[1] యెహోవా దేవుడు మోషేను పిలిచి, సన్నిధి గుడారంలో నుండి అతనితో మాట్లాడాడు. యెహోవా అన్నాడు:
[2] “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, ఆవుల మందలోనుండి గాని, గొర్రెల మందలోనుండి గాని దానిని తీసుకొని రావాలి.
[3] “ఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని దహనబలిగా అర్పిస్తుంటే, అది నిర్దోషమైన గిత్తయి వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ అర్పణను అంగీకరిస్తాడు.
[4] ఈ వ్యక్తి ఆ గిత్త తలమీద తన చేయి పెట్టాలి. ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ దహనబలి అర్పణను యెహోవా అంగీకరిస్తాడు.
[5] “ఆ వ్యక్తి యొక్క గిత్తను యోహోవా ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ గిత్త రక్తాన్ని తీసుకొని రావాలి. సన్నిధి గుడారపు ద్వారం దగ్గర బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని వారు చిలకరించాలి.
[6] అతడు ఆ పశువు చర్మాన్ని ఒలిచి, ఆ పశువును ముక్కలుగా నరకాలి.
[7] యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి.
[8] యాజకులైన అహరోను కుమారులు ఆ ముక్కలను (తల, కొవ్వు) కట్టెలు మీద పెట్టాలి. ఆ కట్టెలు బలిపీఠం మీద నిప్పుల్లో ఉంటాయి.
[9] ఆ పశువు లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. తర్వాత ఆ పశువు అవయవాలు అన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
[10] “ఒక వ్యక్తి గొర్రెనుగాని మేకనుగాని దహన బలిగా అర్పిస్తుంటే, ఏ దోషం లేని మగదానిని మాత్రమే అతడు అర్పించాలి.
[11] ఆ వ్యక్తి బలిపీఠానికి ఉత్తరాన, యెహోవా ఎదుట ఆ జంతువును వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు, ఆ జంతువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
[12] అప్పుడు యాజకుడు ఆ జంతువును ముక్కలుగా నరకాలి. ఆ జంతువు తల, కొవ్వులను యాజకుడు ఉంచుకొంటాడు. ఆ ముక్కలను యాజకుడు కట్టెల మీద చక్కగా పేర్చాలి. బలిపీఠం మీద నిప్పుల్లో ఆ కట్టెలు ఉంటాయి.
[13] లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. అప్పుడు యాజకుడు ఆ జంతువు అవయవాలన్నింటినీ అర్పించి, బలిపీఠం మీద దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
[14] “ఒక వ్యక్తి ఒక పక్షిని యెహోవాకు దహన బలిగా అర్పించాలను కొంటే, తెల్ల గువ్వ, లేక పావురం పిల్ల మాత్రమే యివ్వాలి.
[15] అర్పణను యాజకుడు ఆ బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు ఆ పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు ఆ పక్షిని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కగా కార్చివెయ్యాలి.
[16] యాజకుడు ఆ పక్షి మేత పొట్టను, దాని ఈకలను తీసివేసి, బలిపీఠానికి తూర్పుగా పారవేయాలి. ఇది వారు బలిపీఠపు బూడిదను పారవేసేచోటు.
[17] అప్పుడు యాజకుడు ఆ పక్షి రెక్కలను పట్టి చీల్చాలి గాని దానిని రెండు భాగాలుగా విడదీయకూడదు. బలిపీఠం మీద అగ్నిలో ఉన్న కట్టెలపైన ఆ పక్షిని యాజకుడు దహించాలి. అది అగ్నిపైన అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.