Skip to content
Opens in a new window

[1] “పవిత్ర స్థానం సేవకోసం అన్ని రకాల పనులు తెలివితో చెయ్యడానికి బసెలేల్, అహోలీయాబు, నేర్పుగల వారందరూ యెహోవాచేత నేర్పూ జ్ఞానమూ పొంది, యెహోవా ఆజ్ఞాపించినట్టెల్లా చేస్తారు” అన్నాడు మోషే.

[2] అప్పుడు మోషే బసెలేల్‌నూ అహోలీయాబునూ యెహోవాచేత నేర్పు పొందిన ప్రవీణులందరినీ – అంటే ఆ పని చెయ్యడానికి తమ హృదయాలు తమను పురికొల్పిన ప్రవీణులందరినీ – పిలిచాడు.

[3] వారు వచ్చి పవిత్ర స్థానం సేవకోసం, ఆ పవిత్ర స్థానాన్ని కట్టడానికి ఇస్రాయేల్ ప్రజలు తెచ్చిన కానుకలన్నిటినీ మోషే దగ్గర తీసుకొన్నారు. అయితే ప్రజలు అతని దగ్గరకు ప్రతి రోజూ ప్రొద్దున ఇంకా స్వేచ్ఛార్పణలు తెస్తూ వచ్చారు.

[4] పవిత్రస్థానంలో వేరు వేరు పనులు చేసే ఆ ప్రవీణులంతా తాము చేస్తూ ఉన్న పనులు విడిచి మోషే దగ్గరకు వచ్చి,

[5] “చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన ఈ పనికోసం కావలసినదానికంటే చాలా ఎక్కువ తెస్తున్నారు ప్రజలు” అన్నారు.

[6] మోషే “పవిత్ర స్థానంకోసం ఏ స్త్రీ, పురుషుడూ ఇకనుంచి ఏ కానుకా తేకూడదు” అని ఆదేశించాడు. ఆ మాట శిబిరంలో అంతటా చాటించారు. అందుచేత ప్రజలు వస్తువులను తీసుకురావడం మానుకొన్నారు.

[7] ఆ పని అంతా చేయడానికి వారు అంతకుముందు తెచ్చినది చాలినంతగా ఉంది; అసలు అది ఎక్కువైంది.

[8] ఆ పని చేసేవారిలో ఎక్కువ నేర్పుగల ప్రతివాడూ దైవనివాసాన్ని పది తెరలతో చేశారు. ఒక వ్యక్తి ఆ తెరలను నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నారతోను ప్రవీణుడు చేసిన ప్రకారమే కెరూబు రూపాలు గలవిగా చేశాడు.

[9] ప్రతి తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ప్రతి తెర కొలత అదే.

[10] అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాడు; మిగతా అయిదు ఒకదానితో ఒకటి కూర్చాడు.

[11] ఒక తెరల వరుసలో చివరి తెర అంచున నీలి దారంతో ఉంగరాలు చేశాడు. అలాగే రెండో తెరల వరుసలో చివరి తెర అంచున ఉంగరాలు చేశాడు.

[12] ఒక్కో తెరకు యాభై ఉంగరాలు చేశాడు; ఆ రెండో వరుసలోని తెర అంచున యాభై ఉంగరాలు చేశాడు; ఆ అల్లిక ఉంగరాలకు ఈ అల్లిక ఉంగరాలు ఎదురుగా ఉన్నాయి.

[13] యాభై కొలుకులను కూడా చేసి ఆ తెరలను ఈ తెరలకు ఆ కొలుకులతో తగిలించాడు. ఆ విధంగా దైవనివాసం ఒకటే అయింది.

[14] అతడు దైవనివాసం పైకప్పుగా మేక వెండ్రుకలతో తెరలను చేశాడు. అవి పదకొండు.

[15] ప్రతి తెర పొడవు ముప్ఫయి మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే.

[16] అయిదు తెరలను ఒకటిగా, మిగతా ఆరు తెరలను ఒకటిగా కూర్చాడు.

