Skip to content
Opens in a new window

[1] “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు.

[2] కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి.

[3] మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.”

[4] కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేసారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేసారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు.

[5] యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి, యాకోబును వెంబడించలేదు.

[6] కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది.

[7] అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు.

[8] రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం కింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూతో అని వారు పేరు పెట్టారు.

[9] పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయ్యి, యాకోబును ఆశీర్వదించాడు.

[10] “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. ‘నీ కొత్త పేరు ఇశ్రాయేలు’ అని ఉంటుంది” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.

[11] అతనితో దేవుడన్నాడు: నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు.

[12] అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.

[13] అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు.

[14] ఈ స్థలంలో ఒక స్మారక శిల యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేసాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు గనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు.

[16] యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్లెహేం) చేరుతారనగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది.

[17] అయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడుతోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు పనిమనిషి ఇది చూసి, “రాహేలూ భయపడకు. నీవు మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది.

[18] కుమారుని కంటూనే రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.

[19] ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది (ఎఫ్రాతా అంటే బెత్లేహేం).

[20] రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది.

[21] అప్పుడు ఇశ్రాయేలు (యాకోబు) తన ప్రయాణం కొనసాగించాడు. ఏదెరు శిఖరానికి కొద్దిగా దక్షిణంగా అతడు శిబిరం వేసాడు.

[22] ఇశ్రాయేలు అక్కడ కొన్నాళ్లపాటు ఉండిపోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు దాసి బిల్హాతో రూబేను శయనించాడు. ఇశ్రాయేలు ఇది విని చాలా కోపగించుకొన్నాడు. యాకోబుకు (ఇశ్రాయేలు) 12 మంది కుమారులు.

[23] అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును.

[24] అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను.

[25] రాహేలు పనిమనిషి బిల్హా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాను, నఫ్తాలి.

[26] లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు.

[27] కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది.

[28] ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు.

[29] ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు.

ఆదికాండము — Chapters