[1] దేవుని పిలుపు అందినవారికి – తండ్రి అయిన దేవునివల్ల పవిత్రులై యేసు క్రీస్తులో కాపాడబడుతూ ఉన్నవారికి – యేసు క్రీస్తు దాసుడూ, యాకోబుకు సోదరుడూ అయిన యూదా రాస్తున్న విషయాలు.
[2] కరుణ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగుతాయి గాక.
[3] ప్రియ సోదరులారా, మనకందరికీ ఉన్న రక్షణ, పాపవిముక్తి గురించి మీకు రాయాలని ఎంతో శ్రద్ధాసక్తులు కలిగినా పవిత్రులకు ఒక్క సారే అప్పగించబడ్డ విశ్వాస సత్యాలకోసం మీరు మనసారా పోరాడాలని మిమ్ములను ప్రోత్సహిస్తూ రాయడం అవసరమని నాకు ప్రేరేపణ కలిగింది.
[4] ఎందుకంటే, కొందరు మీ మధ్యలోకి దొంగచాటుగా ప్రవేశించారు. వారు భక్తిలేని దుర్మార్గులు, మన దేవుని కృపను పోకిరీ పనులకు సాధనంగా, మార్చివేసేవారుమన ఏకైక ప్రభువైన దేవుణ్ణీ మన ప్రభువైన యేసు క్రీస్తునూ కాదనేవారు. ఈ శిక్షావిధికి గురి అవుతారని చాలా కాలంక్రిందటే వారిని గురించి రాసి ఉంది.
[5] ఈ విషయం ఇంతకుముందే మీకు తెలిసి ఉన్నా ఇది మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అంటే ప్రభువు ఈజిప్ట్‌లో నుంచి తన ప్రజను తప్పించిన తరువాత వారిలో తనను నమ్మనివారిని నాశనం చేశాడు.
[6] అంతేకాకుండా, తమ అధికార స్థానంలో ఉండిపోకుండా సొంత నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలను మహా దినాన జరగబోయే తీర్పు కోసం ప్రభువు శాశ్వతమైన సంకెళ్ళతో బంధించి కటిక చీకటిలో ఉంచాడు.
[7] వారిలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలూ లైంగిక అవినీతికి తమను అప్పగించుకొని అసహజంగా సశరీరులకు వెంటబడుతూ ఉండడంచేత శాశ్వతమైన అగ్ని అనే న్యాయమైన దండనపాలై ఉదాహరణగా ప్రదర్శించ బడుతున్నాయి.
[8] అలాగే కలలు కంటూ ఉన్న వీరు శరీరాన్ని అపవిత్రం చేసుకొంటున్నారు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహనీయులను దూషిస్తూ ఉన్నారు.
[9] ప్రముఖ దూత మిఖాయేల్ అయితే అపనింద పిశాచాన్ని ఎదురుకొంటూ వాడితో మోషే శరీరాన్ని గురించి వాదించినప్పుడు దూషించడానికి, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు గాని “ప్రభువే నిన్ను మందలిస్తాడు గాక!” అన్నాడు.
[10] వీరైతే తమకు అర్థం కానివాటిని దూషిస్తారు. తెలివిలేని మృగాల్లాగా ప్రకృతిసిద్ధంగా ఏవేవి తెలుసుకొంటారో వాటివల్లే తమను తాము భ్రష్టులను చేసుకొంటున్నారు.
[11] అయ్యో, వారికి బాధ తప్పదు! వారు కయీను నడిచిన దారి పట్టి నడిచారు, బిలాం నడచిన తప్పు త్రోవలో లాభంకోసం ఆతురంగా చొరబడ్డారు. కోరహు తిరుగుబాటు చేసిన నాశనం పాలయ్యారు.
[12] వీరు నిర్భయంగా మీతో భోజనం చేస్తూ తమను తామే పోషించుకొంటూ మీ ప్రేమ విందులలో మచ్చలుగా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోతున్న వాన లేని మబ్బులు. కోతకాలం పోయి పండ్లు లేక వ్రేళ్ళతో పెళ్ళగించబడి రెండు సార్లు చచ్చిన చెట్లు.
[13] వారు సముద్రం ప్రచండమైన అలల్లాగా ఉండి తమ అవమానాన్ని నురుగులాగా వెళ్ళగ్రక్కుతూ ఉన్నారు. వారు దారి తప్పి తిరుగుతున్న చుక్కలు. వారికోసం దట్టమైన కటిక చీకటి శాశ్వతంగా ఉంచబడి ఉంది.
[14] ఆదాం మొదలుకొని ఏడోవాడైన హనోకు వీరిని గురించి దేవునిమూలంగా ఇలా పలికాడు: “ఇదిగో వినండి! ప్రభువు తన వేలాది వేలమంది పవిత్రులతోకూడా వస్తాడు.
[15] అందరికీ తీర్పు తీర్చడానికి, వారిలో భక్తి లేని వారంతా భక్తిలేని మార్గంలో చేసిన భక్తిలేని క్రియలన్నిటిని గురించీ భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించీ వారిని ఒప్పించడానికీ ఆయన వస్తాడు”.
[16] వీరు తమ దురాశలను అనుసరించి ప్రవర్తిస్తూ, సణుక్కొంటూ, తమ గతిని నిందించుకొంటూ ఉన్నవారు. లాభంకోసం ఇతరులను పొగడుతారు. వారి నోరు డంబంగా మాట్లాడుతుంది.
[17] అయితే ప్రియ సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పంపిన రాయబారులు ముందు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి.
[18] చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని వారు మీతో చెప్పారు.
[19] ఇలాంటివారు దేవుని ఆత్మలేని సహజ సిద్ధమైనవారు, భేదాలు కలిగించేవారు.
[20] మీరైతే, ప్రియ సోదరులారా, అతి పవిత్రమైన మీ విశ్వాసంలో మీకు మీరే అభివృద్ధి కలిగించుకొంటూ ఉండండి. పవిత్రాత్మలో ప్రార్థన చేస్తూ ఉండండి.
[21] శాశ్వత జీవార్థమైన మన ప్రభువైన యేసు క్రీస్తు కరుణకోసం ఆశతో ఎదురు చూస్తూ దేవుని ప్రేమలో నిలిచి ఉండేలా కాచుకొని ఉండండి.
[22] సరిగా వివేచిస్తూ కొందరిమీద జాలి చూపండి.
[23] మరి కొందరిని భయం ద్వారా రక్షిస్తూ అగ్నిలోనుంచి లాగివేసి శరీర స్వభావంవల్ల అశుద్ధి అయిన వస్త్రాన్ని అసహ్యించుకోండి.
[24] మీరు తొట్రుపడకుండా మిమ్ములను కాపాడడానికీ తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులుగా నిలబెట్టడానికీ సామర్థ్యం గల మన ముక్తిప్రదాత, ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి
[25] మహిమ, ఘనపూర్ణత, ప్రభుత్వం, అధికారం ఇప్పుడునూ శాశ్వతంగానూ ఉంటాయి గాక! తథాస్తు.