[1] యూదా ప్రజలంతా అమజ్యా కొడుకు ఉజ్జియాను అతని తండ్రి స్థానంలో రాజుగా చేశారు. అప్పుడు ఉజ్జియా వయస్సు పదహారు సంవత్సరాలు.
[2] అమజ్యారాజు కన్నుమూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరిన తరువాత ఉజ్జియా ఏలత్ పట్టణం మళ్ళీ యూదా ప్రజల స్వాధీనం చేసి దానిని తిరిగి కట్టించాడు.
[3] ఉజ్జియా రాజయినప్పుడు అతడి వయస్సు పదహారు సంవత్సరాలు. అతడు జెరుసలంలో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు యకొల్యా. ఆమె జెరుసలం నగరవాసి.
[4] ఉజ్జియా తన తండ్రి అమజ్యాలాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు.
[5] దేవ దర్శనాల విషయం అతనికి జెకర్యా ఉపదేశించేవాడు. జెకర్యా బ్రతికినన్నాళ్ళు ఉజ్జియా యెహోవాను వెదికి అనుసరించాడు. యెహోవాను వెదికి అనుసరించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లేట్టు చేశాడు.
[6] అతడు ఫిలిష్తీయవాళ్ళపై యుద్ధం చేయడానికి వెళ్ళి, గాత్, యాబనె, అష్డోదు పట్టణాల గోడలను పడగొట్టాడు. అష్డోదు ప్రాంతంలో, ఫిలిష్తీయవాళ్ళమధ్య పట్టణాలను తిరిగి కట్టించాడు.
[7] ఫిలిష్తీయవాళ్ళపై గూర్‌బయల్‌లో ఉన్న అరబ్బులమీద మెహూనువాళ్ళపై యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు.
[8] అమ్మోనువాళ్ళు ఉజ్జియాకు కప్పం చెల్లించేవాళ్ళు. అతనికి చాలా బలాభివృద్ధి చేకూరింది గనుక, అతని ప్రఖ్యాతి ఈజిప్ట్ సరిహద్దుల వరకు వ్యాపించింది.
[9] ఉజ్జియా జెరుసలంలో “మూలద్వారం” దగ్గర, “లోయద్వారం” దగ్గర, గోడకోణం దగ్గర గోపురాలు కట్టించి, వాటిని దిట్టం చేశాడు.
[10] కొండ దిగువ ప్రాంతాలలో, మైదానాల ప్రాంతాలలో అతనికి పశుసంపద చాలా ఉన్నది గనుక అతడు ఎడారిలో కూడా గోపురాలు కట్టించాడు, తొట్లు నిర్మించాడు. వ్యవసాయమంటే అతనికి ఎంతో ఇష్టం గనుక కొండసీమలలో, సారవంతమైన భూములలో అతనికి కర్షకులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు.
[11] యుద్ధానికి సిద్ధమైన సైన్యం ఉజ్జియాకు ఉన్నది. సైనికులు లెక్క ప్రకారం గుంపులుగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళేవారు. రాజు అధిపతులలో కార్యదర్శి మయశేయా, యెహీయేల్ అనే అధికారి వారి లెక్కలు తయారు చేశారు. వీరు హననయా చేతిక్రింద ఉన్నవారు.
[12] ఆ యుద్ధవీరులపై రెండు వేల ఆరు వందలమంది అధికారులున్నారు. వారంతా పూర్వీకుల కుటుంబాల నాయకులు.
[13] యుద్ధానికి బాగా తర్బీతు పొందిన మూడు లక్షల ఏడు వేల అయిదు వందలమంది వారి చేతిక్రింద ఉన్నారు. రాజును అతని శత్రువుల బారి నుంచి కాపాడడానికి ఇది బలమైన సైన్యం.
[14] ఉజ్జియా, సైన్యమంతటికీ డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విండ్లు, వడిసెలలు సరఫరా చేశాడు.
[15] పెద్ద రాళ్ళను, బాణాలను విసరడానికి నేర్పుగలవారు కల్పించిన యంత్రాలు జెరుసలంలో తయారు చేయించాడు. వాటిని గోపురాలలో, మూలలో ఉంచాడు. అతడు సుస్థిరమయ్యేవరకు దేవుడు అతనికి అద్భుతంగా సహాయం చేశాడు గనుక అతని ప్రఖ్యాతి దూర ప్రాంతాలకు కూడా వ్యాపించింది.
[16] ఉజ్జియా సుస్థిరమైన తరువాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాపట్ల నమ్మకంగా ఉండక యెహోవా ఆలయంలో ధూపవేదికమీద ధూపం వేయడానికి ప్రవేశించాడు.
[17] అజరయాయాజి, యెహోవాకు సేవ చేసే ఇతర యాజులు ఎనభైమంది ఉజ్జియా వెంట లోపలికి వెళ్ళారు. వారంతా ధైర్యం గలవారు.
[18] వారు ఉజ్జియారాజును ఎదురాడి ఇలా చెప్పారు: “ఉజ్జియా, యెహోవాకు ధూపం వెయ్యడం నీ పని కాదు. అహరోను సంతానమైన యాజులే ఆ పని చెయ్యాలి. ధూపం వెయ్యడానికి వారే ప్రతిష్ఠమైనవారు. పవిత్ర స్థలంనుంచి వెళ్ళు. నీవు అపనమ్మకస్తుడివయ్యావు. దానివల్ల యెహోవాదేవుడు నిన్ను ఘనపరచడు.”
[19] ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు ధూపార్తి చేతపట్టుకొని ధూపం వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా ఆలయంలో ధూపవేదికముందు యాజుల మీద అతడు కోపగిస్తూ ఉండగానే వారి సమక్షంలో అతని నొసట కుష్ఠు పుట్టింది.
[20] ప్రముఖయాజి అయిన అజరయా, అతనితో ఉన్న మిగతా యాజులు అతనివైపు చూచినప్పుడు అతని నొసట కుష్ఠు కనిపించింది. గనుక వారు అతణ్ణి త్వరగా బయటికి వెళ్ళేట్టు చేశారు. యెహోవా అతణ్ణి అలా మొత్తినందుచేత అతడే బయటికి వెళ్ళడానికి త్వరపడ్డాడు.
[21] ఉజ్జియా చనిపోయే రోజువరకు కుష్ఠురోగి. కుష్ఠురోగి కావడంచేత అతడు యెహోవా ఆలయంలో ప్రవేశించలేక, ప్రత్యేకమైన ఇంటిలో నివాసం చేశాడు. అతడి కొడుకు యోతాం రాజభవనంమీద అధికారిగా ఉండి, దేశప్రజలను పరిపాలించాడు.
[22] ఉజ్జియాను గురించిన ఇతర విషయాలు మొదటినుంచి చివరివరకు ఆమోజు కొడుకైన యెషయా ప్రవక్త వ్రాశాడు.
[23] ఉజ్జియా కన్నుమూసి తనపూర్వీకుల దగ్గరికి చేరాడు. “అతడు కుష్ఠురోగి గదా” అని వారి సమాధులకు దగ్గర్లో, రాజులకు చెందిన శ్మశాన భూమిలో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు యోతాం రాజయ్యాడు.