[1] మీలో జగడాలకూ పోట్లాటలకూ కారణమేమిటి? మీ అవయవాలలో పోరాడుతున్న మీ సుఖాలకోసమైన కోరికలే గదా.
[2] మీరు ఏవేవో కావాలని కోరుతారు. అవి లేవు గనుక హత్య చేస్తారు. అపేక్షిస్తారు గాని కోరేది సంపాదించు కోలేరు. పోట్లాటలూ జగడాలూ జరిగిస్తారు. అయితే మీకు దొరకని కారణమేమంటే మీరు దేవుణ్ణి అడగడం లేదు.
[3] ఒక వేళ అడుగుతారు గాని మీ సుఖభోగాల కోసమే వాడుకోవాలని దురుద్దేశంతోనే అడుగుతారు గనుక మీకేమీ దొరకదు.
[4] వ్యభిచారులారా! వ్యభిచారిణులారా! లోకంతో స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? అందుచేత ఎవరైతే లోకంతో స్నేహం చేయాలని ఉద్దేశిస్తారో వారు దేవునికి విరోధులవుతారు.
[5] మనలో నివసిస్తున్న ఆత్మ తీవ్రంగా ఆకాంక్షిస్తాడా? అని చెప్పిన లేఖనం వ్యర్థం అనుకొంటున్నారా?
[6] అయితే ఆయన మరెక్కువ కృప ఇస్తాడు. అందుచేత దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గానీ వినయవంతులకు కృప చూపుతాడని చెపుతాడు.
[7] కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
[8] దేవుని దగ్గరకు రండి, అప్పుడాయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి.
[9] దుఃఖించండి, ఏడ్వండి, రోదనం చేయండి. మీ నవ్వు ఏడుపుకు, మీ సంతోషం విచారానికి మార్చుకోండి.
[10] ప్రభు సముఖంలో మిమ్ములను మీరే తగ్గించుకోండి, అప్పుడాయన మిమ్ములను పైకెత్తుతాడు.
[11] సోదరులారా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకోకండి. సోదరునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తీ తీర్పు తీర్చే వ్యక్తీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దానికి తీర్పు తీరుస్తున్నాడు. ఒకవేళ నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తుంటే దానిప్రకారం ప్రవర్తించేవాడివి కావు గాని దానికి తీర్పరిగా ఉన్నావు.
[12] ధర్మశాస్త్రకర్త ఒకడే. ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్థుడు. ఇతరులకు తీర్పు తీర్చడానికి నీవెవరివి?
[13] “ఈవేళో రేపో ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం గడిపి వ్యాపారం చేస్తూ లాభం సంపాదించు కొంటాం” అని చెప్పుకొనేవారలారా, వినండి
[14] రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ బ్రతుకు ఏపాటిది? అది కాసేపు కనబడి అంతలో అంతర్ధానమైపోయే ఆవిరిలాంటిది.
[15] దీనికి బదులుగా మీరు ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదీ అదీ చేస్తాం” అనాలి.
[16] ఇప్పుడైతే మీరు డాంబికులై గర్వంగా మాట్లాడుకొంటున్నారు. అలాంటి గర్వమంతా చెడ్డది.
[17] కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చేయని వాడికి అది పాపం.