Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అహరోను పవిత్ర స్థలంలో చేసే సేవకోసం అతనికి పవిత్ర వస్త్రాలను కుట్టారు. నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతో నేసిన వస్త్రాలను చేశారు.

[2] అతడు బంగారంతోను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన సన్నని నారతోను ఏఫోదు చేశాడు.

[3] నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను సన్నని నారతోను నేర్పుగల పనివారు నేయడానికి బంగారాన్ని రేకులుగా కొట్టి దాన్ని తీగలుగా కత్తిరించాడు.

[4] ఏఫోదుకు రెండు భుజఖండాలు చేసి దాని ముందు భాగం, వెనుక భాగం కూర్చారు.

[5] దానిమీద నేసిన కట్టు దానిలాగే బంగారంతోను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన సన్న నారతోను దానితో ఏకాండంగా కుట్టారు. ఇది యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే.

[6] మిశ్రిత వర్ణ రత్నాలను తీసుకొని ముద్రమీద చెక్కినట్టు వాటిమీద ఇస్రాయేల్ కొడుకుల పేర్లు చెక్కారు. వాటిని బంగారు జవలలో పొదిగారు.

[7] యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతడు ఆ రత్నాలను ఇస్రాయేల్ ప్రజలను గురించిన స్మృతి చిహ్నంగా ఏఫోదు భుజఖండాల మీద ఉంచాడు.

[8] అతడు బంగారంతోను నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నారతోను వక్షపతకం ఏఫోదులాగే చేశాడు. అది నేర్పుగల పనివాడి పని.

[9] దాన్ని మడత పెట్టాక అది చదరంగా ఉంది – దాని పొడవు ఒక జేన, దాని వెడల్పు ఒక జేన.

[10] దానిలో రత్నాలు నాలుగు పంక్తులుగా పెట్టారు. మొదటి పంక్తిలో మాణిక్యం, గోమేధికం, పచ్చ ఉన్నాయి.

[11] రెండో పంక్తిలో పద్మరాగం, నీలం, వజ్రం ఉన్నాయి.

[12] మూడో పంక్తిలో పుష్యరాగం, కెంపు, ఊదామణి ఉన్నాయి.

[13] నాలుగో పంక్తిలో ఫిరోజా, మిశ్రితవర్ణ రత్నం, సూర్యకాంతం ఉన్నాయి. ఇవన్నీ బంగారు జవలలో పొదిగించబడ్డాయి.

[14] ఇస్రాయేల్ కొడుకుల పన్నెండు పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ముద్రమీద చెక్కిన విధంగా వాటిమీద పన్నెండు గోత్రాల పేర్లు – ఒక్కొక్క రత్నంమీద ఒక్కొక్క పేరు – చెక్కారు.

[15] వక్షపతకం కోసం దారాలను అల్లిన విధంగా మేలిమి బంగారంతో గొలుసులను అల్లారు.

[16] వారు రెండు బంగారు జవలనూ రెండు బంగారు ఉంగరాలనూ చేసి ఉంగరాలను వక్షపతకం రెండు కొనలకు తగిలించారు.

[17] అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను ఆ రెండు కొనలకున్న ఆ రెండు ఉంగరాలలో తగిలించారు.

[18] అల్లిన గొలుసుల ఇతర రెండు కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజఖండాల ముందుభాగాల మీద కట్టారు.

[19] బంగారంతో ఇంకా రెండు ఉంగరాలను చేసి ఏఫోదు ఎదుట వక్షపతకం లోపలి అంచున దాని క్రింది రెండు కొనలకు తగిలించారు.

[20] ఇంకా రెండు బంగారు ఉంగరాలను చేసి ఏఫోదు కట్టుపైగా దాని కూర్పుదగ్గరే దాని భుజఖండాల ముందుభాగాలక్రింద తగిలించారు.

[21] వక్షపతకం ఏఫోదు కట్టుమీద ఉండేలా, ఏఫోదునుంచి వదలకుండా ఉండేలా దాన్ని దాని ఉంగరాలతో ఏఫోదు ఉంగరాలకు నీలిదారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వారు చేశారు.

[22] అతడు ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలిదారంతో అల్లిక పనిగా చేశాడు.

