Skip to content
Opens in a new window

[1] ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలీయాజరుతో యెహోవా మాట్లాడాడు:

[2] “ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించండి. ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులందరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సైన్యంలో పని చేయటానికి సమర్థులు” అని ఆయన చెప్పాడు.

[3] ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యోర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలీయాజరు ప్రజలతో మాట్లాడారు. వారు

[4] “20 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన్న మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.” ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది:

[5] రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను. వంశాలు: హనోకు—హనోకీల వంశం పల్లు పల్లువారి వంశం

[6] హెస్రోను హెస్రోనీల వంశం కర్మి కర్మీల వంశం

[7] రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43, 730 మంది పురుషులు.

[8] పల్లు కుమారుడు ఏలీయాబు.

[9] నెమూయేలు, దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమారులు. మోషే, అహరోనులకు ఎదురు తిరిగిన నాయకులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు కోరహును వెంబడించారు.

[10] అప్పుడే భూమి తెరచుకొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివేసింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక, గుర్తు.

[11] అయితే కోరహు కుటుంబంలోని ఇతరులు మరణించలేదు.

[12] షిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి: నెమూయేలు—నెమూయేలీ వంశం యామీను—యామీనీల వంశం యాకీను—యాకీనీల వంశం

[13] జెరహు—జెరహీల వంశం షావూలు—వూలీ వంశం

[14] షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది.

[15] గాదు సంతతిలోని వంశాలు ఇవి: సెపోను—సెపోనీల వంశం హగ్గి—హగ్గీల వంశం షూనీ—షూనీల వంశం

[16] ఓజని—ఓజనీల వంశం ఏరీ—ఏరీల వంశం

[17] అరోది—అరోదీల వంశం అరేలి—అరేలీల వంశం

[18] అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 40,500 మంది పురుషులు.

[19] యూదా సంతతిలోని వంశాలు ఇవి: షేలా—షేలావారి వంశం పెరెసు—పెరెసీల వంశం జెరహు—జెరహీల వంశం (యూదా కుమారులు ఏరు, ఓనాను అనే ఇద్దరు కనానులో చనిపోయారు.)

[21] పెరెసు వంశాలు ఇవి: హెస్రోను—హెస్రోనీల వంశం హములు—హములీల వంశం

[22] యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500.

[23] ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి: తోల — తోలాలీ వారి వంశం పువ్వా — పువ్వీల వంశం

[24] యాషుబు — యాషుబీల వంశం షిమ్రోను — షిమ్రోనీల వంశం

[25] ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 64,300.

[26] జెబూలూను సంతతిలోని వంశాలు: సెరెదు — సెరెదీల వంశం ఏలోను — ఏలోనీల వంశం యహలేలు — యహలేల వంశం

[27] జెబూలూను సంతతిలోని వంశాలు అవి. పురుషులు సంఖ్య మొత్తం 60,500.

[28] యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు.

[29] మనష్షే సంతతి ఏవనగా: మాకీరు — మాకీరువారి వంశం (మాకీరు గిలాదుకు తండ్రి,) గిలాదు — గిలాదీల వంశం

[30] గిలాదు వంశాలు: ఈజురు — ఈజరీల వంశం హెలెకు — హెలెకీవారి వంశం

[31] అశ్రీయేలు — అశ్రీయేలీల వంశం షెకెము — షెకెమీల వంశం

[32] షెమిద — షెమిదీల వంశం హెపెరు — హెపెరీల వంశం

[33] హెపెరు కుమారుడు సెలోపెహదు. కానీ అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హోగ్ల, మిల్కా తిర్సా.

[34] అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700.

[35] ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా: షుతల — షుతలీల వంశం బేకరు — బేకరీల వంశం తహను — తహనీల వంశం

[36] షుతలహు వంశం వాడు ఏరాను. అతని వంశ ఏరానీల వంశం

[37] ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 32,500. యోసేపు సంతతికి చెందిన మొత్తం మనుష్యులు వారే.

[38] బెన్యామీను సంతతిలోని వంశాలు: బెలా — బెలాలీ వంశం అష్బెలు — అష్బెలీ వంశం అహీరం — అహీరమీయీల వంశం

[39] షుపం — షుపామీల వంశం హుపం — హుపామీల వంశం

[40] బెలా వంశాలు ఏవనగా: ఆర్దు — ఆర్దీల వంశం నయమాను — నయమానీల వంశం

[41] బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,600.

[42] దాను సంతతిలోని వంశాలు: షూషాము- షూషామల వంశం. అది దాను సంతతిలోని కుటుంబం.

[43] షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400.

[44] ఆషేరు సంతతిలోని వంశాలు: ఇమ్నా — ఇమ్నా వారి వంశం ఇష్వి — ఇష్వీల వంశం బెరీయ — బెరీయాల వంశం

[45] బెరీయా వంశాలు: హెబెరు — హెబెరీల వంశం మల్కీయేలు — మల్కీయేలీల వంశం.

[46] (ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.)

[47] ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400.

[48] నఫ్తాలీ సంతతిలోని వంశాలు: యహసియేలు — యహసియేలీల వంశం గూని — గూనీల వంశం

[49] యెసెరు — యెసెరీల వంశం షిల్లేము — షిల్లేమీల వంశం

[50] నఫ్తాలీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,400.

[51] కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730.

[52] యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:

[53] “ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది.

[54] పెద్ద వంశానికి ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత ఉంటుంది.

[55] ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది.

[56] ప్రజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ అందివ్వబడుతుంది.”

[57] లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతిలోని వంశాలు ఇవి: గెర్షోను — గెర్షోనీల వంశం కహాతు — కహాతీల వంశం మెరారి — మెరారిల వంశం

[58] ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలే: లిబ్నీల వంశం హెబ్రోనీల వంశం మహ్లీ వంశం మూషీల వంశం కోరహీల వంశం అమ్రాము కహాతు వంశం వాడు.

[59] అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. ఆమె ఈజిప్టులో పుట్టింది. అమ్రాము, యొకెబెదులకు అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము అని ఒక కుమార్తె కూడ ఉంది.

[60] నాదాబు, అబీహు, ఎలీయాజరు, ఈతామారులకు తండ్రి అహరోను.

[61] కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు.

[62] లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 23,000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహూవా వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు.

[63] మోషే, యాజకుడైన ఎలీయాజరు ఈ ప్రజలందరినీ లెక్క చేసారు. మోయాబు మైదానాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో ఎదుట యోర్దాను నది అవతల జరిగింది.

[64] చాలకాలం క్రిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్కపెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. మోషే మోయాబు మైదానాల్లో లెక్కపెట్టిన వారు వేరు, అంతకుముందు లెక్కపెట్టిన వారు వేరు.

[65] వారు అందరూ ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా ఉన్నవాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే.

సంఖ్యాకాండము — Chapters