[1] ప్రభువైన యెహోవా నాకు కనుపరచినది ఇది: రాజుకు రావలసిన కోత తరువాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు యెహోవా మిడతల గుంపును పుట్టించాడు.
[2] మొలిచినదంతా ఆ మిడతలు తినివేశాయి. అది చూచి నేను “యెహోవా! ప్రభూ! యాకోబు వంశం ఎలా నిలిచి ఉంటుంది? వాళ్ళు అల్పజనంగా ఉన్నారు గదా. నీవు దయ ఉంచి వారిని క్షమించు” అని మనవి చేశాను.
[3] యెహోవాకు మనసు కరిగింది. “అలా జరగదు” అన్నాడు.
[4] ప్రభువైన యెహోవా దర్శనరీతిగా నాకు కనుపరచినది ఇది: ప్రభువైన యెహోవా వారిని దండించడానికి మంటలను రప్పించాడు. అవి వచ్చి మహా జలాగాధాన్ని ఇంకించి వారసత్వ భూమిని మ్రింగి వేయసాగింది.
[5] అప్పుడు నేను “యెహోవా! ప్రభూ! దయ ఉంచి అలా చేయవద్దు! చేస్తే యాకోబు వంశం ఎలా నిలిచి ఉంటుంది? వారు అల్ప జనం కదా” అని మనవి చేశాను.
[6] యెహోవాకు మనసు కరిగింది. “అదికూడా జరగదు” అన్నాడు.
[7] ప్రభువు నాకు కనుపరచింది ఇది: ఆయన సీసం గుండు చేత పట్టుకొని చక్కగా కట్టి ఉన్న గోడమీద నిలబడి ఉన్నాడు.
[8] యెహోవా “ఆమోసూ! నీకేమి కనిపిస్తున్నది?” అని నన్ను అడిగాడు. “సీసం గుండు కనిపిస్తున్నద”ని నేను జవాబిచ్చాను. అందుకు ప్రభువు అన్నాడు, “నా ఇస్రాయేల్ ప్రజల మధ్య సీసం గుండు వేయబోతున్నాను. ఇకమీదట వారిని శిక్షించకుండా ఉండను.
[9] ఇస్సాకు వంశస్థులు కట్టుకొన్న ఎత్తయిన పూజా స్థలాలు పాడవుతాయి. ఇస్రాయేల్ ప్రజల గుళ్ళు నాశనం అవుతాయి. నేను ఖడ్గం చేతపట్టుకొని యరొబాం రాజవంశం వారి మీద పడుతాను.”
[10] తరువాత బేతేల్‌లో ఉన్న అమజ్యా అనే యాజి ఇస్రాయేల్ రాజైన యరొబాంకు ఇలా కబురంపాడు: “ఇస్రాయేల్ ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు.
[11] యరొబాం ఖడ్గంచేత చస్తాడనీ ఇస్రాయేల్ ప్రజ ఈ దేశంనుంచి బందీలుగా పోతారనీ అతడు చాటిస్తున్నాడు. అతడి మాటలు దేశం ఓర్చుకోవడం అసాధ్యం.”
[12] అప్పుడు అమజ్యా ఆమోసుతో ఇలా అన్నాడు: “దీర్ఘదర్శీ! వెళ్ళిపో! యూదా దేశానికి పారిపో! అక్కడే బత్తెం సంపాదించుకో. అక్కడే నీ వార్తలు చాటించు.
[13] బేతేల్‌లో మాత్రం నీ వార్తలు చాటించకు. రాజు గుడి ఇక్కడ ఉంది. రాజభవనం ఉంది.”
[14] ఆమోసు అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “మునుపు నేను ప్రవక్తను కాను, ప్రవక్త కొడుకునూ కాను. నేను గొర్రెలు కాస్తూ మేడి పండ్లు ఏరుకొంటూ ఉండే వాణ్ణి.
[15] నేను మందలను కాస్తూ ఉంటే యెహోవా నన్ను పిలిచి ‘నీవు వెళ్ళి నా ఇస్రాయేల్ ప్రజలకు నా మూలంగా పలుకు’ అన్నాడు.
[16] అందుచేత యెహోవా చెప్పేది నీవు విను. నీవంటావు గదా, ‘ఇస్రాయేల్ ప్రజల విషయం నీ వార్తలు చాటించకు, ఇస్సాకు వంశం వారి విషయం మాట జారకూడద’ని.
[17] కనుక యెహోవా చెప్పేదేమిటంటే, నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది. నీ కొడుకులూ కూతుళ్ళూ కత్తిపాలవుతారు. ఇతరులు నీ భూమి కొలత తీసుకొని పంచుకొంటారు. నీవు అశుద్ధప్రదేశంలో చస్తావు. తప్పని సరిగా ఇస్రాయేల్ ప్రజలు తమ దేశం నుంచి బందీలుగా పోతారు.”