Skip to content
Opens in a new window

[1] యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన వాక్కును నెరవేర్చడానికి, పారసీక దేశం చక్రవర్తి అయిన కోరెషు పరిపాలనలో మొదటి సంవత్సరంలో అతడి మనసును పురికొలిపాడు. తద్వారా పారసీక దేశం చక్రవర్తి కోరెషు రాజ్యమంతటా ఒక ప్రకటన చేయించి, దానిని వ్రాయించాడు. ఆ ప్రకటన ఇది:

[2] “పారసీక దేశం చక్రవర్తి కోరెషు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు: పరలోకంలో ఉన్న దేవుడైన యెహోవా లోకంలో ఉన్న అన్ని రాజ్యాలను నా వశం చేశాడు. యూదాలో ఉన్న జెరుసలంలో తనకోసం ఆలయాన్ని కట్టించమని ఆయన నాకు ఆదేశించాడు.

[3] మీలో ఆయన ప్రజలుగా ఉన్న వారికి వారి దేవుడు తోడుగా ఉంటాడు గాక! అలాంటివారు యూదాలో ఉన్న జెరుసలంకు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా ఆలయాన్ని కట్టాలి. ఆయనే జెరుసలంలో దేవుడు.

[4] ఆయన ప్రజలలో మిగిలినవారు ఎక్కడైతే కాపురముంటున్నారో అక్కడి ప్రజలు జెరుసలంలో ఆలయాన్ని కట్టించడానికి వారికి వెండి బంగారాలనూ ఆస్తిపాస్తులనూ పశువులనూ ఇష్టపూర్వకమైన కానుకలనూ ఇవ్వాలి.”

[5] అప్పుడు యూదాగోత్రం పెద్దలూ, బెన్యామీను గోత్రం పెద్దలూ, యాజులూ, లేవీగోత్రికులూ – ఎవరి మనసును దేవుడు పురికొలిపాడో వారందరూ జెరుసలంకు వెళ్ళడానికి, యెహోవా ఆలయాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు.

[6] వారి పొరుగువాళ్ళంతా ఇష్టపూర్వకమైన కానుకలు గాక, వెండి బంగారాలతో చేసిన వస్తువులనూ, ఆస్తిపాస్తులనూ, పశువులనూ ఇచ్చి వారిని ధైర్యపరచారు.

[7] అంతే గాక, నెబుకద్‌నెజరు జెరుసలంనుంచి తీసుకువచ్చి తన దేవుళ్ళ గుడిలో ఉంచిన యెహోవా ఆలయం వస్తువులను కోరెషుచక్రవర్తి బయటికి తెప్పించాడు.

[8] పారసీకదేశం చక్రవర్తి కోరెషు తన ఖజానాదారుడైన మిత్రదాతుచేత వాటిని బయటికి తెప్పించి, వాటిని లెక్క వేయించి, యూదావారి నాయకుడైన షేష్‌బజ్జరుకు ఇప్పించాడు.

[9] ఆ వస్తువుల లెక్క ఏమిటంటే, ముప్ఫయి బంగారు పళ్ళేలూ, వెయ్యి వెండి పళ్ళేలూ, ఇరవై తొమ్మిది కత్తులూ,

[10] ముప్ఫయి బంగారు గిన్నెలూ, నాలుగు వందల పది వెండితో చేసిన వేరే రకం గిన్నెలూ, వెయ్యి వేరు రకాల పాత్రలూ.

[11] బంగారు వస్తువులూ వెండి వస్తువులూ అన్నీ ఐదు వేల నాలుగు వందలు. బబులోనులో విదేశీయులుగా ఉన్న ఆ జనం అక్కడనుంచి జెరుసలంకు ప్రయాణం చేసినప్పుడు షేష్‌బజ్జరు ఆ వస్తువులన్నీ తీసుకువచ్చాడు.

ఎజ్రా — Chapters