Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:18

[1] యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి: దేవుడు తన అపొస్తలునిగా పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు.

[2] దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియచేసాడు.

[3] ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువు అయిన యేసు క్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు.

[4] పవిత్రమైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో బ్రతికించి, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించినాడు.

[5] ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది ఆయన కోసం అపొస్తలుడనయ్యాను. ప్రజలందరు సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని ఉద్ధేశ్యం.

[6] యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు.

[7] అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైన వాళ్ళు. ఆయిన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు. మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక!

[8] మీ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలిసింది. కనుక నన్ను ముందు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు అర్పించనివ్వండి.

[9] నేను దేవుని కుమారుని సువార్తను ప్రకటించి మనస్పూర్తిగా ఆయన సేవ చేస్తున్నాను.

[10] నేను ప్రార్థనలు చేసినప్పుడెల్లా విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంటాను. దానికి ఆ దేవుడే సాక్షి. చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావటానికి దైవేచ్చవల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను.

[11] మీకు ఆధ్యాత్మిక శక్తి కలిగేటట్లు ఆత్మీయవరాన్ని అందించాలని మీ దగ్గరకు రావాలనుకొంటున్నాను.

[12] అంటే మీరూ, నేనూ మనలోవున్న విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సాహపరచు కోవాలని ఆశిస్తున్నాను.

[13] సోదరులారా! నేను, మిగతా యూదులుకాని వాళ్ళనుండి ఫలం పొందినట్లే మీ నుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక.

[14] గ్రీకులకు, గ్రీకులు కాని వాళ్ళకు, జ్ఞానులకు, అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది.

[15] అందుకే రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని అనుకొంటున్నాను.

[16] సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది.

[17] ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడివుంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైన వాడు అనంతజీవితం పొందుతాడు” అని వ్రాయబడి ఉంది.

[18] భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు.

[19] తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.

[20] కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.

[21] ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అందకారమైపోయాయి.

[22] వాళ్ళు తాము తెలివిగల వాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు.

[23] ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.

[24] అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చు కోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు.

[25] దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!

[26] పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల, దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేసాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.

[27] అదే విధంగా, పురుషులు కూడా స్త్రీలతో సహజ సంపర్కాలు వదిలివేసి పురుషులతో సంపర్కం పొందాలనే కోరికలతో చెలరేగి పోయారు. పురుషులు పురుషులతో అసహజమైన సహవాసాలు చేసి తమ అసహజతకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తున్నారు.

[28] పైగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్కచెయ్యలేదు. కనుక దేవుడు వాళ్ళను వాళ్ళ నీఛ బుద్దికి వదిలి వేసాడు. తద్వారా వాళ్ళు చెయ్యరాని పనులు చేసారు.

[29] అన్యాయం, దుష్టత్వం, దురాశ, దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ అనే గుణాలు వాళ్ళలో సంపూర్ణంగా నిండి పోయాయి. వాళ్ళు వృధాగా మాట్లాడుతూ,

[30] ఇతర్లను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతర్లపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకొంటూ జీవిస్తూ ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకలా మార్గాలు కనిపెడ్తూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు.

[31] వాళ్ళలో తెలివిలేదు. విశ్వాసము లేదు, హృదయము లేదు, కనికరం లేదు.

[32] దేవుని నీతి నియమములకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకు మరణ శిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చేసే వాళ్ళను మెచ్చుకొంటూ ఉంటారు.

రోమీయులకు వ్రాసిన లేఖ — Chapters