[1] ఆమోసు తెకోవలో ఉన్న కాపరులలో ఒకడు. ఇవి అతని మాటలు. భూకంపం కలగడానికి రెండు సంవత్సరాలు ముందు ఇస్రాయేల్ ప్రజలను గురించి అతనికి వెల్లడి అయిన విషయాలు ఇవి. ఆ రోజుల్లో యూదామీద ఉజ్జియా రాజుగా ఉన్నాడు. ఇస్రాయేల్ మీద యెహోయాషు కొడుకు యరొబాం రాజుగా ఉన్నాడు.
[2] ఆమోసు ఇలా అన్నాడు: యెహోవా సీయోనునుంచి గర్జిస్తూ ఉన్నాడు. జెరుసలంనుంచి ఆయన కంఠం వినబడుతూ ఉంది. కాపరుల పచ్చిక మైదానాలు వాడిపోతూ ఉన్నాయి. కర్మెల్ పర్వత శిఖరం ఎండిపోతూ ఉంది.
[3] యెహోవా చెప్పేదేమంటే, “దమస్కు నగరవాసులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే, వారు గిలాదును ఇనుప పళ్ళుగల యంత్రంలో నూర్చారు.
[4] నేను హజాయేల్ ఇంటిమీద మంటలు పంపిస్తాను. అవి బెన్‌హదదు భవనాలను దహించివేస్తాయి.
[5] దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొట్టిస్తాను. ఆవెను లోయలో ఉన్న నివాసులను నాశనం చేస్తాను. బేత్ ఏదెనులో రాజదండం వహించినవాణ్ణి నాశనం చేస్తాను. సిరియా దేశస్థులు బందీలుగా కీర్ ప్రాంతానికి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇది యెహోవా వాక్కు.”
[6] యెహోవా చెప్పేదేమంటే, “గాజా పట్టణస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు చాలామందిని బందీలుగా తీసుకుపోయి ఎదోంవారి వశం చేశారు.
[7] నేను గాజా ప్రాకారాలమీద మంటలు పంపిస్తాను. అవి వారి భవనాలను దహించి వేస్తాయి.
[8] అష్డోదు నగరవాసులను నాశనం చేస్తాను. అష్‌కెలోనులో రాజదండం వహించినవాణ్ణి నాశనం చేస్తాను. ఫిలిష్తీయ ప్రజలో తక్కినవారు నశించే వరకు ఎక్రోనును నేను దెబ్బతీస్తాను. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.”
[9] యెహోవా చెప్పేదేమంటే, “తూరు నగరవాసులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించి తీరుతాను. వారు బంధువులతో చేసుకొన్న ఒడంబడికను తలచుకోకుండా చాలా మందిని బందీలుగా తీసుకుపోయి ఎదోం వారి స్వాధీనం చేశారు.
[10] నేను తూరు ప్రాకారాలపై మంటలు పంపిస్తాను. అవి దాని భవనాలను దహించివేస్తాయి.”
[11] యెహోవా చెప్పేదేమంటే, “ఎదోం దేశస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు జాలి అణచివేసుకొంటూ ఖడ్గం చేతపట్టుకొని తమ బంధువులను తరుముతూ వచ్చారు. వారు తమ ఆగ్రహాన్ని ఎన్నడూ వదలివేయక, ఎడతెరపి లేకుండా కోపిస్తూ వారిని చీల్చారు.
[12] నేను తేమాను మీద మంటలు పంపిస్తాను. అవి బొస్రాలో ఉన్న భవనాలను దహించివేస్తాయి.”
[13] యెహోవా చెప్పేదేమంటే, “అమ్మోను దేశస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే, సరిహద్దులను విశాలం చేయాలని గిలాదులో ఉన్న గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చారు.
[14] నేను రబ్బా ప్రాకారాలను తగలబెట్టిస్తాను. అది దాని భవనాలను దహించివేస్తుంది. యుద్ధకాలంలో రణధ్వనులు వినబడుతూ ఉన్నప్పుడు, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు అలా జరుగుతుంది.
[15] వారి రాజు అతని పరివారంతోపాటు బందీగా దేశాంతరం పోతాడు. ఇది యెహోవా వాక్కు.”