూచి దేవుని వాక్కు విషయమై సేవ చేసేవారు వాటిని మనకు అందించారు.
[2] వారి ఉపదేశాలనే అనుసరించి వాటిని వరుసగా ఒక వృత్తాంతం రూపొందించడానికి అనేకులు పూనుకొన్నారు.
[3] అందుచేత మొదటి నుంచి అన్నిటినీ జాగ్రత్తగా పరిశోధించి పూర్తిగా గ్రహించిన నేను కూడా నీకోసం వాటిని గురించి క్రమబద్ధంగా రాయడం మంచిదని నాకు తోచింది.
[4] నీకు అందిన ఉపదేశంలోని అసలు సత్యం నీవు తెలుసుకోవాలని నా ఉద్దేశం.
[5] యూదయ రాజైన హేరోదు రోజుల్లో జెకర్యా అనే యాజి ఉండేవాడు. అతడు అబీయా శాఖకు చెందినవాడు. అతని భార్య అహరోను వంశికురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
[6] దేవుని దృష్టిలో వీరిద్దరూ న్యాయవంతులూ నిందకు చోటివ్వకుండా ప్రభువిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం, న్యాయ నిర్ణయాలన్నిటి ప్రకారం నడుచుకొనేవారు.
[7] ఎలీసబెతు గొడ్రాలు గనుక వారికి సంతానం కలగలేదు. అంతేగాక, ఇద్దరూ వయసు మళ్ళిన ముసలివారు.
[8] ఒకసారి జెకర్యా తన శాఖ క్రమం ప్రకారం దేవుని ఎదుట యాజిగా సేవ చేస్తూ ఉన్నప్పుడు,
[9] యాజి ధర్మం ప్రకారం ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయడానికి చీట్లు వేసినప్పుడు అతనికి వంతు వచ్చింది.
[10] ధూప సమర్పణ సమయంలో ప్రజానీకమంతా బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
[11] అప్పుడు ప్రభు దేవదూత ఒకడు ధూపవేదిక కుడివైపున నిలుచుండి అతనికి కనబడ్డాడు.
[12] జెకర్యా అతణ్ణి చూచి కంగారుపడి భయాక్రాంతుడు అయ్యాడు.
[13] అయితే దేవదూత అతనితో ఇలా అన్నాడు: “జెకర్యా! భయపడకు! నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని నామకరణం చేస్తావు.
[14] నీవు సంతోషిస్తావు. ఉల్లాసంతో ఉప్పొంగిపోతావు. అతని పుట్టుక కారణంగా అనేకులకు ఆనందం కలుగుతుంది.
[15] ఎందుకంటే, అతడు ప్రభు దృష్టిలో గొప్పవాడు అవుతాడు. ద్రాక్షరసం గానీ మద్యం గానీ త్రాగడు. తల్లి గర్భాన పుట్టినప్పటినుంచీ అతడు దేవుని పవిత్రాత్మతో నిండి ఉంటాడు.
[16] ఇస్రాయేల్ ప్రజలలో అనేకులను వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు.
[17] తండ్రుల హృదయాలను తమ సంతానం వైపుకు, అవిధేయులను న్యాయవంతుల జ్ఞానానికి త్రిప్పడానికీ తద్వారా ప్రభువుకోసం తయారైన జనాన్ని సిద్ధం చేయడానికీ అతడు ఏలీయా మనసుతో బలప్రభావాలతో ప్రభువుకంటే ముందుగా వస్తాడు.”
[18] దేవదూతతో జెకర్యా “నేనిది ఎలా తెలుసుకుంటాను? నేను ముసలివాణ్ణే. నా భార్య కూడా వయసు మళ్ళింది” అన్నాడు.
[19] దేవదూత అతనికి జవాబిస్తూ “నేను దేవుని సన్నిధిలో నిలిచే గబ్రియేలును. నీతో మాట్లాడడానికీ ఈ శుభవార్త నీకు తెలపడానికీ పంపబడ్డాను.
[20] ఇదిగో విను. నా మాటలు తగిన కాలంలో నెరవేరుతాయి గానీ నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే వరకు నీవు మాట్లాడలేక మౌనంగా ఉంటావు!” అన్నాడు.
[21] ఈలోగా జెకర్యా కోసం జనం బయట ఎదురుచూస్తూ ఉన్నారు. దేవాలయంలో అతడు అంత సేపు నిలిచి ఉండడ మెందుకో అని ఆశ్చర్యపోతూ ఉన్నారు.
[22] అతడు బయటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయాడు గనుక దేవాలయంలో అతనికి దర్శనం కనబడిందని వారు గ్రహించారు. అతడు సైగలు చేస్తూ మూగవాడుగా ఉండిపోయాడు.
[23] అతని సేవ రోజులయిపోయినప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు.
