Skip to content
Opens in a new window

[1] యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞపకము చేసికొనుము. మాకు జరిగిన అవమానాన్ని తిలకించుము.

[2] మా రాజ్యం పరాయివాళ్ల వశమయ్యింది. మా ఇండ్లు అన్యదేశీయులకు ఇవ్వబడ్డాయి.

[3] మేము అనాధలమయ్యాము. మాకు తండ్రిలేడు. మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు.

[4] మా తాగే నీరు మేము కొనవలసి వచ్చింది. మేము వాడే కట్టెలకు మేము డబ్బు చెల్లించవలసి వచ్చింది.

[5] మా మెడమీద బలవంతంగా కాడి మోయవలసి వచ్చింది. మేము అలసిపోయాము. మాకు విశ్రాంతి లేదు.

[6] మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము. తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్షూరుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము.

[7] నీపట్ల మా పూర్వీకులు అపచారం చేశారు. వారిప్పుడు చచ్చిపోయారు. వారి పాపాలకు ఇప్పుడు మేము కష్టాలనుభవిస్తున్నాము.

[8] బానిసలు మాకు పాలకులయ్యారు. వారినుండి మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు.

[9] మేము ఆహారం సంపాదించటానికి మా ప్రాణాలు తెగించవలసి వచ్చింది. ఎడారిలో కత్తులు ధరించివున్న మనుష్యుల మూలంగా మేము మా ప్రాణాలను తెగించవలసి వచ్చింది.

[10] నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది. నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది.

[11] సీయోను స్త్రీలపై శత్రువులు అత్యాచారాలు జరిపారు. వారు యూదా నగరాలలో స్త్రీలను చెరిపారు.

[12] మా రాజకుమారులను శత్రువు ఉరితీశాడు. వారు మా పెద్దలను గౌరవించలేదు.

[13] శత్రువు మా యువకులచే తిరుగలి తిప్పించి పిండిపట్టించాడు. మా యువకులు కట్టెల మోపులు మోయలేక తొట్రిల్లారు.

[14] నగర ద్వారాల వద్ద పెద్దలు ఏమాత్రం కూర్చోడంలేదు. యువకులు సంగీతం పాడటం మానివేశారు.

[15] మా హృదయాల్లో సంతోషం ఏ మాత్రం లేదు. మా నాట్యం చనిపోయిన వారి కొరకు విలాపంగా మారింది.

[16] మా తలనుండి కిరీటం కింద పడిపోయింది. మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి.

[17] ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి. ఫలితంగా మా కండ్లు మసకబారాయి.

[18] సీయోను పర్వతం బీడు భూమి అయ్యింది. సీయోను పర్వతం మీద నక్కలు సంచరిస్తున్నాయి.

[19] కాని యెహోవా, నీవు శాశ్వతంగా పరిపాలిస్తావు. నీ రాచరిక సింహాసనం కలకాలం అలా నిలిచివుంటుంది.

[20] యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి పోయినట్లున్నావు. నీవు మమ్మల్ని ఇంత దీర్ఘకాలం వదిలి వెళ్లావు.

[21] యెహోవా, మమ్మల్ని నీవద్దకు చేర్చుకో. మేము సంతోషంగా నీదరి చేరుతాము. మా రోజులను మునుపటిలా మార్చివేయుము.

[22] నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు. నీవు మాపట్ల మిక్కిలి కోపం వహించావు.

విలాప వాక్యములు — Chapters