Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:11

[1] పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండుమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండుమని బోధించు.

[2] ఇతర్లను దూషించకుండా శాంతిని, మంచితనాన్ని అలవర్చుకోమని, అందరిపట్ల దయ చూపుమని బోధించు.

[3] గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ మానసిక వాంఛలకు, సుఖాలకులోనై అసూయతో యితర్ల చెడును కోరుతూ, ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము.

[4] అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి.

[5] మనం నీతికార్యాలు చేసినందుకు ఆయన మనలను రక్షించలేదు కాని తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరచి, మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కల్గించాడు. క్రొత్త జీవితాన్నిచ్చి, మనల్ని రక్షించాడు.

[6] పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు.

[7] ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులంగా వారసులం కావాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా మనమాశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము.

[8] ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి. అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండి, మంచి చేయటంలో నిమగ్నులౌతారు. ఇది మంచిది. దాని వలన ప్రజలకు లాభం కలుగుతుంది.

[9] కాని మూర్ఖంగా వాదించే వాళ్ళకు, వంశ చరిత్రల్ని చర్చించే వాళ్ళకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించే వాళ్ళకు, పోట్లాడే వాళ్ళకు దూరంగా ఉండు. అలాంటి చర్చలవల్ల ఉపయోగమేమీ ఉండదు. వాటివల్ల లాభం కలుగదు.

[10] చీలికలు కలిగించే వాణ్ణి ఒకటి రెండు సార్లు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం తెంపుకో.

[11] అలాంటివాడు దుర్మార్గుడని, పాపి అని నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించుకొన్నాడు.

[12] అర్తెమానును, తుకికును, నీ దగ్గరకు పంపిన తక్షణం నీవు నికొపొలికి వచ్చి నన్ను కలుసుకో. ఈ చలికాలం నేనక్కడ గడపదలిచాను.

[13] న్యాయవాది జేనా, అపొల్లోల ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళకు సహాయం చెయ్యి.

[14] మన వాళ్ళు సత్కార్యాలు చేయటానికి నేర్చుకొని వాటిలో నిమగ్నులై ఉండాలి. తమ నిత్యావసరాలకు కావలిసినవి సంపాదించుకోవాలి. వ్యర్థంగా జీవించకూడదు.

[15] నాతో ఉన్న వాళ్ళు నీకు వందనాలు తెలుపుతున్నారు. విశ్వాసం మూలంగా మన స్నేహితులైన వాళ్ళకు నా శుభాకాంక్షలను తెలుపుము. మీ అందరిపై దేవుని కృప ఉండునుగాక!

తీతుకు వ్రాసిన లేఖ — Chapters