Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్‌ప్రజ ఇలా మిస్పాలో శపథం చేశారు: “మనలో ఎవ్వరూ బెన్యామీనువారితో వియ్యమంద కూడదు.”

[2] ఇప్పుడు వారు బేతేల్‌కు వెళ్ళి, అక్కడ సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చుని ఉండి గొంతెత్తి భోరున ఏడ్చారు.

[3] “యెహోవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! ఇస్రాయేల్ ప్రజలకు ఇలా ఎందుకు జరిగింది? ఈరోజు ఇస్రాయేల్ గోత్రాలలో ఒక గోత్రం లేకుండా పోయిందెందుకు?” అన్నారు.

[4] మరుసటి రోజు ప్రొద్దున్నే వారు ఒక బలిపీఠం కట్టి దానిమీద హోమ బలులు, శాంతి బలులు అర్పించారు.

[5] అప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు “ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకుండా ఉన్నారా?” అని విచారించారు. ఎందుకంటే, మిస్పాలో యెహోవా ఎదుట ఎవరైనా సమావేశం కాకపోతే వారిని చంపాలని వారు అక్కడ శపథం చేశారు.

[6] ఇప్పుడు వారు తమ సోదరులైన బెన్యామీనువారి విషయం నొచ్చుకుంటూ, “ఇస్రాయేల్‌లో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయిందే.

[7] వారికి మన పిల్లలను పెళ్ళిచేయకూడదని మనం యెహోవా పేర శపథం చేసుకొన్నాం గదా! మరి వారిలో మిగిలిన వారికి భార్యల మాట ఎలా? వీరి కోసం ఏం చేద్దామంటారు?” అని చెప్పుకొన్నారు.

[8] అప్పుడు వారు ఇలా ప్రశ్నించుకొన్నారు: “ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో నుంచి యెహోవా ఎదుట మిస్పాలో సమావేశం కాని గోత్రం ఏది?” చివరకు యాబేష్ గిలాదునుంచి సమావేశానికి ఎవ్వరూ శిబిరంలోకి రాలేదని తెలుసుకొన్నారు.

[9] ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు యాబేష్ గిలాదునుంచి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.

[10] అప్పుడు సమాజంవారు పన్నెండు వేలమంది యుద్ధవీరులను యాబేష్ గిలాదుకు పంపిస్తూ ఇలా ఆదేశించారు.: “మీరు అక్కడికి వెళ్ళి అక్కడి వాళ్ళను – స్త్రీలనూ చిన్నవాళ్ళను కూడా – ఖడ్గానికి గురి చేయాలి.

[11] మీరు చేయవలసినదేమిటంటే, ప్రతి పురుషుణ్నీ, కన్య కాని ప్రతి స్త్రీని చంపండి.”

[12] వారు వెళ్ళి, యాబేష్ గిలాదులో ఉన్న వారిలో పురుష సాంగత్యం ఎరుగని నాలుగువందల మంది యువతులను కనుగొన్నారు. వారిని కనానులో షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకువచ్చారు.

[13] అప్పుడు సమాజమంతా రిమ్మోనుబండ దగ్గర ఉన్న బెన్యామీనువారికి శాంతి చేసుకుందామని కబురు పంపారు.

[14] ఆ సమయంలో బెన్యామీనువారు తిరిగి వచ్చారు. యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికి ఇవ్వడం జరిగింది. అయితే వారందరికీ సరిపోయేంతమంది లేరు.

[15] ఇస్రాయేల్ గోత్రాలలో లోపం కలిగేలా యెహోవా చేసినందుచేత ప్రజలు బెన్యామీను వారి విషయం నొచ్చుకొన్నారు.

[16] అప్పుడు సమాజం పెద్దలు ఇలా అన్నారు: “బెన్యామీను గోత్రంలో స్త్రీలు ఉండకుండా నాశనమయ్యారు గదా. మరి ఈ మిగతా పురుషులకు భార్యలు దొరికేట్టు మనం ఏం చెయ్యాలి?

[17] ఇస్రాయేల్ గోత్రాలలో ఒక గోత్రం నిర్మూలం కాకుండేలా బెన్యామీనుగోత్రంలో మిగిలిపోయినవారికి వారసులు కావాలి.

[18] కానీ, మన కూతుళ్లను వారికి భార్యలుగా ఇవ్వలేము. ఎందుకంటే, ‘బెన్యామీనువాడికి తన కూతురును ఇచ్చిన వాడెవడైనా శాపగ్రస్తుడు’ అని ఇస్రాయేల్‌వారైన మనం శపథం చేసుకొన్నాం గదా.

[19] అయితే ఇదిగో, షిలోహులో యెహోవాకు ఏటేటా పండుగ జరుగుతుంది గదా”. (షిలోహు బేతేల్‌కు ఉత్తరంగా, బేతేల్‌కు షెకెంకు పోయే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉంది.)

[20] అప్పుడు వారు బెన్యామీనువారిని ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్ళి ద్రాక్షతోటలలో దాక్కొని చూస్తూవుండండి.

[21] షిలోహునుంచి అమ్మాయిలు నాట్యంలో కలవడానికి వస్తూవున్నప్పుడు మీరు ద్రాక్షతోటలనుంచి త్వరగా పరుగెత్తి వెళ్ళి ప్రతివాడూ షిలోహు అమ్మాయిలలో ఒకదానిని భార్యగా పట్టుకోవాలి. అప్పుడు బెన్యామీను ప్రదేశానికి వెళ్ళిపోండి.

[22] వాళ్ళ తండ్రులు గానీ, సోదరులు గానీ మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో ఇలా అంటాం: “ఆ యుద్ధం కారణంగా వారికి భార్యలు దొరకలేదు. మీరు మాపట్ల దయ చూపి వారికి సహాయం చెయ్యండి. ఈ విషయంలో మీరు నిరపరాధులు. ఎందుకంటే, మీ అంతట మీరు మీ కూతుళ్ళను వారికివ్వలేదు గదా.’”

[23] బెన్యామీనువారు అలా చేశారు. ఆ అమ్మాయిలు నాట్యం చేస్తూ ఉంటే ఒక్కొక్కడు ఒక అమ్మాయిని పట్టుకొని తనకు భార్యగా తీసుకువెళ్ళాడు. అప్పుడు వారు వారసత్వ భూమికి తిరిగి వెళ్ళి, పట్టణాలు మళ్ళీ కట్టి, వాటిలో కాపురం చేశారు.

[24] ఆ సమయంలో ఇస్రాయేల్‌ప్రజలు ఆ స్థలం విడిచి తమ తమ గోత్రాలకు, కుటుంబాలకు, వారసత్వ భూమికి వెళ్ళిపోయారు.

[25] ఆ రోజుల్లో ఇస్రాయేల్‌ప్రజకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినట్టు వారు చేసేవారు.

న్యాయాధిపతులు — Chapters