[1] యెహోషువ చనిపోయిన తరువాత ఇస్రాయేల్‌ప్రజలు “కనానువాళ్ళతో యుద్ధం చేయడానికి మాలో ముందు ఎవరు వెళ్ళాలి?” అని యెహోవాను ప్రార్థించారు.
[2] “యూదా గోత్రంవారు ముందు వెళ్ళాలి. నేను ఈ దేశాన్ని వారి చేతికి అప్పగించాను” అని యెహోవా జవాబిచ్చాడు.
[3] అప్పుడు యూదావారు తమ సోదరులైన షిమ్యోను గోత్రంవారితో “కనానువాళ్ళ మీద యుద్ధం చేయడానికి మా వాటా భూమిలోకి మాతోపాటు రండి. అలాగే మీతోపాటు మేము మీ వాటా భూమిలోకి వస్తాం” అని చెప్పారు. గనుక షిమ్యోనువాళ్ళు వారితో కూడా వెళ్ళారు.
[4] యూదావారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కనానుజాతివాళ్ళను, పెరిజ్జిజాతి వాళ్ళను, యెహోవా వారి చేతికి అప్పగించాడు. వారు బెజెకు దగ్గర పదివేలమందిని హతం చేశారు.
[5] బెజెకు దగ్గర అదోనిబెజెకును చూచి, అతడితో యుద్ధం చేసి, కనాను వాళ్ళను, పెరిజ్జివాళ్ళను ఓడించారు.
[6] అదోనిబెజెకు పారిపోయాడు గాని అతణ్ణి తరిమి, పట్టుకొని, అతడి చేతి బొటనవ్రేళ్ళు, కాలి బొటనవ్రేళ్ళు కోసి పారేశారు.
[7] అదోనిబెజెకు అన్నాడు, “ఇలా కాళ్ళుచేతుల బొటన వ్రేళ్ళు కోయబడ్డ రాజులు డెబ్భైమంది నా బల్లకింద పడ్డ ఎంగిలి ముక్కలు ఏరుకొన్నారు. నేను చేసినదానికి దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు.” వారు అతణ్ణి జెరుసలంకు తీసుకువచ్చారు. అతడక్కడ చనిపోయాడు.
[8] యూదావారు జెరుసలం మీద కూడా యుద్ధం చేసి, దానిని పట్టుకొని కత్తిపాలు చేసి తగులబెట్టారు.
[9] ఆ తరువాత యూదా మనుషులు కొండప్రదేశంలో, దక్షిణం ఎడారిలో, పడమటి కొండ దిగువప్రాంతంలో కాపురమున్న కనానువాళ్ళపై యుద్ధానికి బయలుదేరారు.
[10] వారు హెబ్రోనులో ఉండి కనానువాళ్ళ మీదికి వెళ్ళారు. (హెబ్రోనుకు ముందు పేరు కిర్యత్‌అర్బా.) అక్కడ షేషయి, అహీమాను, తలమయి అనేవాళ్ళను హతమార్చారు.
[11] అక్కడనుంచి వారు దెబీరు కాపురస్తులమీద దండెత్తారు. (దెబీరుకు ముందు పేరు కిర్యత్ సేఫెరు.)
[12] “కిర్యత్ సేఫెరును ఓడించి దానిని పట్టుకొన్న వాడికి నా కూతురు అక్సాను పెళ్ళి చేస్తాను” అని కాలేబు చాటించాడు.
[13] కాలేబు తోబుట్టువు కనజు కొడుకైన ఒతనీయేల్ ఆ ఊరు పట్టుకొన్నాడు గనుక అతనికి కాలేబు తన కూతురు అక్సాను భార్యగా ఇచ్చాడు.
[14] ఆమె అతడి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడుగుదామని అతణ్ణి సమ్మతింపజేసింది. ఆమె వచ్చి గాడిద దిగగానే “నీకేం కావాలమ్మా” అని కాలేబు అడిగాడు.
[15] “నా పై అనుగ్రహం చూపండి. మీరు నన్ను దక్షిణ ఎడారిప్రాంతంలో ఉంచారు. కనీసం కొన్ని ఊటలు నాకివ్వండి” అందామె. అందుచేత అతడు ఆమెకు ఎగువనున్న ఊటలూ, దిగువనున్న ఊటలూ ఇచ్చాడు.
[16] మోషే మామ కేయినుజాతివాడు. అతడి సంతానం యూదాప్రజలతోపాటు ‘ఖర్జూరచెట్ల పట్టణం’ నుంచి అరాదుకు దక్షిణంగా ఉన్న యూదా ఎడారికి వెళ్ళారు. అక్కడి జనంమధ్య కాపురం ఏర్పరచుకొన్నారు.
[17] అప్పుడు యూదావారు తమ సోదరులైన షిమ్యోను గోత్రంవారితో కలిసి వెళ్ళి జెఫతులో ఉన్న కనాను జాతివాళ్ళను హతమార్చి, పట్టణాన్ని సర్వనాశనం చేశారు. అందుకే ఆ పట్టణానికి హోర్మా అనే పేరు వచ్చింది.
