Skip to content
Opens in a new window

[1] మరొకసారి యెహోవా మాట నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు:

[2] “నరపుత్రుడా, నా తరపున మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘నీవు దుఃఖపడి, “భయంకరమైన రోజు దరిచేరుతున్నది” అని ప్రకటించుము.

[3] ఆ రోజు దగ్గరలో ఉంది! అవును. యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గర పడుతున్నది. అది మేఘాల రోజు. అది రాజ్యాలపై తీర్పు ఇచ్చే సమయం!

[4] ఈజిప్టు మీదకి ఒక కత్తి వస్తుంది! ఈజిప్టు పతనమయ్యే సమయాన ఇథియోపియ (కూషు) ప్రజలు భయంతో చెదరిపొతారు. ఈజిప్టు ప్రజలను బబులోను సైన్యం బందీలుగా పట్టుకుపోతుంది. ఈజిప్టు పునాదులు కదిలిపోతాయి!

[5] “‘ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ (కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన దేశము) ప్రజలు-అందరూ నాశనం చేయబడతారు!

[6] “‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అవును. ఈజిప్టును బలపర్చిన వారంతా పడిపోతారు! దాని బలగర్వం తగ్గి పోతుంది. మిగ్దోలు నుండి ఆశ్వన్ (సెవేనే) వరకు గల ఈజిప్టు ప్రజలంతా చంపబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!

[7] నాశనం చేయబడిన దేశాలలో ఈజిప్టు కూడా కలిసిపోతుంది. శూన్యంగా మిగిలిన రాజ్యాలలో ఈజిప్టులో ఒకటి అవుతుంది.

[8] ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను. దానితో దాని సహాయకులు నాశనమై పోతారు. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

[9] “‘ఆ సమయాన నేను దూతలను పంపుతాను. వారు ఓడలలో పయనించి ఇథియోపియ (కూషు)కు దుర్వార్త తీసుకొని వెళతారు. ఇథియోపియ ఇప్టుడు క్షేమంగా ఉన్నాననుకుంటూ ఉంది. కాని ఈజిప్టు శిక్షించ బడినప్పుడు ఇథియోపియ ప్రజలు భయంతో కంపించిపోతారు. ఆ సమయం వస్తూ ఉంది!’”

[10] నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “బబులోను రాజైన నెబుకద్నెజరును నేను వినియోగించి ఈజిప్టు ప్రజలను నాశనం చేస్తాను.

[11] నెబుకద్నెజరు, అతని మనుష్యులు జాతులన్నిటిలోనూ అతి భయంకరులు. ఈజిప్టును నాశనం చేయటానికి వారిని తీసుకొనివస్తాను. ఈజిప్టు మీద వారు తమ కత్తులు దూస్తారు. వారు దేశాన్ని శవాలతో నింపివేస్తారు.

[12] నైలునది ఎండిపోయేలా నేను చేస్తాను. అలా ఎండిన భూభూగాన్ని దుష్ట జనులకు అమ్మి వేస్తాను. ఆ భూమిని నిర్మానుష్యం చేయటానికి నేను అన్యజనులను వినియోగిస్తాను. యెహోవానైన నేను ఈ విషయాలు చెపుతున్నాను!”

[13] నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టులో ఉన్న విగ్రహాలను కూడా నేను నాశనం చేస్తాను. మెంఫిస్ (నొపు)లో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను. ఈజిప్టులో ఇక ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు. ఈజిప్టు రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను.

[14] పత్రోసును శూన్య రాజ్యంగా మార్చివేస్తాను. సోయనులో అగ్ని రగుల్చుతాను. ‘నో’ నగరాన్ని శిక్షిస్తాను.

[15] ఈజిప్టుకు కోటవలె అండగా నిల్చిన సీను మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను! ‘నో’ నగర వాసులను నేను నాశనం చేస్తాను.

[16] ఈజిప్టులో నేను అగ్ని ముట్టిస్తాను. సీను అనబడే ప్రాంతం భయానికి గురియవుతుంది. ‘నో’ నగరంలోకి సైనికులు విరుచుకుపడ్తారు. శత్రువులు దాన్ని పగటిపూట ఎదుర్కొంటారు.

[17] ఓను, పిబేసెతు పట్టణాల యువకులు యుద్ధంలో చనిపోతారు. స్త్రీలు బందీలుగా పట్టుకుపోబడతారు.

[18] ఈజిప్టు ఆధిపత్యాన్ని (కాడిని) తహపనేసులో నేను విరిచినప్పుడు అక్కడ అంధకారం ఏర్పడుతుంది. ఈజిప్టు యొక్క బలగర్వం అంతమవుతుంది! ఈజిప్టును ఒక మేఘం ఆవరిస్తుంది. ఆమె కుమార్తెలు చెరపట్టబడి తీసుకుపో బడతారు.

[19] ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!”

[20] చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్) ఏడవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:

[21] “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరో చేతిని (శక్తిని) నేను విరచివేశాను. ఆ చేతికి ఎవ్వరూ కట్టు కట్టలేరు. ఆది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి పట్టే బలాన్ని పుంజుకోలేదు.”

[22] నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి కత్తి జారి కిందపడేలా చేస్తాను.

[23] ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను.

[24] బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు.

[25] ఆ విధంగా బబులోను రాజు చేతులను బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చుతాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. “నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచుతాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురుతాడు.

[26] నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమివేస్తాను. అప్పడు నేను యెహోవానని వారు తెలుసుకొంటారు.”

యెహెజ్కేలు — Chapters