[24] ఆ రోజుల తరువాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది, అయిదు నెలలపాటు ఆమె ఇతరులకు కనిపించకుండా ఉండిపోయింది.
[25] “మనుషుల మధ్య నా అవమానాన్ని ప్రభువు తీసేశాడు, ఈ రోజుల్లో నన్ను దయతో చూచి ఈ విధంగా నాపట్ల వ్యవహరించాడు” అంది.
[26] ఆమెకు ఆరో నెల అయినప్పుడు దేవుడు గబ్రియేల్ అనే దేవదూతను గలలీలో నజరేతు అనే గ్రామానికి,
[27] ఒక కన్య దగ్గరకు పంపాడు. ఆమెకు యోసేపు అనే వ్యక్తితో పెళ్ళి నిశ్చయమైంది. యోసేపు దావీదు వంశికుడు. ఆ కన్య పేరు మరియ.
[28] దేవదూత లోపలికి వచ్చి “శుభం! నీవు దయ పొందినదానివి! ప్రభువు నీకు తోడై ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలవు” అన్నాడు.
[29] అయితే ఆమె ఆయనను చూచినప్పుడు ఆ మాటలకు చాలా కంగారుపడి ఈ అభివందనం ఏమిటో అని తలపోసింది.
[30] అప్పుడు దేవదూత ఆమెతో ఇలా అన్నాడు: “మరియా, భయపడకు. దేవుని దయ నీకు లభించింది.
[31] ఇదిగో విను. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. ఆయనకు యేసు అని నామకరణం చేస్తావు.
[32] ఆయన గొప్పవాడై ఉంటాడు. ఆయనను సర్వాతీతుని కుమారుడు అనడం జరుగుతుంది. ప్రభువైన దేవుడు ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనం ఆయనకిస్తాడు.
[33] ఆయన యాకోబు వంశాన్ని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం అంటూ ఉండదు.”
[34] దేవదూతను మరియ “నేను ఏ పురుషుణ్ణి ఎరగను – ఇదెలా జరుగుతుంది?” అని అడిగింది.
[35] దేవదూత ఆమెకిలా జవాబిచ్చాడు: “పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు. సర్వాతీతుని బలప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది.
[36] ఇదిగో విను. మీ చుట్టం ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భంతో ఉంది, కొడుకును కనబోతుంది. గొడ్రాలనబడ్డ ఆమెకు ఇది ఆరో నెల.
[37] దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు.”
[38] అందుకు మరియ “ఇదిగో ప్రభు చరణదాసిని. మీ మాట ప్రకారమే నాపట్ల జరగనివ్వండి” అంది. అప్పుడు దేవదూత ఆమె దగ్గరనుంచి వెళ్ళిపోయాడు.
[39] ఆ రోజుల్లో మరియ లేచి యూదా కొండసీమలో ఉన్న ఒక గ్రామానికి త్వరగా వెళ్ళి
[40] జెకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలీసబెతుకు అభినందనం చేసింది.
[41] మరియ అభినందనం ఆమెకు వినబడడంతోనే ఎలీసబెతు గర్భంలోని శిశువు గంతులు వేశాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండుకొంది.
[42] అప్పుడు ఎలీసబెతు బిగ్గరగా ఇలా అంది: “స్త్రీలలో నీవు దీవెన పొందిన దానివి! నీ గర్భ ఫలం ధన్యుడు!
[43] నా ప్రభువును కనబోయే తల్లి నా దగ్గరకు రావడం నాకెలా జరిగినట్టు?
[44] ఇదిగో విను, నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు.
[45] ప్రభువు తనతో చెప్పిన సంగతులు నెరవేరుతాయి, గనుక నమ్మిన ఈమె ధన్యురాలు!”
[46] అప్పుడు మరియ అంది “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తూ ఉంది.
[47] నా విముక్తి ప్రదాత అయిన దేవునిలో నా ఆత్మ ఆనందిస్తూ ఉంది.
[48] ఎందుకంటే, ఆయన తన చరణదాసి దీన స్థితిని దయతో చూశాడు. ఇప్పటినుంచి అన్ని తరాల జనులు నన్ను ధన్యురాలంటారు.
[49] ఎందుకంటే అమిత శక్తివంతుడు నాకు గొప్ప మేళ్ళు చేశాడు. ఆయన పేరు పవిత్రం.
[50] తానంటే భయభక్తులున్నవారి మీద ఆయన కరుణ తరతరాలకు ఉంటుంది.
[51] ఆయన తన చేతితో బలప్రభావాలను ప్రదర్శించాడు. తమ హృదయాల ఆలోచనల్లో గర్వపడే వారిని ఆయన చెదరగొట్టివేశాడు.
