Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:40

[1] మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది.

[2] ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు.

[3] విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది.

[4] యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు.

[5] ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది.

[6] యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి.

[7] యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు.

[8] అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు.

[9] ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో,

[10] “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.

[11] యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.

[12] ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ వారు కొన్ని రోజులు ఉన్నారు.

[13] యూదుల పండగ పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు.

[14] అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు.

[15] ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వారందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులనూ కూడా అక్కడి నుంచి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వారి బల్లలను పడదోశాడు. వారి డబ్బును చెల్లాచెదరు చేశాడు.

[16] పావురాలు అమ్మేవారితో ఆయన, “వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి” అన్నాడు.

[17] ఆయన శిష్యులు, “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది” అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు.

[18] అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు ఈ పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి ఏ సూచన చూపుతావు?” అన్నారు.

[19] దానికి యేసు, “ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీన్ని లేపుతాను” అన్నాడు.

[20] అప్పుడు యూదు అధికారులు, “ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీన్ని మూడు రోజుల్లోనే లేపుతావా?” అన్నారు.

[21] అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి.

[22] ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.

[23] ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు.

[24] అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు.

[25] ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.

యోహాను రాసిన సువార్త — Chapters