[1] బలిపీఠం దగ్గర యెహోవా నిలబడి ఉండడం నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు: “గడపలు కదలి పోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు. పై కప్పు అందరి తలలమీదా పడేలా వాటిని పగలగొట్టు. మిగిలిన వాళ్ళను తరువాత నేను కత్తిపాలు చేస్తాను. ఒక్కడూ కూడా పారిపోలేడు. ఎవ్వరూ తప్పించుకోరు.
[2] వాళ్ళు మృత్యులోకం వరకు రంధ్రం తొలుచుకొని పోయినా, అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగివేస్తుంది. అంతరిక్షం ఎక్కిపోయినా, అక్కడనుంచి కూడా వాళ్ళను దించివేస్తాను.
[3] వాళ్ళు కర్మెల్ పర్వత శిఖరాన దాక్కొన్నా, నేను వాళ్ళ వెంటబడి అక్కడ వాళ్ళను పట్టుకొంటాను. నా కండ్లకు కనిపించకుండా వాళ్ళు సముద్రం క్రిందిభాగంలో దాక్కొన్నా, అక్కడి సర్పానికి వాళ్ళను కరువమని ఆజ్ఞాపిస్తాను.
[4] శత్రువులు వాళ్ళను బందీలుగా దేశాంతరం తీసుకుపోయినా, అక్కడ ఖడ్గం ధరించినవారికి వాళ్ళను చంపమని ఆజ్ఞాపిస్తాను. వాళ్ళమీదికి మేలు కాదు, కీడే వచ్చేలా నా చూపు వాళ్ళమీద నిలుపుతాను.”
[5] ఆయన ప్రభువు, సేనలప్రభువు యెహోవా. ఆయన భూమిని తాకితే అది కరిగిపోతుంది, భూనివాసులంతా విలపిస్తారు. నైలు నదిలాగా అదంతా లేస్తుంది. ఈజిప్ట్‌లోని నదిలాగా అణగిపోతుంది.
[6] ఆయన తన కోసం ఆకాశాలలో మేడగదులు కట్టుకొనేవాడు. ఆకాశ మండలాన్ని భూమికి పైగా సుస్థిరం చేసేవాడు. సముద్రం నీళ్ళనూ భూతలం మీద కురిపించడానికి రప్పించేవాడు. ఆయన పేరు యెహోవా.
[7] “ఇస్రాయేల్ ప్రజలారా! నా దృష్టిలో మీరూ కూషుదేశస్ధులూ సమానులే గదా. ఇస్రాయేల్ ప్రజను ఈజిప్ట్ నుంచి తెచ్చిన నేను ఫిలిష్తీయప్రజను కఫ్తోరునుంచి, సిరియా ప్రజను కీరునుంచి తెచ్చాను గదా” అని యెహోవా అంటున్నాడు.
[8] “ప్రభువైన యెహోవా అనే నేను ఈ పాపిష్టి రాజ్యాన్ని కండ్లారా చూస్తున్నాను. అయినా యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను” అని యెహోవా అంటున్నాడు.
[9] “ఇప్పుడు నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. మనిషి ధాన్యం జల్లెడలో వేసి ఒక గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా ఇస్రాయేల్ ప్రజను అన్ని దేశాలవారి మధ్య జల్లిస్తాను.
[10] నా ప్రజలో ‘విపత్తు మనలను అందుకోదు, మనమీదికి రాదు’ అని చెప్పుకొనే పాపాత్ములందరూ ఖడ్గానికి గురి అయి చస్తారు.
[11] “శిథిలమైపోయిన దావీదు నివాసం ఆ కాలంలో నిలబెట్టి దాని గోడలను బాగు చేస్తాను. పాడైన భాగాలను బాగు చేస్తాను. అది మునుపు ఉన్నట్టు దాన్ని మళ్ళీ నిర్మిస్తాను.
[12] వారు ఎదోం జనంలో మిగిలినవారినీ నా పేరు ధరించిన ఇతర ప్రజలనందరినీ స్వాధీనం చేసుకొనేలా నేను ఈ విధంగా చేస్తాను” అంటున్నాడు యెహోవా. ఆయన అలాగే జరిగిస్తాడు.
[13] “ఒక కాలం రాబోతుంది. అప్పుడు మనుషులు పంట కోస్తూ ఉండగానే భూమి దున్నడానికి మనుషులు వస్తారు. విత్తనాలు చల్లుతూ ఉండగానే ద్రాక్ష పండ్లు త్రొక్కేవారు వస్తారు. పర్వతాలమీద నుంచి మధురమైన ద్రాక్షరసం పారుతుంది. అది కొండలన్నిటి మీద నుంచి ప్రవహిస్తుంది.
[14] నేను బందీలుగా దేశాంతరం పోయిన నా ఇస్రాయేల్ ప్రజను తిరిగి తీసుకువస్తాను. వారు శిథిలమైన పట్టణాలను మళ్ళీ కట్టుకొని వాటిలో నివాసం ఉంటారు. ద్రాక్షతోటలు నాటి ద్రాక్షరసం త్రాగుతారు, తోటలు వేసి పండ్లు తింటారు.
[15] నేను ఇస్రాయేల్ ప్రజను వారి స్వదేశంలో నాటుతాను. నేను వారికిచ్చిన దేశంలోనుంచి వారిని పెళ్ళగించడం ఇంకెన్నడూ జరుగదు. ఇది మీ దేవుడు యెహోవా వాక్కు.”