Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:59

[1] కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి.

[2] దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.

[3] మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం.

[4] ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే.

[5] దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.

[6] కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.

[7] కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే

[8] అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.

[9] నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు.

[10] కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను. కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు.

[11] వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.”

[12] సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి.

[13] పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.

[14] ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.

[15] దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.”

[16] దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా!

[17] దేవుడు నలభై ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో రాలి పోయాయి.

[18] తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు?

[19] దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేక పోయారని మనం చూశాము.

హెబ్రీయులకు రాసిన పత్రిక — Chapters