[23] తలకోసం దాని నడుమ రంధ్రం చేశాడు. ఆ రంధ్రం చుట్టు అంగీ చినగకుండేలా కంఠకవచ రంధ్రంలాగా దానిచుట్టూ నేసిన గోటు ఉంది.

[24] ఆ అంగీక్రింద అంచున చుట్టూ నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన నారతోను దానిమ్మపళ్ళవంటివాటిని చేసి తగిలించారు.

[25] మేలిమి బంగారంతో గంటలను చేసి ఆ దానిమ్మపళ్ళ మధ్య – ఆ అంగీ అంచులమీద చుట్టు ఉన్న దానిమ్మ పళ్ళమధ్య – ఆ గంటలను పెట్టారు.

[26] గంట, దానిమ్మపండు, గంట, దానిమ్మ పండు – ఇలా ఆ నిలువుటంగీ క్రింద అంచున చుట్టూ ఉంచారు. ఇది యాజుల సేవకోసం, యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే వారు చేశారు.

[27] వారు అహరోను కోసం, అతని కొడుకుల కోసం సన్ననినారతో చొక్కాలను నేశారు.

[28] సన్ననినారతో పాగానూ అందమైన కుళ్ళాయిలనూ పేనిన సన్నని నారతో షరాయిలనూ కూడా చేశారు.

[29] పేనిన సన్నని నారతోను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను నడికట్టును బుట్టాపనిగా చేశారు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ చేశారు.

[30] వారు కిరీటంలాంటి మేలిమి బంగారు రేకును చేసి ముద్ర చెక్కే విధంగా దానిమీద ఈ మాటలు చెక్కారు: “యెహోవాకు పవిత్రం.”

[31] పాగాకు అంటి ఉండేలా దాన్ని నీలి దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే చేశారు.

[32] ఇలా సన్నిధిగుడారం అనే దైవనివాసాన్ని నిర్మించే పని సంపూర్తి చేయడం జరిగింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లెల్లా ఇస్రాయేల్‌ప్రజలు చేశారు.

[33] వారు దైవనివాసాన్ని – దాన్ని, దాని సామానంతా మోషేదగ్గరికి తెచ్చారు. దాని కొక్కేలనూ పలకలనూ అడ్డకర్రలనూ స్తంభాలనూ గూళ్ళనూ

[34] ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళ కప్పునూ గండుచేప తోళ్ళ పైకప్పునూ కప్పు తెరనూ

[35] శాసనాల పెట్టెనూ దాని మోత కర్రలనూ ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న దాని మూతనూ

[36] బల్లనూ దాని సామానంతా, సన్నిధి రొట్టెనూ

[37] పవిత్రమైన సప్తదీపస్తంభాన్నీ దాని దీపాలనూ – దాని దీపాల వరుసనూ – దాని సామానంతా, దీపాలకోసం నూనెనూ

[38] బంగారు వేదికనూ అభిషేక తైలాన్నీ పరిమళ ధూప ద్రవ్యాన్నీ గుడారం ద్వారంకోసం తెరనూ

[39] కంచు బలిపీఠాన్నీ దాని కంచు జల్లెడనూ దాని మోతకర్రలనూ దాని సామానంతా, గంగాళాన్నీ దాని పీఠాన్నీ

[40] ఆవరణం కోసం తెరలనూ దాని స్తంభాలనూ గూళ్ళనూ ఆవరణద్వారం కోసం తెరనూ తాళ్ళనూ మేకులనూ సన్నిధిగుడారమైన దైవనివాసంలో జరగవలసిన సేవకోసం సామానంతా,

[41] పవిత్రస్థలంలోని యాజుల సేవకోసం నేసిన వస్త్రాలనూ – అహరోనుయాజికోసం పవిత్ర వస్త్రాలనూ, అతని కొడుకులకోసం వస్త్రాలనూ – వీటన్నిటినీ వారు మోషే దగ్గరకు తీసుకువచ్చారు.

[42] యెహోవా మోషేకు ఇచ్చిన అన్ని ఆజ్ఞలప్రకారమే ఇస్రాయేల్ ప్రజలు ఆ పనంతా చేశారు.

[43] వారు చేసిన ఆ పని అంతా మోషే చూశాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వారు ఆ పని చేశారు, గనుక మోషే వారిని దీవించాడు.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters