[1] ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేసారు. ఆ సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందించేవారి పెద్ద.
[2] వంటల పెద్ద, ద్రాక్షా పాత్రల, పెద్ద మీద ఫరోకు కోపం వచ్చింది.
[3] కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు ఈ చెరసాల అధికారి.
[4] ఈ ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతకు అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల వరకు అలా జైల్లోనే ఉన్నారు.
[5] ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఆ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు—ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది.
[6] మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్టు యోసేపు గమనించాడు.
[7] “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్టు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు.
[8] “రాత్రి మాకు కలలు వచ్చాయి కాని మేము కన్న కల మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు.
[9] కనుక ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: “నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది.
[10] ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి.
[11] నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ఆ ద్రాక్షాలను తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.”
[12] అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు రోజులు.
[13] మూడు రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర పని చేసిన పని నీవు మళ్లీ చేస్తావు.
[14] నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం చేయి. నాకుగూడ ఈ చెరసాలలో నుంచి విముక్తి కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు.
[15] నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి నా ప్రజలైన హీబ్రూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో ఉండకూడదు.”
[16] మరో సేవకుని కల బాగున్నట్టు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, “నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొట్టెల బుట్టలు మూడు ఉన్నట్టు నాకు కనబడింది.
[17] పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. ఈ భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు ఈ భోజనాన్ని తినేస్తున్నాయి.”
[18] యోసేపు జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు.
[19] మూడు రోజులు గడవక ముందే రాజుగారు నిన్ను ఈ చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.”
[20] మూడు రోజుల తర్వాత రాజుగారి పుట్టిన రోజు వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేసాడు. ఆ విందులో ఫరో తన రొట్టెలు కాల్చేవాడిని, ద్రాక్షా పాత్రల సేవకుణ్ణి చెరసాలలోనుంచి బయటకు రప్పించాడు.
[21] ద్రాక్షాపాత్రల సేవకుడ్ని ఫరో విడుదల చేసాడు. అతని ఉద్యోగం మరల ఫరో అతనికి ఇచ్చాడు. ద్రాక్షా పాత్రల సేవకుడు ద్రాక్షారసపు పాత్ర ఒకటి ఫరో చేతికి అందించాడు.
[22] కానీ ఫరో రొట్టెలు కాల్చే వాడిని చంపేసాడు. ఎలా జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే జరిగింది.
[23] అయితే ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుకు సహాయం చెయ్యటం మరచిపోయాడు. యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపును గూర్చి మర్చిపోయాడు.