[1] తియొఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత
[2] ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు వరకూ ఆయన చేసిన, బోధించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథాన్ని రచించాను.
[3] ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు.
[4] ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి.
[5] యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”
[6] వారు సమకూడినప్పుడు, “ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?” అని శిష్యులు అడగగా ఆయన,
[7] “కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.
[8] “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.
[9] ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.
[10] ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి,
[11] “గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.
[12] అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.
[13] వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఉద్యమ కారుడైన సీమోను, యాకోబు కుమారుడు యూదా.
[14] వీరూ, వీరితో కూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
[15] ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి,
[16] “సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది.
[17] ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు.
[18] ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొన్నాడు. అతడు తలకిందులుగా పడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి.
[19] ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని ‘అకెల్దమ’ అంటున్నారు. దాని అర్థం ‘రక్త భూమి.’ ఇందుకు రుజువుగా,
[20] ‘అతని ఇల్లు పాడైపోవు గాక, దానిలో ఎవ్వడూ కాపురముండకపోవు గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక,’ అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.
[21] “కాబట్టి యోహాను బాప్తిసమిచ్చింది మొదలు ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిన రోజు వరకూ,
[22] ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి” అని చెప్పాడు.
[23] అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి,
[24] ఈ విధంగా ప్రార్థించారు. “అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ,
[25] తన చోటికి వెళ్ళడానికి యూదా దారి తప్పి పోగొట్టుకొన్న ఈ పరిచర్యలో, అపొస్తలత్వంలో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్న వాణ్ణి చూపించు.”
[26] తరువాత శిష్యులు వారిద్దరి మీదా చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.