[1] యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ తపనివాడైన ఫిలేమోనుకు,
[2] మరియు మన సోదరి అప్పియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు:
[3] మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక!
[4] కాబట్టి నేను ప్రార్థలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను.
[5] యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను.
[6] క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
[7] సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.
[8] క్రీస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞాపించగల అధికారం నాకున్నా,
[9] నేను ప్రేమతో నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలను నేను, వయస్సు మళ్ళిన వాణ్ణిగా, యేసు క్రీస్తు ఖైదీని.
[10] నా కుమారునితో సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడుకొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా కుమారుడయ్యాడు.
[11] గతంలో అతనివలన నీకు ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతనివలన నీకూ, నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది.
[12] నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను.
[13] నేను సువార్త కారణంగా ఖైదీగా ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను.
[14] కాని నీ అనుమతి లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్టం ప్రకారం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
[15] ఒనేసిము నీ నుండి కొంతకాలం దూరం అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరిగిందేమో.
[16] అతడు యిప్పుడు దాసుడు మాత్రమే కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియ సోదరుడు. అతడు నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువువల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు యింకా దగ్గరివానిగా భావిస్తావు.
[17] నీవు నన్ను నీ భాగస్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పినట్లే, అతనికి కూడా స్వాగతం చెప్పు.
[18] అతడు నీ పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు ఏదైనా అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి.
[19] నేను ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేను నా స్వహస్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు.
[20] కనుక నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం చేయుము. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక నాకీ తృప్తి కలిగించు.
[21] నీ విధేయతపై నాకు నమ్మకం ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను.
[22] మరొక విషయం. అతిథుల కోసం ఉంచిన గదిని నా కోసం సిద్ధంగా ఉంచు. నీ ప్రార్థలను విని దేవుడు నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను.
[23] యేసు క్రీస్తు నిమిత్తం నాతో సహా కారాగారంలో ఉన్న ఎపఫ్రా నీకు వందనాలు తెలుపమన్నాడు.
[24] నాతో పని చేస్తున్న మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా నీకు వందనాలు తెలుపుతున్నారు.
[25] యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!