[52] పరిపాలకులను వారి సింహాసనాలమీద నుంచి పడలాగివేశాడు. దీన స్థితిలో ఉన్నవారిని హెచ్చించాడు.
[53] ఆకలితో ఉన్నవారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచాడు, ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాడు.
[54] మన పూర్వీకులతో తాను చెప్పినట్టే అబ్రాహాముపట్లా అబ్రాహాము సంతానంపట్లా శాశ్వతంగా కరుణ చూపడం జ్ఞాపకముంచుకొని
[55] తనకు సేవ చేసే ఇస్రాయేల్‌కు సహాయం చేశాడు.”
[56] ఎలీసబెతు దగ్గర సుమారు మూడు నెలలుండి మరియ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది.
[57] ఎలీసబెతు ప్రసవ కాలం వచ్చినప్పుడు కొడుకును కన్నది.
[58] ప్రభువు ఆమెమీద గొప్ప జాలి చూపాడని విని ఆమె ఇరుగుపొరుగువారూ చుట్టాలూ ఆమెతో కూడా సంతోషించారు.
[59] ఈ చిన్న పిల్లవానికి ఎనిమిదో రోజున సున్నతి చేయడానికి వారు వచ్చారు. జెకర్యా అని అతడి తండ్రి పేరే పెట్టబోయారు
[60] గానీ అతడి తల్లి “అలా కాదు. అతడికి యోహాను అని పెట్టాలి” అంది.
[61] వారు ఆమెతో “ఈ పేరు మీ చుట్టాలలో ఎవరికీ లేదు గదా!” అన్నారు.
[62] అప్పుడు తండ్రి పిల్లవాడికి ఏమి పేరు పెట్టాలనుకొన్నాడో అని సైగ చేసి అతణ్ణి అడిగారు.
[63] అతడు పలక తేవాలని సూచించి దానిమీద “అతడి పేరు యోహాను!” అని రాశాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది.
[64] వెంటనే జెకర్యా నోరు తెరచుకొంది, నాలుకసడలింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడసాగాడు.
[65] వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరినీ భయం ఆవరించింది. యూదయ కొండ సీమ అంతటా ఈ మాటలను గురించి చెప్పుకోవడం జరిగింది.
[66] విన్నవారంతా వాటిని హృదయంలో ఉంచుకొని “ఈ అబ్బాయి ఎలాంటివాడవుతాడో!” అన్నారు. ప్రభు హస్తం అతడికి తోడై ఉంది.
[67] అతడి తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నిండుకొని ప్రవక్తగా ఇలా పలికాడు:
[68] “ఇస్రాయేల్ ప్రభువైన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక! ఆయన తన జనాన్ని సందర్శించి విమోచించాడు.
[69] తన సేవకుడైన దావీదు వంశంలో మనకోసం రక్షణ శృంగాన్ని లేవనెత్తాడు.
[70] కాలాలారంభం నుంచి ఆయన తన పవిత్ర ప్రవక్తల నోట పలికించినట్టే
[71] మన శత్రువుల బారినుంచీ మనలను ద్వేషించేవారందరి చేతినుంచీ మనకు రక్షణ కలగాలని
[72] మన పూర్వీకులకు వాగ్దానం చేసిన కరుణ చూపేందుకూ తన పవిత్రమైన ఒడంబడిక జ్ఞాపకముంచుకొనేందుకూ ఈ విధంగా చేశాడు.
[73] ఇది మన పూర్వీకుడైన అబ్రాహాముకు చేసిన ప్రమాణం.
[74] దాని ప్రకారం మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది
[75] బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేయాలని ఆయన ఉద్దేశం.
[76] “చిన్నవాడా, నిన్ను సర్వాతీతుని ప్రవక్త అంటారు. ఎందుకంటే, నువ్వు ప్రభువుకు ముందుగా వెళ్తూ ఆయన త్రోవలను సిద్ధపరుస్తావు.
[77] ఆయన ప్రజలకు పాపక్షమాపణ కలగడం వల్ల వారికి విముక్తిని గురించిన జ్ఞానం నీద్వారా తెలిసిపోతుంది.
[78] ఇది మన దేవుని మహా వాత్సల్యం వల్లే జరిగేది. దానితో పైనుంచి ఉదయకాంతి మనల్ని సందర్శించింది.
[79] చీకటిలో, చావునీడలో కూర్చుని ఉన్న వారిమీద ఈ కాంతి ప్రకాశించాలనీ మన పాదాలను శాంతి మార్గంలోకి నడిపించాలనీ ఇందులో దేవుని ఉద్దేశం.”
[80] ఆ బాలుడు పెరుగుతూ ఆధ్యాత్మిక బలం పొందుతూ వచ్చాడు. అతడు ఇస్రాయేల్ ప్రజలకు కనబడేవరకూ ఎడారి ప్రదేశాలలో ఉండిపోయాడు.