Skip to content
Opens in a new window

[1] “ఏడో నెల మొదటి రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. అది బూర ఊదే రోజు.

[2] దహనబలులను మీరు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.

[3] కోడె దూడతో బాటు తూములో మూడు పదోవంతుల మంచి పిండి నూనెతో కలిపినది, పొట్టేలుకు రెండు పదోవంతులును,

[4] ఏడు గర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి.

[5] మరియు పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను అర్పించండి.

[6] నెలపొడుపు బలులు, దాని ధాన్యార్పణం గాక బలులు అర్పించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యార్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల ప్రకారం జరగాలి. అని అగ్నిలో దహించబడాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.

[7] “ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. ఏ పనీ మీరు చేయకూడదు.

[8] దహనబలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము కాని ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రె పిల్లలను మీరు అర్పించాలి.

[9] ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండితూములో మూడు పదోవంతులు ఒక కోడె దూడతోను, రెండు పదోవంతులు పొట్టేలుతోను,

[10] ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కోదానిలో పదోవంతును మీరు అర్పించాలి.

[11] ఒక పోతు మేకను కూడ పాపపరిహారార్థ బలిగా మీరు అర్పించాలి. ప్రాయశ్చిత్త దినపు పాపపరిహారార్థ బలి అర్పణకు ఇది అదనం. ప్రతిదినం బలి, దాని ధాన్యార్పణం, పానార్పణలకు ఇది అదనం.

[12] “ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజులుగా మీరు జరుపుకోవాలి.

[13] దహన బలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు 14 మీరు అర్పించాలి.

[14] పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు పదోవంతులు, రెండు పొట్టేళ్లలో ఒక్కోదానితో రెండు పదోవంతులు,

[15] పదునాలుగు గొర్రెపిల్లల్లో ఒక్కోదానితో ఒక్కో పదోవంతు మీరు అర్పించాలి.

[16] ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.

[17] “ఈ పండుగ రెండోనాడు 12 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.

[18] కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ కూడ మీరు అర్పించాలి.

[19] పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను కూడా మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.

[20] “ఈ పండుగ మూడోనాడు 11 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.

[21] కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రె పిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.

[22] పాపపరిహారార్థ బలిగా ఒక మగమేకను మీరు అర్పించాలి. రోజువారి బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.

[23] “ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.

[24] కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.

[25] పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.

[26] “ఈ పండుగ ఐదో రోజున 9 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.

[27] కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ మీరు అర్పించాలి.

[28] పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ సానార్పణకు ఇది అదనం.

[29] “ఈ పండుగ ఆరోనాడు 8 కోడె దూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.

[30] కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.

[31] పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.

[32] “ఈ పండుగ ఏడోనాడు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.

[33] కోడె దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.

[34] పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినం బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.

[35] “ఈ పండుగ ఎనిమిదో రోజు మీకు చాల ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.

[36] మీరు ఒక దహనబలి అర్పించాలి. అది హోమార్పణ. యెహోవాకు ఇష్టమైన సువాసన. ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, పుష్టిగల ఏడాది గొర్రెపిల్లలు ఏడింటిని మీరు అర్పించాలి.

[37] కోడెదూడకు, పొట్టేలుకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.

[38] పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినము ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.

[39] “ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.”

[40] యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు.

సంఖ్యాకాండము — Chapters