[18] గాజానూ దాని ప్రాంతాన్నీ, అష్కేలోనునూ దాని ప్రాంతాన్నీ, ఎక్రోనునూ దాని ప్రాంతాన్నీ కూడా యూదావారు పట్టు కొన్నారు.
[19] యూదావారికి యెహోవా తోడుగా ఉన్నాడు. వారు కొండ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. కానీ, మైదానాల ప్రదేశంలో ఉన్న వాళ్ళకు ఇనుప రథాలున్నందు చేత వాళ్ళను మాత్రం వెళ్ళగొట్టలేదు.
[20] మోషే ఇచ్చిన మాటప్రకారం హెబ్రోనును కాలేబుకు ఇచ్చారు. అతడు అనాకు యొక్క ముగ్గురు కొడుకులను దాని నుంచి వెళ్ళగొట్టాడు.
[21] కానీ, జెరుసలంలో కాపురమున్న యెబూసిజాతివాళ్ళను బెన్యామీను గోత్రంవారు వెళ్ళగొట్టలేదు. ఈనాటికీ జెరుసలంలో యెబూసివాళ్ళు బెన్యామీనువారితో కాపురం ఉన్నారు.
[22] యోసేపు వంశంవారు బేతేల్ మీదికి యుద్ధానికి వెళ్ళారు. యెహోవా వారితో ఉన్నాడు.
[23] బేతేల్‌ను వేగు చూడడానికి యోసేపు వంశంవారు కొంతమందిని పంపించారు. (బేతేల్‌కు ముందు పేరు లూజు.)
[24] ఎవరో ఒకరు ఊరిలో నుంచి రావడం ఆ గూఢచారులు చూశారు. “ఊరిలోకి మాకు దారి చూపితే మీకు మేలు చేస్తాం” అని అతడితో చెప్పారు.
[25] అతడు ఊరిలోకి దారి చూపాడు. వారు ఊరిని కత్తిపాలు చేశారు గాని, ఆ మనిషిని, అతడి కుటుంబం వారందరినీ మాత్రం వాళ్ళు వదలివేశారు.
[26] అతడు హిత్తివాళ్ళ దేశం పోయి అక్కడ ఒక ఊరిని నిర్మించి దానికి లూజు అని పేరు పెట్టాడు. ఈనాటికీ దానికి అదే పేరు.
[27] మనష్షే గోత్రంవారు బేత్‌షెయాను, తయినాకు, దోరు, ఇబలెయీం, మెగిద్దో పట్టణాలనూ వాటి గ్రామాలనూ వశం చేసుకోలేదు. ఎందుకంటే కనానువాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి పోవాలని గట్టి పట్టుపట్టారు.
[28] ఇస్రాయేల్‌ప్రజ బలపడ్డాక వారు ఆ కనాను వాళ్ళతో వెట్టిచాకిరి చేయించు కొన్నారు గాని వారిని పూర్తిగా వెళ్ళగొట్టలేదు.
[29] ఎఫ్రాయిం గోత్రంవారు గెజెరులో ఉన్న కనానువాళ్ళను వెళ్ళగొట్టలేదు. కనానువారు గెజెరులో వారిమధ్యనే కాపురముంటున్నారు.
[30] జెబూలూను గోత్రంవారు కిత్రోను కాపురస్తులను గానీ నహలోల్ కాపురస్తులను గానీ వెళ్ళగొట్టలేదు. కనానువాళ్ళు వారిమధ్యనే కాపురం ఉంటూ వారికి వెట్టిచాకిరి చేసేవాళ్ళయ్యారు.
[31] ఆషేరు గోత్రంవారు అక్కోలో గానీ, సీదోనులో గానీ, అహ్లాబ్‌లో గానీ, అక్‌జీబ్‌లో గానీ, హెలబాలో గానీ, అఫెకులో గానీ, రెహోబ్‌లో గానీ కాపురమున్న వాళ్ళను వెళ్ళగొట్టలేదు.
[32] అందుచేత ఆషేరు ప్రజలు ఆ ప్రదేశంలో ఉన్న కనానువాళ్ళ మధ్య నివాసం చేశారు.
[33] నఫ్తాలి గోత్రంవారు బేత్‌షెమెషు కాపురస్తులను గానీ బేతనాతు కాపురస్తులను గానీ వెళ్ళగొట్ట లేదు. నఫ్తాలివారు కూడా కనానువారిమధ్య కాపురం చేశారు. అయినా బేత్‌షెమెషువాళ్ళు, బేతనాతువాళ్ళు వారికి వెట్టిచాకిరి చేసేవాళ్ళయ్యారు.
[34] దాను గోత్రంవారిని అమోరీజాతివాళ్ళు కొండ ప్రాంతానికి నెట్టివేశారు. వారిని మైదానాల ప్రాంతానికి రానివ్వలేదు.
[35] అమోరీవాళ్ళు హెరేసు కొండలో అయ్యాలోనులో, షయల్‌బీమ్లో కాపురముండాలని గట్టి పట్టు పట్టారు. కాని, యోసేపువంశంవారి బలం వృద్ధి అయ్యాక వాళ్ళచేత వెట్టిచాకిరి చేయించుకొన్నారు.
[36] అక్రబ్బీం నుంచి సెలావరకు సెలా అవతలకు అమోరీవాళ్ళ సరిహద్దు వ్యాపించింది.