[1] మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.
[2] మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
[3] మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.
[4] మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.
[5] కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”
[6] ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు.
[7] హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు.
[8] కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట.
[9] ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా?
[10] మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు.
[11] అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
[12] కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి.
[13] మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి
[14] అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.
[15] దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి.
[16] లైంగిక అవినీతిని సాగించేవారుగానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేని వాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి.
[17] ఏశావు ఆ తరవాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
[18] చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు.
[19] బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు.
[20] ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ.
[21] భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు.
[22] ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.
[23] పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.
[24] ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.
[25] మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?
[26] ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.”
[27] “మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది.
[28] కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం.
[29] ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.