[1] ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు, గనుక యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయవాళ్ళ చేతికప్పగించాడు.
[2] దాను వంశంవాడొకడు జోర్యాలో ఉండేవాడు. అతని పేరు మానోహ. అతని భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
[3] యెహోవా దూత ఆమెకు సాక్షాత్కరించి ఆమెతో ఇలా అన్నాడు: “నీవు గొడ్రాలివి. నీకు పిల్లలు లేరు. అయినా నీవు గర్భవతివవుతావు. కొడుకును కంటావు.
[4] అందుచేత నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షమద్యం గానీ, మరే మద్యం గానీ త్రాగకు, అశుద్ధమైనది ఏదీ తినకు.
[5] ఎందుకంటే, నీవు గర్భవతివయి కొడుకును కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పటినుంచీ నాజీర్‌గా ఉంటాడు, గనుక అతని నెత్తిమీద మంగలి కత్తి పెట్టకూడదు. ఫిలిష్తీయవాళ్ళ చేతులలోనుంచి అతడు ఇస్రాయేల్‌వారిని విడిపించడం ఆరంభిస్తాడు.”
[6] అప్పుడామె తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది: “దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన దేవదూతలాగా బీకరంగా కనిపించాడు. ఆయన ఎక్కడనుంచి వచ్చాడో నేను అడగలేదు. ఆయన తన పేరు నాకు చెప్పలేదు.
[7] అయితే ఆయన నాతో ఇలా చెప్పాడు: ‘విను, నీవు గర్భవతివవుతావు. కొడుకును కంటావు. నీవు ద్రాక్ష మద్యం గానీ మరే మద్యం గానీ త్రాగకు, అశుద్ధమైనది ఏదీ తినకు. ఎందుకంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటినుంచి చనిపోయేదాకా నాజీర్‌గా ఉంటాడు.’”
[8] అప్పుడు మానోహ యెహోవాకు ప్రార్థన చేసి “నీవు పంపిన ఆ దేవుని మనిషిని మళ్ళీ మా దగ్గరికి పంపించు. పుట్టే పిల్లవాణ్ణి మేము ఎలా పెంచాలో మాకు చెప్పమను” అన్నాడు.
[9] దేవుడు మానోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూచుని ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె భర్త మానోహ ఆమె దగ్గర లేడు.
[10] ఆమె తన భర్త దగ్గరికి త్వరగా పరుగెత్తి “ఆ రోజు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి నాకు కనిపించాడు” అని చెప్పింది.
[11] మానోహ లేచి తన భార్యవెంట వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి చేరి, “నా భార్యతో మాట్లాడినది మీరేనా?” అని అడిగాడు. అతడు “నేనే” అన్నాడు.
[12] అప్పుడు మానోహ “మీరు చెప్పినది జరిగాక, ఆ పిల్లవాడు బ్రతుకు తీరు, పని ఎలా ఉండాలి?” అనడిగాడు.
[13] అందుకు యెహోవా దూత ఇలా జవాబిచ్చాడు: “నేను నీ భార్యకు చెప్పినట్టెల్లా ఆమె చేయాలి.
[14] ద్రాక్షనుంచి వచ్చేది ఏదీ ఆమె తినకూడదు. ద్రాక్షమద్యం గానీ, మరే మధ్యం గానీ ఆమె త్రాగకూడదు. అశుద్ధమైనది ఏదీ తినకూడదు. నేను ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి.”
[15] యెహోవా దూతతో మానోహ “మీ కోసం మేము ఒక మేకపిల్లను వంట చేసేదాకా మీరు ఆగాలని మనవి చేస్తున్నాం” అన్నాడు.
[16] యెహోవా దూత “నీవు నన్ను నిలిపినా నీ భోజనం నేను తినను. అయితే నీవు హోమబలి అర్పించాలనుకొంటే యెహోవాకు అర్పించు” అని మానోహతో బదులు చెప్పాడు. ఆయన యెహోవా దూత అని మానోహకు తెలియదు.
[17] మానోహ “మీరు చెప్పినది జరిగాక మేము మిమ్మల్ని గౌరవించేట్టు మీ పేరేమిటో చెప్తారా?” అని యెహోవా దేవదూతను అడిగాడు.
[18] అందుకు “నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం” అని యెహోవా దూత జవాబిచ్చాడు.
[19] మానోహ నైవేద్యంతోపాటు ఒక మేకపిల్లను తెచ్చి బండమీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మానోహ, అతని భార్య చూస్తూ ఉండగానే యెహోవా దూత అద్భుతం జరిగేలా చేశాడు.
[20] ఆ బలిపీఠంనుంచి మంటలు ఆకాశంవైపు లేస్తూ ఉంటే యెహోవా దూత ఆ మంటల్లో పైకి వెళ్ళిపోయాడు. మానోహ, అతని భార్య అది చూచి నేల మీద సాష్టాంగపడ్డారు.
[21] ఆ తరువాత యెహోవా దూత మానోహకు, అతని భార్యకు మళ్ళీ కనిపించలేదు. ఆయన యెహోవా దూత అని మానోహకు అప్పుడు తెలిసింది.
[22] “మనం దేవుణ్ణి చూశాం. మనకిక చావు తప్పదు” అని మానోహ తన భార్యతో అన్నాడు.
[23] అయితే అతని భార్య “యెహోవా మనల్ని చంపాలని కోరితే మన చేతులతో అర్పించిన హోమబలినీ, నైవేద్యాన్నీ ఆయన అంగీకరించి ఉండేవాడు కాదు. మనకు ఈ విషయాలన్నీ చూపించేవాడు కాదు. ఇప్పుడు ఇలాంటి సంగతులు మనకు చెప్పేవాడు కాదు” అని అతనికి జవాబిచ్చింది.
[24] తరువాత ఆమె పిల్లవాణ్ణి కన్నది. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. యెహోవా అతడికి ఆశీస్సులు ప్రసాదించాడు.
[25] అతడు జోర్యాకు ఎష్‌తాయోల్‌కు మధ్య మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.