Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:37

[1] పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు.

[2] వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు.

[3] వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు.

[4] కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు.

[5] మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.

[6] ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు.

[7] వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు.

[8] పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా,

[9] ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా.

[10] మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు.

[11] ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది.

[12] ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”

[13] వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.

[14] బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.

[15] అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని,

[16] ‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం.

[17] అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు.

[18] అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు.

[19] అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి.

[20] మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.

[21] ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు.

[22] అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.

[23] పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు.

[24] వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.

[25] యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు?

[26] ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.

[27] ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా

[28] హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు.

[29] ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా,

[30] నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’

[31] వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.

[32] విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు.

[33] అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది.

[34] భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.

[35] వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.

[36] సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’

[37] ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

అపొస్తలుల కార్యములు — Chapters