[1] విదేశాల్లో చెదిరిపోయిన పన్నెండు గోత్రాలకు యాకోబు అభివందనాలతో రాస్తున్న విషయాలు. నేను దేవునికీ ప్రభువైన యేసుక్రీస్తుకూ దాసుణ్ణి.
[2] నా సోదరులారా, వివిధమైన విషమ పరీక్షలలో మీరు పడేటప్పుడెల్లా అదంతా ఆనందంగా ఎంచుకోండి.
[3] క్రీస్తుమీది మీ నమ్మకాన్ని పరీక్షించడం మీకు సహనం కలిగిస్తుందని మీకు తెలుసు గదా.
[4] మీరు ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయంలోనూ కొదువ లేనివారై ఉండేలా సహనం తన పని పూర్తి చేయనివ్వండి.
[5] మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అప్పుడది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది. దేవుడు నిందించకుండా అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు.
[6] అయితే ఆ వ్యక్తి అనుమానమేమీ లేకుండా నమ్మకంతో అడగాలి. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరిపడి కొట్టుకుపోయే సముద్రం అలలాంటివాడు.
[7] ఆ మనిషి చపలచిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడ లేనివాడు.
[8] గనుక తనకు ప్రభువువల్ల ఏమైనా దొరుకుతుందని అతడు అనుకోకూడదు.
[9] గౌరవం లేని సోదరుడు తన ఉన్నత స్థాయిని బట్టి అతిశయించాలి.
[10] ఆస్తిపరుడైన సోదరుడు తనకు వచ్చిన అగౌరవాన్ని బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఇతడు గడ్డిపువ్వులాగా గతించిపోతాడు.
[11] మాడ్చివేసే వేడితో ప్రొద్దు ఎక్కుతుంది, గడ్డిని ఎండిపోచేస్తుంది. గడ్డిపువ్వు రాలి దాని అందం పాడవుతుంది. అలాగే ఆస్తిపరుడు తన వ్యవహారాలలో నీరసించిపోతాడు.
[12] విషమపరీక్షను ఓర్చుకొనే మనిషి ధన్యజీవి. ఎందుకంటే అతడు పరీక్షకు నిలిచి మెప్పు పొందిన తరువాత అతనికి జీవ కిరీటం లభిస్తుంది. ప్రభువు తనను ప్రేమించేవారికి దానిని వాగ్దానం చేశాడు.
[13] ఎవరికైనా దుష్ట ప్రేరేపణ వస్తే ఆ వ్యక్తి “ఈ దుష్ట ప్రేరేపణ దేవుడు నాకు కలిగిస్తున్నాడు” అనకూడదు. ఎందుకంటే, దుర్మార్గత చేయడానికి దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం. అలాంటి ప్రేరేపణ ఎవరికీ కలిగించడు కూడా.
[14] ప్రతి ఒక్కరూ తన కోరికలు తనను ఆకర్షించి ఈడ్వడంవల్లే దుష్ట ప్రేరేపణకు గురి కావడం జరుగుతుంది.
[15] కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి చావును కంటుంది.
[16] నా ప్రియ సోదరులారా, మోసపోకండి.
[17] ప్రతి మంచి ఈవీ, పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరమూ పైనుంచే వస్తాయి, జ్యోతులకు కర్త అయిన తండ్రినుంచే వస్తాయి. ఆయన విషయంలో మార్పు, భ్రమణ ఛాయలు అంటూ ఏమీ లేవు.
[18] తన సృష్టిలో మనం తొలి పంటగా ఉండాలని తన సంకల్పం ప్రకారం తన సత్యవాక్కుద్వారా మనకు నూతన జన్మం కలిగించాడు.
[19] అందుచేత నా ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ వినడానికి ఆతురంగా, మాట్లాడడానికీ కోపగించడానికీ నిదానంగా ఉండాలి.
[20] ఎందుకంటే మనిషి కోపం దేవుని న్యాయాన్ని సాధించదు.
[21] అందుచేత సమస్తమైన మాలిన్యం, మిగిలి ఉన్న దుష్టత్వాన్ని విసర్జించి లోపల నాటుకొన్న వాక్కును అణుకువతో స్వీకరించండి. అది మీ ఆత్మలను రక్షించే శక్తిగలది.
[22] వాక్కు ప్రకారం ప్రవర్తిస్తూ ఉండండి. దానిని ఊరికే విని మిమ్ములను మీరే మోసగించుకోకండి.
[23] వాక్కు విని దాని ప్రకారం ప్రవర్తించని వ్యక్తి అద్దంలో తన ముఖం ఉన్నది ఉన్నట్టే చూచుకొనేవాడిలాగా ఉన్నాడు.
[24] అతడు తనను చూచుకొని అవతలికి వెళ్ళిన వెంటనే తానెలాంటివాడో మరచి పోతాడు.
[25] కానీ పరిపూర్ణ విముక్తి నియమంలోకి పరీక్షగా చూస్తూ తాను విన్నది మరవకుండా ఆచరణలో పెడుతూ ఉన్న వ్యక్తికి తాను చేస్తున్న దానిమీద దీవెన కలుగుతుంది.
[26] మీలో ఎవరైనా తాను మత నిష్ఠ గలవాణ్ణి అనుకొంటూ నాలుకను అదుపులో ఉంచుకోకుండా తన హృదయాన్ని తానే మోసగించుకొంటే అతడి మతం వట్టిదే!
[27] తండ్రి అయిన దేవుని దృష్టిలో కళంకం లేని పవిత్రమైన మతనిష్ఠ ఇదే – అనాథ పిల్లలనూ విధవరాండ్రనూ వారి కష్టాలలో సందర్శించి సహాయం చేయడం, లోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం.