Skip to content
Opens in a new window

[1] ఈజిప్ట్‌దేశానికి యాకోబుతోపాటు వచ్చిన ఇస్రాయేల్ కొడుకుల పేర్లు ఇవి:

[2] రూబేను, షిమ్యోను, లేవీ, యూదా,

[3] ఇశ్శాకారు, జెబూలూను, బెన్యామీను,

[4] దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు.

[5] యాకోబు సంతతి అంతా డెబ్భైమంది. అప్పటికే యోసేపు ఈజిప్ట్‌లో ఉన్నాడు.

[6] యోసేపు, అతడి అన్నదమ్ములు, ఆ తరంవారంతా చనిపోయారు.

[7] ఇస్రాయేల్ ప్రజ ఫలవంతమై బహు సంతానంతో సంఖ్యలో అధికమై బలం గల జనం అయింది. ఆ విధంగా వాళ్ళు ఆ దేశం నలుమూలలా వ్యాపించారు.

[8] ఆ తరువాత యోసేపును ఎరుగని కొత్త చక్రవర్తి ఈజిప్ట్‌లో రాజ్యానికి వచ్చాడు.

[9] అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు: “చూశారా, ఇస్రాయేల్‌ప్రజల సంఖ్య చాలా పెరిగిపోయింది. బలంలో మనల్ని మించిపోయారు.

[10] వాళ్ళింకా ఎక్కువమంది కాకుండేలా వాళ్ళపట్ల మనం యుక్తిగా వ్యవహరించాలి. లేకపోతే, యుద్ధం వస్తే వాళ్ళు మన శత్రువుల పక్షం చేరి, మనతో పోరాడి దేశంనుంచి వెళ్ళిపోతారేమో.”

[11] అందుచేత వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలను భారాలతో అణగదొక్కే అధికారులను వారిమీద నియమించారు. ఈ విధంగా వాళ్ళు ఫరోకోసం సరుకులు నిలువచేసే పట్టణాలను కట్టించారు. (అవి పీతోం, రామెసేసు.)

[12] అయితే ఈజిప్ట్‌వాళ్ళు వారిని అణగదొక్కే కొలదీ ఇస్రాయేల్ ప్రజ పెరిగి వ్యాపించారు. గనుక ఈజిప్ట్‌దేశీయులకు వారి విషయం భయాందోళన కలిగింది.

[13] అందుచేత వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలను కఠిన దాస్యంలో ఉంచారు.

[14] జిగటమట్టి పని, ఇటుక పని, అన్ని రకాల పొలం పనులు బలవంతంమీద వారిచేత చేయించుకొన్నారు. వారి పనంతా కఠినతరం చేస్తూ వారి జీవితాలను దుర్భరం చేశారు.

[15] అంతేగాక, ఈజిప్ట్ చక్రవర్తి హీబ్రూవారి మంత్రసానులతో,

[16] “మీరు హీబ్రూ స్త్రీలకు కాన్పు చేసేటప్పుడు మగబిడ్డ పుడితే చంపెయ్యాలి. ఆడదైతే బతకనియ్యండి” అన్నాడు.

[17] ఆ మంత్రసానుల పేర్లు షిఫ్రా, పూయా. వారికి దేవుడంటే భయభక్తులు గనుక ఈజిప్ట్ చక్రవర్తి తమతో చెప్పినది చేయక, మగపిల్లలను బ్రతకనిచ్చారు.

[18] ఈజిప్ట్ చక్రవర్తి ఆ మంత్రసానులను పిలిపించి వారితో, “మీరు మగపిల్లల్ని ఎందుకు బతకనిచ్చారు? ఇలా చెయ్యడం దేనికి?” అన్నాడు.

[19] ఆ మంత్రసానులు “ఎందుకంటే, హీబ్రూ స్త్రీలు ఈజిప్ట్ స్త్రీలలాంటివాళ్ళు కాదు. వాళ్ళు చాలా బలమైనవారు. వాళ్ళ దగ్గరికి మంత్రసాని చేరేముందే వాళ్ళు ప్రసవిస్తారు” అని ఫరోతో బదులు చెప్పారు.

[20] దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఇస్రాయేల్ ప్రజ సంఖ్యలో అధికమై చాలా బలమైన జనంగా అయింది.

[21] ఆ మంత్రసానులు దేవునిమీద భయభక్తులు ఉంచినందుచేత ఆయన వారికి కుటుంబాలను ప్రసాదించాడు.

[22] ఫరో ఈజిప్ట్ ప్రజలందరికీ “హీబ్రూ వాళ్ళకు పుట్టిన ప్రతి మగబిడ్డనూ నదిలో పారవెయ్యాలి. ప్రతి ఆడబిడ్డనూ బ్రతక నియ్యవచ్చు” అని ఆజ్ఞాపించాడు.

నిర్గమకాండం (దాస్యవిముక్తి) — Chapters