[1] నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని. యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను.
[2] యెహోవా నన్ను చీకటిలోకి నడపించాడేగాని వెలుగులోకి గాదు.
[3] యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు. రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.
[4] ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు. ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు.
[5] యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు. ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు.
[6] ఆయన నన్ను చీకటిలో కూర్చనేలా చేశాడు. ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు.
[7] యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు. ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు.
[8] సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థంచినా, యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు.
[9] ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు. ఆయన నా మార్గాన్ని వక్రంగా, గ తుకులమయం చేశాడు.
[10] నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా ఉన్నాడు. ఆయన పొంచి వున్న ఒక సింహంలా ఉన్నాడు.
[11] యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు. ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు.
[12] ఆయన విల్లంబులు చేపట్టాడు. ఆయన బాణాలకు నన్ను గురి చేశాడు.
[13] ఆయన నా పొట్టలో బాణం వేశాడు. ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు.
[14] నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను. రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు.
[15] యెహోవా నాచేత చేదు పానీయం (శిక్ష) తాగించాడు. ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు.
[16] నా పండ్లు రాత్రి నేలలో గుచ్చుకుపోయేలా యెహోవా నన్ను తోశాడు. ఆయన నన్ను మట్టిలోకి తోసివేశాడు.
[17] ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను. మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను.
[18] “యెహోవా తిరగి నాకు సహాయం చేస్తాడనే ఆశ లేదనుకొన్నాను.”
[19] ఓ యెహోవా, నా దుఃఖాన్ని, నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము. నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
[20] నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను.
[21] కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను.
[22] యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
[23] అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
[24] “యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను ఆనుకున్నాను.
[25] ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
[26] యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచియుండటం క్షేమకరం
[27] యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది.
[28] యెహోవా తన కాడిని వానిమీద వేయునప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాలి.
[29] ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి. దానివల్ల తన ఆశ నెరవేరునేమో.
[30] తనను కొట్టేవానివైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి. ఆ వ్యక్తి అవమానాలను భరించటానికి సంసిద్ధుడు కావాలి.
[31] యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి.
[32] యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది. ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు.
[33] యెహోవా తన ప్రజలను శి క్షింపకోరడు. తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు.
[34] యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు: ఎవ్వరో ఒక్కరికోసం భూమిపైగల ఖైదీలందరినీ ఆయన పాదాలకింద తొక్కటానికి ఇష్టపడడు.
[35] ఒకని మేలుకోసం మరియొకనికి అన్యాయం చేయటం ఆయనకు ఇష్టముండదు. కాని కొంత మంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు.
[36] ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు.
[37] యెహోవా ఆజ్ఞలేకుండా ఎవ్వరూ దేనినీ చెప్పలేరు; చెప్పి జరిపించలేరు.
[38] మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు, శాపాలు రెండూ వెలువడతాయి.
[39] ఒక వ్యక్తియొక్క పాపాలననుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు. కనుక, బతికున్న వాడెవడూ ఆయనపై ఫిర్యాదు చేయలేడు?
[40] మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.
[41] పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను, చేతులను చాపుదాము.
[42] ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము. అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు.
[43] నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు.
[44] నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు. ఏ ఒక్క ప్రార్థనా నీలో ప్రవేశించకుండ నీవలా చేశావు.
[45] అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా, కల్మశంలా చేశావు.
[46] మా శత్రువులందరూ మాతో కోపంగా మాట్లాడుతున్నారు.
[47] మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధపెట్టబడి, చితుక గొట్టబడ్డాము!”
[48] నా కన్నీళ్లు ప్రవాహంలా కారుచున్నాయి! నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
[49] ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది! నా దుఃఖం ఆగదు.
[50] ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి, మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు. పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు నేను దుఃఖిస్తూనే ఉంటాను.
[51] నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూసినప్పుడు నా కండ్లు నాకు వేదన కలిగించాయి.
[52] తగిన కారణం లేకుండానే నాకు శత్రువులైన వారంతా నన్నొక పక్షిలా తరిమారు.
[53] నేను బతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు. నాపై వాళ్లు రాళ్లు విసిరారు.
[54] నీళ్లు నా తలపైకి వచ్చాయి. “ఇది నా అంతం” అని నేననుకున్నాను.
[55] ఓ యెహోవా, నీ పేరు స్మరించాను. గోతిలో అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను.
[56] నీవు నా మొరాలకించావు. నీవు నీ చెవులు మూసి కొనలేదు. నన్ను కాచి రక్షించటానికి నీవు వెనుకాడలేదు.
[57] నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు “భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
[58] ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు. నాకు మళ్లీ జీవం పోశావు.
[59] ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు.
[60] నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు. వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు.
[61] ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు. వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు.
[62] నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.
[63] ఓ యెహోవా, వారు కూర్చున్నా, నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు!
[64] ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు! వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు!
[65] వారి గుండె బండ బారేలా చేయుము! పిమ్మట వారిని శపించుము!
[66] కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము. యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము!