[1] రెహబాం జెరుసలం చేరుకొన్నాడు. అక్కడ యూదా గోత్రంవారిలో, బెన్యామీను గోత్రంవారిలో ఉత్తములైన సిపాయిలను పోగుచేశాడు. వారు లక్ష ఎనభై వేలమంది. వారు ఇస్రాయేల్ రాజ్యంమీద యుద్ధం చేసి, తనకు ఆ రాజ్యం సంపాదించాలని రెహబాం ఉద్దేశించాడు.
[2] కాని, దేవుని మనిషి అయిన షెమయాకు యెహోవానుంచి ఈ వాక్కు వచ్చింది.
[3] “యూదావారికి రాజుగా ఉన్న సొలొమోను కొడుకు రెహబాంకూ, యూదాలో, బెన్యామీనులో ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరికీ ఇలా చెప్పు:
[4] యెహోవా ఈవిధంగా చెప్తున్నాడు – మీరు వెళ్ళి మీ బంధువులతో యుద్ధం చేయకూడదు. జరిగినదానిని నేనే జరిగించాను. గనుక మీరంతా మీమీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి.” అలాగే వారు యెహోవా మాట విని, యరొబాంతో యుద్ధానికి వెళ్ళడం మాని తిరిగి వచ్చారు.
[5] రెహబాం జెరుసలంలో కాపురం ఉంటూ, యూదాలో కొన్ని పట్టణాలలో రక్షణార్థమైన కట్టడాలను కట్టించాడు.
[6] ఆ పట్టణాలు ఏవంటే, బేత్లెహేం, ఏతాం, తెకోవ,
[7] బేత్‌సూరు, శోకో, అదుల్లాం,
[8] గాత్, మారేషా, జీపు,
[9] ఆదోరయీం, లాకీషు, అజేకా,
[10] జొర్యా, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులలో ఉన్నాయి. అవి కోటలూ గోడలూ ఉన్న ఊళ్ళు.
[11] రెహబాం వాటి కోటలనూ గోడలనూ బలంగా చేసి, వాటిలో అధిపతులను ఉంచాడు. వాటికి ఆహారపదార్థాలు, నూనె, ద్రాక్షరసం సరఫరా చేశాడు.
[12] ఆ ఊళ్ళన్నిటిలో డాళ్ళను, ఈటెలను ఉంచి, వాటిని చాలా బలమైన ఊళ్ళుగా చేశాడు. ఈ విధంగా యూదా బెన్యామీనులు అతడి వంశంలో ఉండిపొయ్యాయి.
[13] ఇస్రాయేల్‌వారిమధ్య నివసిస్తున్న యాజులు, లేవీ గోత్రికులు తమ ప్రాంతాలన్నిటినుంచి వచ్చి రెహబాం దగ్గరికి చేరారు.
[14] యాజి ధర్మం జరిగించనివ్వకుండా లేవీగోత్రికులను యరొబాం, అతడి కొడుకులు త్రోసివేశారు. గనుక వారు తమ పచ్చిక మైదానాలనూ ఆస్తిపాస్తులనూ విడిచి, యూదాకు, జెరుసలంకు వచ్చారు.
[15] బలిపీఠాలకు, దయ్యాలకు, తాను చేయించిన దూడ ఆకారాలకు పూజారులుగా ఉండడానికి యరొబాం తానే మనుషులను నియమించాడు.
[16] ఇలా ఉండగా, ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను వెదకుదామని మనసులో నిశ్చయించుకొన్నవారు ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో కొందరు ఉన్నారు. తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించేందుకు వారు జెరుసలంకు లేవీగోత్రికులను అనుసరించారు.
[17] దావీదు, సొలొమోను నడిచిన మార్గాన్నే వారు మూడేళ్ళు అనుసరించారు. ఈ మూడు సంవత్సరాలు యూదా రాజ్యాన్ని బలపరచి, సొలొమోను కొడుకు రెహబాంకు సహాయం చేసేవారు.
[18] రెహబాం మహలతునూ అబీహాయిల్‌నూ పెండ్లి చేసుకొన్నాడు. మహలతు దావీదు కొడుకైన యెరీమోతు కూతురు. అబీహాయిల్ యెష్షయి కొడుకైన ఏలీయాబ్ కూతురు.
[19] రెహబాంకు యషు, షెమరయా, జహం అనే కొడుకులు పుట్టారు.
[20] ఆ తరువాత అతడు అబ్‌షాలోం కూతురైన మయకాను పెండ్లి చేసుకొన్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు.
[21] రెహబాంకు పద్ధెనిమిదిమంది భార్యలు, అరవైమంది ఉంపుడుకత్తెలు ఉన్నారు. ఇరవై ఎనిమిదిమంది కొడుకులు అరవైమంది కూతుళ్ళు పుట్టారు. తన భార్యలందరిలోకి, ఉంపుడుకత్తెలందరిలోకి అబ్‌షాలోం కూతురు మయకా అంటే రెహబాంకు ఎక్కువ ప్రేమ.
[22] మయకా కొడుకు అబీయాను రాజుగా చేయాలనుకొని, రెహబాం అతణ్ణి తన సోదరులపైన ప్రముఖుడుగానూ, నాయకుడుగానూ నియమించాడు.
[23] రెహబాం తెలివిగా ప్రవర్తిస్తూ, తక్కిన తన కొడుకులను యూదాలో, బెన్యామీనులో వేరు వేరు ప్రాంతాలకూ, కోటలూ గోడలూ ఉన్న ఊళ్ళకు పంపాడు. వారికి సమృద్ధిగా పోషణ ఇచ్చి వారికి అనేక పెండ్లిండ్లు చేశాడు.