[1] సొలొమోను రచించిన పరమ గీతం.
[2] నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దాడుతాడు గాక! నీ ప్రేమానురాగాలు ద్రాక్షరసం కంటే మధురం!
[3] నీవు పూసుకొనేవి సువాసన గల పరిమళ తైలాలు. నీ పేరు ఒలకబోసిన పరిమళ తైలంతో సాటి. కన్యలకు నీవంటే ఎంతో మక్కువ.
[4] నన్ను తీసుకుపో. మనం పరుగెత్తుకుంటూ వెళ్దాం. రాజు తన లోపలి గదులలోకి నన్ను తీసుకువచ్చాడు. నిన్ను బట్టి మాకు సంతోషం, ఆహ్లాదం. ద్రాక్షరసం కంటే కూడా నీ ప్రేమానురాగాలను ఎక్కువగా కొనియాడుతాం. వారు నిన్ను ప్రేమించడం తగిన విషయమే.
[5] జెరుసలం కుమార్తెలారా! నేను నల్లటి పిల్లనే. అయినా నేను సౌందర్యవతిని. కేదార్‌వాళ్ళ డేరాల్లాగా, సొలొమోను భవనంలోని తెరల్లాగా నల్లటిదాన్నే.
[6] నల్లపిల్లనంటూ నన్ను తేరిచూడకండి. ఎండకు నా శరీరం కమిలిపోయింది. నా తల్లి కొడుకులు నామీద కోపగించారు. నన్ను ద్రాక్షతోటకు కావలిదాన్నిగా వినియోగించారు. అయితే నా సొంత తోటను కాపాడుకోలేకపోయాను.
[7] నా ప్రాణప్రియా! నీ గొర్రెల మందను మేపడానికి ఎక్కడికి వెళ్తావు? మధ్యాహ్నం మండుటెండలో వాటిని విశ్రాంతికి ఎక్కడికి తోలుకువెళ్తావు? నాతో చెప్పవూ? నీ స్నేహితుల దగ్గర ముసుకు వేసుకొన్నదానిలా నేను ఉండడం ఏం బావుంటుంది చెప్పు?
[8] అతి లోక సౌందర్యవతీ! నీకింకా తెలియదా? మందల అడుగుజాడలను బట్టి వెళ్ళు. కాపరుల డేరాల దగ్గర నీ మేక పిల్లలను మేపుకో,
[9] ప్రియసఖీ! ఈజిప్ట్‌చక్రవర్తి రథాలకు పూన్చిన ఆడు గుర్రంలాంటి దానివి నువ్వు.
[10] కర్ణ భూషణాల మధ్య నీ చెక్కిళ్ళు ఎంత చక్కనివి! హారాలు ధరించిన నీ మెడ ఎంత అందమైనది!
[11] నీకు బంగారు గొలుసులు చేయిస్తాం. వాటిలో వెండి పూలు పొదిగి ఉంటాయి.
[12] రాజు బల్లదగ్గర కూర్చుని ఉన్నాడు. నా పరిమళం అంతటా గుభాళించింది.
[13] నా వక్షస్థలంపై ఉన్న బోళంలాంటివాడు నా ప్రియుడు.
[14] ఏన్‌గెదీ ద్రాక్షవనిలో వికసించిన గోరింటచెట్టు పూలలాంటివాడు ఆయన.
[15] సౌందర్యవతివి నువ్వు! ప్రియసఖీ! నువ్వెంత సౌందర్యవతివి! నీ కండ్లు అచ్చం గువ్వ కండ్లే.
[16] ప్రియతమా! సౌందర్యమంటే నీదే! నీ ముఖాకృతి ఎంత మనోహరమైనది! పచ్చని చోట్లు మనకు పాన్పులు.
[17] మన గృహానికి దేవదారు దూలాలు. వాసాలు సరళ వృక్షం మ్రానులు.