Skip to content
Opens in a new window

[1] నేను షారోన్‌లో పూచే గులాబి పువ్వులాంటిదాన్ని, లోయల్లో వికసించిన కలువ పుష్పంలాంటిదాన్ని.

[2] ముండ్ల మధ్య కలువలాగా కన్యల మధ్య నా ప్రియసఖి కనిపిస్తూ ఉంది.

[3] యువకులలో నా ప్రియుడు అడవి చెట్ల మధ్య ఆపిల్‌వృక్షం లాంటివాడు. ఆయన ఛాయలో ఆనందమయినై నేను కూర్చుండిపోయాను. ఆయన ఫలాలు నా జిహ్వకు మధురం.

[4] ఆయన నన్ను విందుశాలలోకి తీసుకువెళ్ళాడు. నా మీద ప్రేమను పతాకంగా ఎత్తాడు.

[5] ప్రేమాతిరేకం చేత నాకు స్పృహ తప్పింది. ఎండిన ద్రాక్షపండ్లను తినిపించి నన్ను బలపరచండి. ఆపిలుపండ్లు పెట్టి నాకు సేద దీర్చండి.

[6] ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో ఆయన నన్ను ఆలింగనం చేసుకొన్నాడు.

[7] జెరుసలం కుమార్తెలారా, జింకలమీద, లేళ్ళమీద ఒట్టుపెట్టి చెప్పండి. ప్రేమ దానంతట అదే మేలుకొనేవరకు దాన్ని లేపమనీ పురికొలపమనీ మీరు ప్రమాణం చేయాలని నా మనవి.

[8] నా ప్రియుడి స్వరం వినబడుతూ ఉంది. అడుగో! ఆయన రానే వచ్చాడు. గంతులు వేస్తూ, మిట్టలు దూకి, కొండలమీద పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.

[9] నా ప్రియుడు జింకలాంటివాడు. లేడి పిల్లలాంటివాడు. అడుగో! మన ఇంటి గోడకు అవతల నిలబడి ఉన్నాడు. కిటికీలోనుంచి తొంగి చూస్తున్నాడు. అల్లిక తడికెగుండా చూస్తున్నాడు.

[10] నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు – ప్రాణసఖీ! సౌందర్యరాశీ! లే! ఇటు రా!

[11] చలికాలం గడిచిపోయింది. వర్షాలు పోయాయి. ఇప్పుడు రావు.

[12] భూమి అంతా పువ్వులు పరిచినట్టుంది. సంగీత నాదాలు వినిపించే సమయం వచ్చింది. మన దేశంలో పావురం కూత వినబడుతూ ఉంది.

[13] అంజూరుపండ్లు బాగా పక్వానికి వచ్చాయి. ద్రాక్ష చెట్లు పూత పట్టాయి. సౌరభాన్ని వెదజల్లుతున్నాయి. ప్రియసఖీ! సుందరీ! లే! ఇటు రా!

[14] నువ్వు కొండ రాళ్ళ నడుమ దాక్కునే పావురంలాగా ఉన్నావు. కొండ చరియలను ఆశ్రయించుకొని ఉన్న పావురానివి. నీ ముఖం చూడనియ్యి. నీ స్వరం నాకు వినిపించు. నీ ముఖం అందంగా ఉంది. నీ కంఠం మధురమైనది.

[15] మన ద్రాక్ష తోటలు పూతకు వచ్చాయి. మనకోసం గుంటనక్కలను పట్టుకో. చిన్న గుంటనక్కలు ద్రాక్షతోటలను పాడు చేస్తాయి. వాటిని పట్టుకో.

[16] నా ప్రియుడు నావాడు. నేను ఆయనదాన్ని. కలువలు విరబూసే చోట ఆయన తన గొర్రెలను మేపుతున్నాడు.

[17] చల్లటి గాలి తెమ్మరలు వస్తూ ఉండగానే, చీకటి నీడలు గతించేలోపుగానే, ప్రియతమా, నీవు జింకలాగా, లేడిపిల్లలాగా ఒడుదుడుకుగా ఉన్న కొండలమీద చెంగు చెంగున వచ్చేసెయ్యి.

పరమగీతం — Chapters