[17] ఒక వరుస తెరలలో చివరి తెర అంచున యాభై అల్లిక ఉంగరాలనూ రెండో తెరల వరుసలో చివరి తెర అంచున యాభై ఉంగరాలనూ చేశాడు.

[18] ఆ గుడారం ఒక్కటిగా ఉండేలా దాన్ని కూర్చడానికి యాభై కంచు కొలుకులను చేశాడు.

[19] ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళతో గుడారానికి కప్పునూ, దానిమీద గండుచేప తోళ్ళతో పైకప్పునూ కూడా చేశాడు.

[20] అతడు దైవనివాసం కోసం తుమ్మకర్రతో నిలువు పలకలు కూడా చేశాడు.

[21] పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర.

[22] ప్రతి పలకకూ ఒకదానికొకటి సరైన రెండు కుసులు ఉన్నాయి. దైవనివాసం పలకలన్నిటికీ అలాగే చేశాడు.

[23] దైవనివాసం దక్షిణదిక్కున ఉన్న ప్రక్కకోసం ఇరవై పలకలు చేశాడు.

[24] ప్రతి పలకక్రిందా దాని కుసులకు రెండు గూళ్ళూ, ఆ ఇరవై పలకలక్రింద నలభై వెండి గూళ్ళూ చేశాడు.

[25] దైవనివాసం రెండో ప్రక్కకోసం ఉత్తరదిక్కున కూడా ఇరవై పలకలు చేశాడు.

[26] వాటికి నలభై వెండి గూళ్ళు, అంటే ప్రతి పలకక్రిందా రెండు గూళ్ళు చేశాడు.

[27] పడమటి దిక్కున దైవనివాసం వెనుక ప్రక్కకోసం ఆరు పలకలు చేశాడు.

[28] వెనుక ప్రక్కన దైవనివాసం మూలలకు రెండు పలకలు చేశాడు.

[29] అవి అడుగున కూర్చి ఉన్నాయి, పై భాగాన మొదటి ఉంగరంవరకు ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. రెండు మూలలకు ఉండవలసిన ఆ రెంటికీ అలా చేశాడు.

[30] ఎనిమిది పలకలు ఉన్నాయి. వాటికి వెండి గూళ్ళు పదహారున్నాయి. ఒక్కొక్క పలకక్రింద రెండు గూళ్ళున్నాయి.

[31] తుమ్మకర్రతో అడ్డకర్రలను కూడా చేశాడు. దైవనివాసం ఒక ప్రక్క పలకలకోసం అయిదు అడ్డకర్రలనూ,

[32] రెండో ప్రక్క పలకల కోసం అయిదు అడ్డకర్రలనూ, పశ్చిమ దిక్కున దైవనివాసం వెనుక భాగంకోసం అయిదు అడ్డకర్రలనూ చేశాడు.

[33] ఆ పలకలమధ్య ఉండే నడిమి అడ్డకర్ర ఈ కొననుంచి ఆ కొనవరకు ఉండేలా చేశాడు.

[34] పలకలకు బంగారు తొడుగు చేశాడు. వాటి అడ్డకర్రలను పట్టే ఉంగరాలను బంగారంతో చేశాడు. అడ్డకర్రలకు బంగారు తొడుగు చేశాడు.

[35] పేనిన సన్నని నారతోనూ నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోనూ తెరను చేశాడు. కెరూబు రూపాలను బుట్టాయి వేసి నేర్పుగల పనితనంతో చేశాడు.

[36] దానికోసం తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు. వాటి కొక్కేలు బంగారువి. వాటికి నాలుగు వెండి గూళ్ళు పోత పోశాడు.

[37] గుడారం ద్వారంకోసం నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నారతోను నేత పని అయిన అడ్డతెరను చేశాడు.

[38] దాని అయిదు స్తంభాలూ వాటి కొక్కేలు చేశాడు. ఆ స్తంభాల కొనలకూ వాటి పెండె బద్దలకూ బంగారు తొడుగు చేశాడు. అయితే వాటి అయిదు గూళ్ళు కంచువి.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters