Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:29

[1] ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.

[2] ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు.

[3] అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు.

[4] పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు.

[5] ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు.

[6] ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు.

[7] “సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు.

[8] అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, “ఇక్కడ కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!” అన్నారు.

[9] “వీడే” అని కొందరూ, “వీడు కాదు” అని కొందరూ అన్నారు. ఇక వాడైతే, “అది నేనే” అన్నాడు.

[10] వారు, “నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని వాణ్ణి అడిగారు.

[11] దానికి వాడు, “యేసు అనే ఒకాయన బురద చేసి నా కళ్లపై పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అన్నాడు.

[12] వారు, “ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగితే వాడు, “నాకు తెలియదు” అన్నాడు.

[13] ఇంతకు ముందు గుడ్డి వాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకు వెళ్ళారు.

[14] యేసు బురద చేసి వాడి కళ్ళు తెరచిన రోజు విశ్రాంతిదినం.

[15] వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, “ఆయన నా కన్నులపై బురద పూశాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అని వారికి చెప్పాడు.

[16] “ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుండి రాలేదు” అని పరిసయ్యుల్లో కొందరు అన్నారు. మరి కొందరు, “ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది.

[17] దాంతో వారు గుడ్డివాడుగా ఉన్నవాడితో, “నీ కళ్ళు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. అప్పుడు వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.

[18] వాడు గుడ్డివాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తల్లిదండ్రులను పిలిపించారు.

[19] “గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని వారిని అడిగారు.

[20] దానికి వాడి తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు.

[21] అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కళ్ళు తెరిచినదెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకోగలడు” అన్నారు.

[22] వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయనను క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సమాజ మందిరాల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

[23] కాబట్టే వాడి తల్లిదండ్రులు ‘వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి’ అన్నారు.

[24] కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు.

[25] అందుకు వాడు, “ఆయన పాపాత్ముడో కాదో నాకేం తెలుసు? అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను” అన్నాడు.

[26] దానికి వారు, “అసలు ఆయన నీకేం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని మళ్ళీ అడిగారు.

[27] దానికి వాడు, “ఇంతకు ముందే మీకు చెప్పాను. మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి?” అని వారితో అన్నాడు.

[28] అందుకు వారు “నువ్వే వాడి శిష్యుడివి. మేము మోషే శిష్యులం.

[29] దేవుడు మోషేతో మాట్లాడాడని తెలుసు కానీ ఈ మనిషి విషయమైతే అసలు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు” అంటూ వాణ్ణి బాగా దూషించారు.

[30] అయితే వాడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా ఆయన నా కళ్ళు తెరిచాడు.

[31] దేవుడు పాపుల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు.

[32] గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం మొదలైనప్పటి నుండి ఎవరూ వినలేదు.

[33] ఈయన దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటివి చేయలేడు” అని చెప్పాడు.

[34] దానికి వారు, “పాపిగా పుట్టిన వాడివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అని చెప్పి వాణ్ణి తమ సమాజ మందిరం నుండి బహిష్కరించారు.

[35] పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కలుసుకుని, “నువ్వు దేవుని కుమారుడిలో విశ్వాసముంచుతున్నావా?” అని వాణ్ణి అడిగాడు.

[36] అందుకు వాడు, “ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే” అన్నాడు.

[37] యేసు, “ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు.

[38] అప్పుడు వాడు, “నేను నమ్ముతున్నాను ప్రభూ” అంటూ ఆయనను ఆరాధించాడు.

[39] అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు.

[40] ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, “అయితే మేము కూడా గుడ్డివాళ్ళమేనా?” అని అడిగారు.

[41] అందుకు యేసు, “మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ ‘మాకు చూపు ఉంది’ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పాడు.

యోహాను రాసిన సువార్త — Chapters