[1] ప్రియ సోదరుడైన గాయస్‌కు పెద్దనైన నేను రాస్తున్న విషయాలు. నీవంటే నాకు నిజమైన ప్రేమ ఉంది.
[2] ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టే ఆరోగ్యంగా ఉండి అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను.
[3] నీలో ఉన్న సత్యాన్ని గురించి, నీవు సత్యంలో నడుచుకొంటున్నావని కొందరు సోదరులు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది.
[4] నా పిల్లలు సత్యంలో నడుచుకొంటున్నారని వినడంకంటే నాకు మించిన ఆనందమేదీ లేదు.
[5] ప్రియ సోదరా, సోదరులకోసం, పరాయివారికోసం కూడా నీవు ఏమి చేస్తున్నావో అదంతా నమ్మకంగా చేస్తూ ఉన్నావు.
[6] వారు నీ ప్రేమను గురించి క్రీస్తు సంఘానికి సాక్ష్యం చెప్పారు.
[7] ఇతర ప్రజల దగ్గర ఏమీ పుచ్చుకోకుండా యేసు పేరు కోసం బయలు దేరారు వారు. కనుక దేవునికి తగినట్టు నీవు వారిని వారి ప్రయాణంలో సాగనంపితే బాగుంటుంది.
[8] మనం సత్యం విషయంలో భాగస్థులమయ్యేలా అలాంటివారికి స్వీకరించాలి.
[9] అక్కడి సంఘానికి నేను రాశాను గానీ వారిలో ప్రముఖుడుగా ఉండడం అనేది ఎంతో ఇష్టమున్న దియొత్రెఫెస్ మా మాట అంగీకరించడం లేదు.
[10] అందుచేత నేను అక్కడికి వస్తే అతడు చేసిన పనులు జ్ఞాపకం చేస్తాను. అతడు మా విషయం చెడ్డ మాటలతో వదరుతున్నాడు. అది చాలదన్నట్టు అతడు సోదరులను స్వీకరించడం లేదు, వారిని స్వీకరించాలనుకొనేవారిని కూడా అడ్డగించి సంఘంలోనుంచి వెలివేస్తున్నాడు.
[11] ప్రియ సోదరులారా, మంచిని చూచి ఆ ప్రకారం ప్రవర్తించండి, చెడుతనాన్ని కాదు. మంచి చేసేవాడు దేవునికి చెందేవాడు. చెడుతనం చేసేవాడు దేవుణ్ణి చూడనివాడే.
[12] దేమేత్రియస్ గురించి అందరివల్లా – సత్యంవల్ల కూడా – మంచి సాక్ష్యం ఉంది. మేము కూడా అతని గురించి సాక్ష్యం చెపుతున్నాం. మా సాక్ష్యం సత్యమని మీకు తెలుసు.
[13] అనేక విషయాలు నీకు రాయవలసి ఉన్నా, సిరా, కలాలతో ఇవి రాయడం నాకిష్టం లేదు.
[14] త్వరలో నిన్ను చూడాలని నాకు ఆశాభావం ఉంది. అప్పుడు మనం ముఖాముఖిగా మాట్లాడుకొంటాం.
[15] నీకు శాంతి ఉంటుంది గాక! మన స్నేహితులు నీకు అభివందనాలు చెపుతున్నారు. అక్కడి మిత్రులకు పేరు పేరున మా అభివందనాలు చెప్పు.